బాలిక విద్యకు ప్రాముఖ్యత
నందిపేట్ (ఆర్మూర్) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాలికల విద్యకు ప్రాముఖ్యతనిస్తూ, అందుకు కావాల్సిన అన్ని సౌకార్యాలను కల్పిస్తుందని కలెక్టర్ రామ్మోహాన్‌రావు అన్నారు. నందిపేట మండలంలోని అయిలాపూర్ ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం బడిబాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం పాఠశాల తరగతి గదులలో ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాసు రూంలను పరిశీలించారు.
చక్కగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ బడిఈడు పిల్లలందరినీ పాఠశాలలో చేర్పించాలని సూచించారు. బాలికల విద్యకు ప్రాముఖ్యతనిస్తూ ప్రభుత్వ విద్యతో పాటు ఆత్మస్థైర్యం కోసం మార్షల్ ఆర్ట్స్ శిక్షణ లాంటివాటిలో శిక్షణనిస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 2822 మంది బడిబయట పిల్లలను బడిలో చేర్పించామన్నారు. మహిళల ప్రాతినిథ్యం పెరుగుతున్న నేపథ్యంలో బాలికలను ఉన్నత విద్యలు చదివించాలని తల్లిదండ్రులను కోరారు.
బాలికలు చదివితే గ్రామం చదివినట్టేనన్నారు. పాఠశాల అభివృద్ధికి తోడ్పడుతున్న సర్పంచు, గ్రామాభివృద్ది కమిటీ సభ్యులను అబినందించారు. అనంతరం జిల్లా విద్యాధికారి రాజేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అన్ని సౌకార్యలను కల్పిస్తుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే మంచి విద్యను అందిస్తామని భరోసా ఇచ్చారు.
సెజ్ పనుల పరిశీలన
మండలంలోని లక్కంపల్లి శివారులో ఏర్పాటు చేస్తున్న వ్యవసాయాధారిత పరిశ్రమ (సెజ్) పనులను మంగళవారం కలెక్టర్ రామ్మోహాన్‌రావు పరిశీలించారు. సెజ్ కోసం కేటాయించిన భూమి వివరాలను తహసీల్దార్ ఉమాకాంత్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సెజ్‌లో జరుగుతున్న పనులను పరిశీలించి, వాటి వివరాలను ఆరా తీశారు.
వ్యవసాయాధిరిత పరిశ్రమలలో భాగంగా పశుపుశుద్ధి, విత్తన శుద్ధి కోసం ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని, అలాగే వ్యవసాయ గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీ, పాలశీతలీకరణ కేంద్రం తదితర కార్యక్రమాల కోసం 78 ఎకరాలను ఉపయోగించుకున్నట్లు, మిగితా భూమి ఇతర పరిశ్రమల కోసం లీజ్‌కు ఇస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు కలెక్టర్‌కు వివిరించారు.
ఈ కార్యక్రమాలలో స్థానిక సర్పంచ్ మీసాల సుదర్శన్, ఎంపీపీ అంకంపల్లి యమున, జడ్పీటీసీ డి.స్వాతి, వైస్ ఎంపీపీ మారంపల్లి గంగాధర్, ఎంపీటీసీ ఎర్రటి సుజాత, ఎంపీడీఓ నాగవర్దన్, ఎంఈవో శ్రీనివాస్‌రెడ్డి, సొసైటీ చైర్మన్ లక్ష్మినారాయణ, హెచ్ఎం గంగాధర్, వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.