హైదరాబాద్‌లో ఐకియా ఫర్నిచర్ సెంటర్!
దేశంలోనే మొదటిది సుమారు రూ. 600 కోట్లతో ఏర్పాటు
సీఎం కేసీఆర్‌తో కంపెనీ ప్రతినిధుల భేటీ
హైదరాబాద్: స్వీడన్‌కు చెందిన ఐకియా కంపెనీ భారతదేశంలోనే తన మొదటి ఫర్నిచర్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. సుమారు 600 కోట్ల రూపాయలతో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొంది. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో కంపెనీ సీఈవో జువెనికో మెజ్టు, సీఎఫ్‌వో ప్రీత్దాపర్లు భేటీ అయ్యారు. ఫర్నిచర్ సెంటర్ ఏర్పాటు గురించి వివరించారు. కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో ఫర్నిచర్ సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చినందుకు కంపెనీ ప్రతినిధులను సీఎం కేసీఆర్ అభినందించారు. సింగిల్ విండో ద్వారా అన్ని అనుమతులు మంజూరు చేస్తామని, సీఎం కార్యాలయంలోనే ప్రత్యేక చేజింగ్ సెల్ కూడా ఏర్పాటుచేస్తామని చెప్పారు. ఫర్నిచర్ తయారీలో వృత్తి నిపుణులు, వరంగల్‌లోని కార్పెట్ తయారీదారులు, స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సహకారాన్ని తీసుకుంటామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. విదేశాల్లో ఉన్న తమ స్టోర్లను సందర్శించాలని కేసీఆర్‌ను, ఇతర ఉన్నతాధికారులను జువెనికో కోరారు.
కాగా, భారతదేశంలోనే మొట్టమొదటగా 100 శాతం విదేశీ రిటైల్ పెట్టుబడితో ఏర్పాటుకానున్న కంపెనీ ఇదేనని సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఐకియా కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల్లో 338 స్టోర్లు ఉన్నాయి. ఈ సమావేశంలో రాష్ట్ర సీఎస్ రాజీవ్ శర్మ, సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, పరిశ్రమలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, ఏపీఐఐసీ ఎండీ జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.