ailment
-
ఇంద్రాణీకి పీటర్ విడాకులు..!
షీనా బోరా హత్య కేసులో జైలు జీవితం గడుపుతున్న ఇంద్రాణీ ముఖర్జీయాకు ఆమె భర్త పీటర్ ముఖర్జీయా విడాకులు ఇవ్వదలుచుకున్నాడా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇంద్రాణీ పుట్టినరోజున ఆమెకు గుర్తుండిపోయే జ్ఞాపకాన్ని ఇస్తానని లేఖ రాసిన పీటర్.. తాజాగా విడాకులు తీసుకోవడానికి సిద్ధపడుతున్నట్లు ఆయన లాయర్ మిహిర్ ఘీవాలా తెలిపారు. షీనా కేసులో గత నవంబర్ లో పీటర్ ను కూడా నిందింతుడిగా చేరుస్తూ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పీటర్ అరెస్టయిన నాటి నుంచి ఇప్పటివరకు దాదాపు 40కుపైగా ఉత్తరాలను ఇంద్రాణీ రాసింది. వాటిలో తాను ఏ తప్పు చేయలేదని, 2016లో మంచి జీవితం ఉంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది. మొదట్లో వాటికి సమాధానం ఇవ్వని పీటర్ డిసెంబర్21న వచ్చిన లేఖకు మాత్రం జనవరిలో ఇంద్రాణీ పుట్టిన రోజు సందర్భంగా తొలిసారి సమాధానం ఇచ్చారు. 2015 సెప్టెంబర్ నుంచి బైకుల్లా మహిళా కారాగారంలో జైలు జీవితం గడుపుతున్న ఇంద్రాణీ తరచుగా తన ఒంటరితనాన్ని పీటర్ తో పంచుకోవడానికి ప్రయత్నించారని, తనకున్న వ్యాధి (మెదడుకు రక్తప్రసరణ సరిగా అవకపోవడం) ముదురుతోందని త్వరలోనే మరణిస్తానని ఆమె లేఖలో తెలిపిందని పీటర్ మరో లాయర్ ఆబోద్ పాండా తెలిపారు. తన చివరి రోజులు భరించలేని నొప్పితో కూడుకొని ఉంటాయా? అని డాక్టర్లను ప్రశ్నించినప్పుడు.. వారు అదేం ఉండదని ముందు కోమాలోకి వెళ్లి తర్వాత మరణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారని ఇంద్రాణీ లేఖలో వివరించింది. అందుకు సమాధానంగా.. విధిరాతను ఎవరూ మార్చలేరు. తాను జైలు అధికారులతో మాట్లాడుతానని ఏదైనా అనుకోని సంఘటన జరిగితే తనకు తెలపాలని కోరతానని చెప్పారు. కాగా గురువారం పీటర్ ముఖర్జియా బెయిల్ పిటీషన్ పై కోర్టులో మళ్లీ వాదనలు జరగనున్నాయి. -
అరుదైన వ్యాధితో బాలుడి మృతి
సుల్తానాబాద్(కరీంనగర్): కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం పూసాల గ్రామానికి చెందిన బీట్ల నేహాల్(15) ప్రొజేరియా వ్యాధితో బాధపడుతూ మంగళవారం వేకువజామున మరణించాడు. బీట్ల శ్రీనివాస్-శ్రీదేవి దంపతుల కుమారుడైన నేహాల్ పుట్టిన మూడేళ్ల వరకు ఆరోగ్యంగానే ఉన్నాడు. ఉపాధి నిమిత్తం 15 ఏళ్ల కిందట మహారాష్ట్రలోని భీవండికి వలస వెళ్లారు. శ్రీనివాస్ మొబైల్ రిపేర్స్ చేస్తూ ఉపాధి పొందుతున్నాడు. 2014లో ముంబైలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) వైద్యులు నేహాల్కు ప్రొజేరియా సోకిందని నిర్ధారించారు. జన్యు సంబంధ సమస్యతో వచ్చే ఈ వ్యాధి సోకిన వారు ఎండలో తిరగకూడదు. ఎప్పుడూ ఏసీలోనే ఉండాలి. ఎముకలు పెలుసుగా తయారయి, చిన్నవయసులోనే ముసలితనం వచ్చినట్లుగా మారడం ఈ వ్యాధి లక్షణం. ప్రపంచం మొత్తం మీద ఈ వ్యాధిసోకిన వాళ్లు 134 మంది ఉండగా ఇండియాలో గుర్తించిన నలుగురిలో మొదటివాడు నేహాలే. అమెరికాలోని ప్రొజేరియా రీసెర్చ్ ఫౌండేషన్ ఈ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా సేవ చేయడమే కాకుండా వ్యాధి నయం చేసేందుకు రూ.3 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధపడింది. నేహాల్ను ప్రొజేరియాకు ఇండియా బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించింది.15 ఏళ్ల వయసులోనూ నేహాల్ బరువు 13 కిలోలకు మించలేదు. ఇటీవల తన బాబాయి కూతురు పెళ్లి ఉండడంతో స్వగ్రామం పూసాలకు నేహాల్ కుటుంబం వచ్చింది. సోమవారం ఎండతీవ్రత అధికంగా ఉండడంతో అస్వస్థతకు గురై వాంతులు, విరేచనాలు చేసుకోగా కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రుల సూచనమేరకు కరీంనగర్ వైద్యులు ముంబైలో నేహాల్కు చికిత్స అందించే వైద్యులను ఫోన్లో సంప్రదించారు. ఎండలో తిరగడం వల్లే సమస్యకు కారణమని, అతడు ఎప్పుడూ చల్లటి వాతావరణంలో ఏసీలోనే ఉండాలని వారు చెప్పారు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి మంగళవారం వేకువజామున నేహాల్ మృతి చెందాడు.