Air Force Staff
-
‘మరోసారి విమానం ఎక్కాలని లేదు ’
తిరువనంతపురం: కోళీకోడ్ విమాన ప్రమాదం చాలా కుటుంబాల్లో విషాదం నింపింది. మరికొద్ది క్షణాల్లో సొంత గడ్డపై కాలుమోపబోతున్నామనే సంతోషంతో ఉన్నవారిని ఊహించని ప్రమాదం ఛిన్నాభిన్నం చేసింది. ఈ ప్రమాదం నుంచి బయటపడిన వారికి ఈ దుర్ఘటన ఓ పీడకలగా మారింది. అంతా 15 సెంకడ్లలో జరిగిపోయిందని ప్రమాదం నుంచి బయటపడిన ముహమ్మద్ జునైద్ అనే ప్యాసింజెర్ చెప్పాడు. దేవుడి దయతో తాను బయటపడ్డానని, ఇంకోసారి విమాన ప్రయాణం చేయాలనే ఆలోచననే లేదని చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను దుబాయ్ నుంచి స్వదేశానికి తరలిస్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్యాసింజర్ శుక్రవారం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. (చదవండి : భయంతో ముందు సీట్లను పట్టుకున్నాం..) ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లతో సహా 18 మంది మరణించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. కొంతమంది స్పల్ప గాయాలతో బయటపడ్డారు. వారిలో ఒకరు జునైడ్(25) ఒకరు. మూడేళ్ల క్రితం దుబాయ్‌కి వెళ్లి అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. నెలకు 75 వేల జీతం. అంతా బాగుంటుందన్న సమయంలో కరోనా మహ్మమారి అతని ఉపాధిని దెబ్బతీసింది. మే నెలలో సగం జీతం ఇచ్చిన కంపెనీ.. తర్వాత మూడు నెలలు సెలవులపై వెళ్లాలని చెప్పి చేతులు దులుపుకుంది. ఈ క్రమంలో భారత్‌కు తిరిగి వచ్చే క్రమంలో ఈ ప్రమాదం సంభవించింది. విమానం వెనుక భాగం చివరి సీట్లో కూర్చోవడం వల్ల తాను బతికి బయటపడ్డానని జునైద్ చెప్పాడు. విమాన పైకప్పు తాకడం వల్ల తలకి, పెదాలకు చిన్న గాయం తప్పా ఎలాంటి ప్రమాదం జరగలేదని జునైద్ పేర్కొన్నారు. దేవుని దయతో బయటపడ్డానని, మరోసారి విమానం ఎక్కాలని లేదని చెప్పుకొచ్చారు. (చదవండి : కోళీకోడ్ ఘటన: ప్రాణం కాపాడిన ఫైన్) -
విమాన ప్రమాదం; ఆయన ధైర్యమే కాపాడింది!
తిరువనంతపురం: కేరళ కోళీకోడ్‌లో శుక్రవారం రాత్రి జరిగిన విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో అసువులు బాసిన పైలట్ దీపక్ వసంత్ సాథే (59) అసమాన ప్రతిభ గురించి అనేక కీలక విషయాలను సీనియర్ అధికారులు గుర్తు చేసుకుంటున్నారు. 22 ఏళ్ల అపార అనుభవం, విమానాలు నడపడంలో నిష్ణాతుడైన వసంత్ సాథే వాతావరణ పరిస్థితులు అనుకూలించని కారణంగానే విమానాన్ని నియంత్రించలేక పోయారనీ, విమానం రెండు ముక్కలైన తీరు ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోందని పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. (విమాన ప్రమాదంపై లోతుగా దర్యాప్తు) వింగ్ కమాండర్ దీపక్ వసంత సాథే గతంలో భారత వాయుసేనలో యుద్ధవిమానం (మిగ్21) పైలట్‌గా పనిచేశారు. ఖరాక్ వస్లాలోని ప్రతిష్టాత్మక నేషనల్ డిఫెన్స్ అకాడమీలో 58వ బ్యాచ్‌కు చెందిన సాథే అనేక మంది పైలెట్లకు శిక్షణ ఇచ్చారు. బోయింగ్ 737 విమానాలు నడపడంలో పైలెట్ సాథేది అందె వేసిన చెయ్యి. అంతేకాదు జూన్, 1981లో హైదరాబాద్ లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీ నుంచి ‘స్వోర్డ్ ఆఫ్ ఆనర్’ అందుకున్నారు. 2003లో వాయుసేన నుంచి రిటైరైన అనంతరం 2005లోఎయిరిండియాలో చేరారు. అంకితభావం, అపారమైన నైపుణ్యం సాథే సొంతమని రాష్ట్రపతి గోల్డ్ మెడల్ కూడా సాధించారంటూ అధికారులు గుర్తు చేసుకుంటున్నారు. (రెండు ముక్కలైన విమానం) మరోవైపు ఆయన అప్రమత్తత వల్లనే ప్రాణాలతో బయటపడ్డామని, ఈ ప్రమాదంలో గాయపడిన వారు వ్యాఖ్యానించారు. ఆయన అనుభవం, ధైర్యంతోనే ప్రమాదం జరిగిన తరువాత మంటలను నివారించగలిగా రంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. భారీ వర్షం కారణంగా వాతావరణం అస్సలు బాలేదని ల్యాండింగ్ ముందే హెచ్చరించారు. రెండుసార్లు సురక్షితమైన ల్యాండింగ్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారని ఇబ్రహీం అనే ప్రయాణికుడు తెలిపారు. కానీ ఆయన తెగువతో తాము అద్భుతంగా తప్పించుకుని స్వల్ప గాయాలతో సురక్షితంగా ఉన్నామని చెప్పారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను దుబాయ్ నుంచి స్వదేశానికి తరలిస్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్యాసింజర్ విమానానికి జరిగిన ప్రమాదంలో ఇద్దరు పైలట్లు వింగ్ కమాండర్ దీపక్ వసంత్ సాథే, కెప్టెన్ అఖిలేష్ కుమార్ సహా 18 మంది మరణించిన సంగతి తెలిసిందే.. -
వీడిన జల ‘చెర’
సాక్షి, హైదరాబాద్/పాపన్నపేట: మెదక్ జిల్లా ఏడుపాయలలో మంజీర నదిలో చిక్కుకున్న 24 మంది కూలీలు క్షేమంగా బయటపడ్డారు. వీరిని రక్షించడానికి సీఎం కేసీఆర్ చూపిన చొరవ ఫలిం చింది. సీఎం విజ్ఞప్తి మేరకు ఎయిర్‌ఫోర్స్ చేపట్టిన ఆపరేషన్‌తో కూలీ లంతా ఒడ్డుకు చేరుకున్నారు. డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, కలెక్టర్ రోనాల్డ్ రాస్.. ఏడుపాయల్లోనే మకాం వేసి ప్రభుత్వ అధికారులు, ఎయిర్‌ఫోర్స్ సిబ్బందితో మాట్లాడుతూ, బాధిత కూలీలకు సెల్‌ఫోన్ ద్వారా ధైర్యం చెబుతూ మొత్తం పరిస్థితిని పర్యవేక్షించారు. ఆదివారం ఉదయం 8.45 గంటలకు ఆపరేషన్ ప్రారంభించిన ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్లు 50 నిమిషాల్లో 24 మంది బాధితులను జల‘చెర’ నుంచి విడిపించి స్వేచ్ఛను ప్రసాదించాయి. మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 24 మంది కూలీలు పొట్టకూటి కోసం నెల రోజుల కిందట మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల ప్రాంతానికి వచ్చారు. మంజీర పాయల మధ్య టేకుల బొడ్డెపై జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణంలో కూలీ పనులు చేసుకుంటూ.. అక్కడే రేకుల షెడ్డు వేసుకుని నివసిస్తున్నారు. అయితే భారీ వర్షాలకు మంజీర వరదగా మారి ఘనపురం ప్రాజెక్టు నుంచి పొంగిపొర్లుతూ టేకుల బొడ్డెను చుట్టుముట్టింది. దీంతో కూలీలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. బాధితులను రక్షించేందుకు శనివారం జాతీయ విపత్తుల సహాయక సిబ్బంది రంగంలోకి దిగినప్పటికీ పరిస్థితులు అనుకూలించలేదు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం శనివారం విషయాన్ని సీఎం దృష్టికి తెచ్చింది. దీంతో కేసీఆర్ అక్కడికి ప్రభుత్వ హెలికాప్టర్ పంపడానికి ప్రయత్నించారు. ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్ అయితే తప్ప మనుషులను లిఫ్ట్ చేయడం సాధ్యం కాదని తేలింది. దీంతో కేసీఆర్ ఎయిర్‌ఫోర్స్ అధికారులతో మాట్లాడి.. హెలికాప్టర్లను పంపించారు. కూలీలను సురక్షితంగా బయటకు తేవడంపై ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. 50 నిమిషాల్లోనే..: కూలీలను రక్షించేందుకు వైమానిక దళం శనివారం రెండు సార్లు ప్రయత్నించగా భారీ వర్షం, మేఘాలు, ప్రతికూల వాతావరణం వల్ల సాధ్యం కాలేదు. అయితే ఆదివారం మరోమారు ఆపరేషన్ చేపట్టి.. 50 నిమిషాల్లోగా పని పూర్తి చేశాయి. రెండు హెలికాప్టర్లు ఉదయం 7.45 గంటలకు టేకులబొడ్డెపై ల్యాండ్ అయ్యాయి. 4 విడతలుగా రెండేసి హెలికాప్టర్లు ఒక్కోసారి ముగ్గురు బాధితులను ఏడుపాయల వైపు తీసుకొచ్చాయి. బాధితులంతా సురక్షితంగా ఇవతలి వైపునకు చేరగానే డిప్యుటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ అల్పాహారం అందజేశారు. అనంతరం వైద్య పరీక్షలు జరిపించారు. ఆపై వారికి ఏడుపాయల్లో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బాధితులంతా తమ స్వస్థలాలకు వెళ్తామని చెప్పడంతో ఆ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.