సీపీఐ నిర్మాణం భ్రష్టుపట్టింది...
పోటీ చేసి ఉండాల్సింది కాదు..
నారాయణపై నిప్పులు చెరిగిన మాజీ ఎమ్మెల్యే సుబ్బరాజు
సాక్షి, విజయవాడ : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ వ్యవహారశైలి వల్ల పార్టీ నిర్మాణం భ్రష్టుపట్టిపోయిందని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే కె.సుబ్బరాజు ఆరోపించారు. రాష్ట్ర కార్యదర్శి వ్యవహారశైలిని నిరసిస్తూ ఆయన నారాయణకు నాలుగు పేజీల లేఖ రాశారు. బూర్జువా పార్టీలతో నేస్తం, వాణిజ్య, పారిశ్రామిక, బడా కాంట్రాక్టు సంస్థలతో సంబంధాలు, నాయకుల ఆర్థిక అరాచకానికి తోడ్పాటు వల్లే గత ఎన్నికల్లో పూర్తిస్థాయిలో పార్టీ వైఫల్యం చెందిందని ఆరోపించారు.
పార్టీ ఎన్నడూ ఎరుగని రీతిలో డిపాజిట్లు కోల్పోవడమే కాకుండా ఘోరమైన రీతిలో లభించిన ఓట్లు పార్టీ దిగజారుడుకు అద్దం పడుతోందన్నారు. దీన్ని రాజకీయ అంశాలపై జరిగిన నష్టం భావిస్తే పార్టీకి మరింత నష్టం చేసినవారవుతామని ఆ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర పార్టీ అధినేతగా నిర్మాణ బాధ్యతలు నిర్వహించి, ప్రజల్లో సత్సంబంధాలు ఉన్న చోట పోటీ చేయడం అవసరమే అయినా, రాష్ట్రవ్యాప్త సమన్వయంతోపాటు చాలెంజ్‌గా కేంద్రీకరించాల్సిన నారాయణ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయడం ఏమాత్రం సరికాదన్నారు.
రెండు రాష్ట్రాల పార్టీ శ్రేణులు, ప్రజల్లో విభిన్న ధోరణులు మరిచిపోక ముందే ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శిగా ఉండి ఒక రాష్ట్రంలో పోటీ చేయడం బాగోలేదని, కృష్ణాజిల్లాతో పాటు పలు జిల్లాల సమావేశాల నుంచి వచ్చిన సూచనలు పట్టించుకోకపోవడం సరికాదని పేర్కొన్నారు. బహిరంగ విమర్శలు వచ్చినప్పుడైనా పార్టీ పదవికి రాజీనామా చేసి ప్రచారంలో పాల్గొని ఉంటే రాష్ట్రవ్యాపితంగా కూడా పార్టీ గౌరవం పొంది కొంత నిలబడి ఉండేదన్నారు. ఎన్నికల తర్వాత ఖమ్మం పార్లమెంట్ స్థానంలో సీపీఎం నాయకుడిపై చేసిన ఆర్థిక ఆరోపణలు తొందరపాటు చర్య అన్నారు.
తొందరపాటు, ఆ తర్వాత పశ్చాత్తాపాలు మీకు సహజం కాని, పార్టీ పట్ల ఏర్పడిన చులకన మరింత పెరుగుతోందన్నారు. కిందిస్థాయి సీపీఎం నాయకులు ప్రత్యారోపణలకు అవకాశం ఇచ్చినట్లయిందన్నారు. తెలంగాణలో కేంద్ర పార్టీ విధానానికి విరుద్ధంగా ప్రత్యేక పరిస్థితుల పేరుతో దేశమంతా ఛీకొట్టిన కాంగ్రెస్‌తో జత కట్టినా మనకు ఒరిగింది లేకపోగా పార్టీ ప్రతిష్ట మరింత దిగజారిందన్నారు.
వామపక్ష ఉద్యమ కేంద్రం, సీపీఐకి గుండెకాయ లాంటి విజయవాడలో చారిత్రాత్మక పరాజయానికి నారాయణ కూడా బాధ్యులేనన్నారు. 130 ఏళ్ల విజయవాడ మున్సిపాలిటీ, కార్పొరేషన్ చరిత్రలో పలుసార్లు పాలించిన సీపీఐకి మొదటిసారి ప్రాతినిధ్యం లేకుండా పోవడం, అగ్రనాయకత్వం పోటీ చేసిన డివిజన్లలో కూడా డిపాజిట్లు కోల్పోవడం అవమానకరమన్నారు. నగర కార్యదర్శిగా ఉన్న దోనేపూడి శంకర్ ఏకపక్ష విధానాల వల్ల పార్టీ నష్టపోయిందన్నారు.
కౌన్సిల్ సభ్యుడైన తనను ఏనాడు సమావేశాలకు పిలవకపోగా, 30 ఏళ్లుగా ప్రజాప్రతినిధిగా ఉన్న తనను అభ్యర్థుల ఎంపికలో భాగస్వామిని చేయలేదన్నారు. ఓటు వేసిన గుర్తు చెరగకముందే కార్పొరేటర్‌గా పోటీ చేసిన నగర కార్యదర్శిని ఎమ్మెల్యే స్థానానికి ఎంపిక చేయడం వల్ల పార్టీకి మరెవ్వరూ దిక్కులేదనే భావన కలిగిందన్నారు. ఎంపీ అభ్యర్థులకు ఓట్లు వేయిస్తానని తెలుగుదేశం, వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయన్నారు. రాష్ట్రస్థాయి నుంచి నగర స్థాయి వరకూ ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందని సుబ్బరాజు డిమాండ్ చేశారు.