
సాక్షి, అమరావతి: మంగళగిరిలో ఎయిమ్స్ (ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్) నిర్మాణం 2020 సెప్టెంబర్ నాటికి పూర్తవుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే మంగళవారం రాజ్యసభకు తెలిపారు. వైఎస్సార్‌సీపీ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి పై విధంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ఎయిమ్స్‌ను నెలకొల్పడానికి 2015 అక్టోబర్ 7న కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని, దీని నిర్మాణం కోసం మొత్తం రూ.1,618 కోట్లు మంజూరు చేశామని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు కేంద్రం రూ 385.54 కోట్ల నిధులను ఎయిమ్స్ కోసం విడుదల చేసిందని వివరించారు. ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ బ్లాక్, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు 70 శాతం పూర్తయ్యాయన్నారు. హాస్పిటల్, అకడమిక్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు 26 శాతం పూర్తయినట్లు తెలిపారు. 2019 మార్చిలో మంగళగిరి ఎయిమ్స్‌లో ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ వైద్య సేవలు ప్రారంభమైనట్లు మంత్రి చెప్పారు.
ఫార్మ్.డి కోర్సు ఎంబీబీఎస్‌కు సమానం కాదు..
ఆరేళ్ల ఫార్మ్.డి కోర్సు ఎంబీబీఎస్‌కు సమానం కాదని ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే రాజ్యసభలో స్పష్టం చేశారు. ఫార్మ్.డి కోర్సును క్లినికల్ ఫార్మసిస్ట్‌లకు సమానంగా గుర్తించాలన్న డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి వస్తున్నా.. ఎంబీబీఎస్‌తో సమానంగా గుర్తించాలన్న డిమాండ్ మాత్రం లేదని విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబుగా మంత్రి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment