Aims Mangalagiri
-
వ్యసన విముక్తి కేంద్రాలను బలోపేతం చేయాలి
నెహ్రూ నగర్ (గుంటూరు ఈస్ట్): ప్రభుత్వ ఆసుపత్రులలో ఏర్పాటు చేసిన వ్యసన విముక్తి (డీ అడిక్షన్) కేంద్రాలను బలోపేతం చేయాలని ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరారు. మంగళవారం గుంటూరుకు విచ్చేసిన ముఖ్యమంత్రిని కలిసి ఆయన ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు. మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో 50 పడకల డీ–అడిక్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలో బహిరంగ మద్య సేవనాన్ని పూర్తిగా నిర్మూలించాలని, అన్ని టోల్గేట్ల వద్ద బ్రీత్ ఎనలైజర్ టీమ్స్‌ను ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలను నిర్మూలించాలని కోరారు. ఇందుకు సీఎం జగన్ సానుకూలంగా స్పందిస్తూ ఈ అంశాలపై సరైన చర్యలు చేపట్టాల్సిందిగా ముఖ్యమంత్రి కార్యాలయ ప్రిన్సిపల్ కార్యదర్శి ముత్యాలరాజును ఆదేశించారు. -
2020 సెప్టెంబర్‌కు మంగళగిరి ఎయిమ్స్ సిద్ధం
సాక్షి, అమరావతి: మంగళగిరిలో ఎయిమ్స్ (ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్) నిర్మాణం 2020 సెప్టెంబర్ నాటికి పూర్తవుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే మంగళవారం రాజ్యసభకు తెలిపారు. వైఎస్సార్సీపీ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి పై విధంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ఎయిమ్స్‌ను నెలకొల్పడానికి 2015 అక్టోబర్ 7న కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని, దీని నిర్మాణం కోసం మొత్తం రూ.1,618 కోట్లు మంజూరు చేశామని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు కేంద్రం రూ 385.54 కోట్ల నిధులను ఎయిమ్స్ కోసం విడుదల చేసిందని వివరించారు. ఔట్ పేషెంట్ డిపార్ట్మెంట్ బ్లాక్, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు 70 శాతం పూర్తయ్యాయన్నారు. హాస్పిటల్, అకడమిక్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు 26 శాతం పూర్తయినట్లు తెలిపారు. 2019 మార్చిలో మంగళగిరి ఎయిమ్స్‌లో ఔట్ పేషెంట్ డిపార్ట్మెంట్ వైద్య సేవలు ప్రారంభమైనట్లు మంత్రి చెప్పారు. ఫార్మ్.డి కోర్సు ఎంబీబీఎస్‌కు సమానం కాదు.. ఆరేళ్ల ఫార్మ్.డి కోర్సు ఎంబీబీఎస్‌కు సమానం కాదని ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే రాజ్యసభలో స్పష్టం చేశారు. ఫార్మ్.డి కోర్సును క్లినికల్ ఫార్మసిస్ట్‌లకు సమానంగా గుర్తించాలన్న డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి వస్తున్నా.. ఎంబీబీఎస్‌తో సమానంగా గుర్తించాలన్న డిమాండ్ మాత్రం లేదని విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబుగా మంత్రి చెప్పారు. -
మంగళగిరి ఎయిమ్స్‌కి గ్రీన్‌సిగ్నల్
విజయవాడ బ్యూరో : మంగళగిరి ఎయిమ్స్‌కు సంబంధించి మరో ముందడుగు పడింది. ఎయిమ్స్ నిర్మాణ పనులకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని నాగ్‌పూర్, కల్యాణి ప్రాంతాలతో పాటు మన రాష్ట్రంలోని మంగళగిరిలో నిర్మించే ఎయిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం 2015-16 వార్షిక బడ్జెట్లో రూ.1618 కోట్లు కేటాయించే వీలుందని సూత్రప్రాయంగా తెలిపింది. ఫలించిన ఎదురుచూపులు... రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సమయంలో కేంద్రం ఇచ్చిన హామీల్లో భాగంగా మంగళగిరిలోని పాత టీబీ శానిటోరియం స్థలంలో అన్ని సదుపాయాలతో కూడిన ఎయిమ్స్‌ను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు తయారుచేసి కేంద్రానికి పంపింది. కేంద్రం నియమించిన నిపుణుల కమిటీ 2014 డిసెంబర్లో గుంటూరు జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి టీబీ శానిటోరియం స్థలాన్ని పరిశీలించింది. ప్రభుత్వం కేటాయించిన 193 ఎకరాల విస్తీర్ణంలో 960 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, మెడి కల్ కళాశాల, పరిపాలనా భవనాలను నిర్మించాలని ప్రతిపాదనలు రూపొందించింది. మే 14న పనులు ప్రారంభించేందుకు శంకుస్థాపన ముహూర్తం కూడా ఖరారైంది. అయితే చివరి క్షణంలో శంకుస్థాపన వాయిదా పడింది. ఇక్కడున్న స్థలం సరిపోదన్న వాదనలు బయటకు రావడంతో పక్కనే ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడీ సంస్థలకు కేటాయించిన మరో 50 ఎకరాలను కూడా ఎయిమ్స్‌కు కేటాయించారు. ఆ తరువాత కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం ఎదురుచూపులు మొదలయ్యాయి. ఇటీవల కాలంలో కేంద్ర మంత్రి సుజనాచౌదరి విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర మంత్రివర్గం నుంచి ఆమోదం లభించగానే ఎయిమ్స్ పనులు ప్రారంభమవుతాయన్నారు. బుధవారం ఈ మేరకు కేబినెట్ నుంచి ఆమోదం లభించింది. అన్నీ సవ్యంగా జరిగితే నవంబరు 14 లోపే నిర్మాణ పనులకు శంకుస్థాపన జరగవచ్చని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.