Air fresheners
-
Rajiv Kumar Sharma: ప్రతికూలతకు... పచ్చటి జవాబు
పాత వస్తువులను చూస్తూ కొత్తగా ఆలోచిస్తే ఏమొస్తుంది? కొత్త ఆవిష్కరణకు బీజం పడుతుంది. సమాజానికి మేలు జరుగుతుంది. రసాయనాలతో కూడిన ఎయిర్ ఫ్రెష్నర్ ద్వారా అనారోగ్యానికి గురైన రాజీవ్ శర్మ ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాడు. ‘జీరో ప్లాస్టిక్, జీరో ట్యాక్సిన్స్’ నినాదంతో ఎకో–ఫ్రెండ్లీ ఎయిర్ ఫ్రెష్‌నర్‌ను డిజైన్ చేశాడు. ‘ఆల్వే–గ్రీన్ సొల్యూషన్స్’ స్టార్టప్‌తో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్నాడు జంషెడ్‌పూర్‌కు చెందిన రాజీవ్ కుమార్ శర్మ.... కోవిడ్ సమయంలో రాజీవ్‌శర్మ కుటుంబం శానిటైజర్లతో పాటు ఎయిర్ ఫ్రెష్నర్లను ఉపయోగించేది. ఒకరోజు వాంతులు, తలనొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు రాజీవ్. హాస్పిటల్ నుంచి ఇంటికి తిరిగివచ్చిన తరువాత ‘ఎందుకు ఇలా జరిగింది?’ అంటూ ఆలోచించాడు. ఇంట్లోకి కొత్తగా వచ్చిన ఎయిర్ ఫ్రెష్నర్ వల్లే తాను అనారోగ్యానికి గురైనట్లు తెలుసుకున్నాడు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కలప, పూలవ్యర్థాలతో సహజమైన ఎయిర్ ఫ్రెష్నర్ తయారుచేశాడు. ఈ ఎయిర్ ఫ్రెష్నర్ ద్వారా ఇనోవేటర్ కాస్తా ఎంటర్ప్రెన్యూర్ అయ్యాడు. ‘ఆల్వే–గ్రీన్ సోల్యూషన్స్’ పేరుతో స్టార్టప్ ప్రారంభించి విజయం సాధించాడు. ‘ఎయిర్ ఫ్రెష్‌నర్‌లలో ఇబ్బంది కలిగించే రసాయనాలు ఉన్నాయి. మనం చేయాల్సిందల్లా ఏదైనా ఎయిర్ ఫ్రెష్నర్ తయారీలో ఉపయోగించిన ఇన్‌గ్రేడియెంట్స్ గురించి తెలుసుకోవడం. పిల్లలు, జంతువులకు ఇవి సురక్షితం కాదు. ఈ నేపథ్యంలో పర్యావరణానికి హాని కలిగించని, మనుషులకు, జంతువులకు సురక్షితమైన ఎయిర్ ఫ్రెష్‌నర్‌ను తయారుచేయాలనుకున్నాను’ అంటాడు రాజీవ్‌శర్మ. ఈ ప్రాజెక్ట్‌పై తల్లితో కలిసి ఎనిమిది నెలలకు పైగా శ్రమించాడు. ఎన్నో ట్రయల్స్ తరువాత ఫైనల్ ప్రాజెక్ట్ ఓకే అయింది. ‘మా ఫ్రొఫెసర్లు ఆశ్చర్యపోయారు. ఇది మరింత ఎక్కువమందికి చేరువ కావాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. కాలేజీలోని యంత్రాలతో ఎయిర్ ఫ్రెష్నర్ పర్ఫెక్ట్గా రావడానికి సహాయం చేశారు’ అంటాడు రాజీవ్. జంషెడ్పూర్(ఝార్ఖండ్)లోని ఆలయాల నుంచి రాజీవ్ ప్రతిరోజూ కనీసం మూడు కిలోల పూలవ్యర్థాలను సేకరిస్తాడు. ప్రస్తుతం ఇంటి నుంచే కంపెనీని నడుతున్న రాజీవ్ దాన్ని మరింత విస్తరించే ఆలోచనలో ఉన్నాడు. ‘ఆల్వే–గ్రీన్ సొల్యూషన్’ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్–బెంగళూరుతో కలిసి పనిచేస్తోంది. చిన్నప్పటి నుంచి రాజీవ్ కొత్త కొత్త వస్తువులు తయారుచేసేవాడు. కోవిడ్ సమయంలో సౌకర్యవంతమైన పీపీఇ కిట్లను రూపొందించాడు. ‘ఝార్ఖండ్ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ’ సభ్యుడిగా గాయపడిన శునకాల కోసం ప్రత్యేకమైన వీల్చైర్లను తయారుచేశాడు. ‘మనకు ఉపయోగపడే వస్తువులు మాత్రమే కాదు పర్యావరణానికి హాని కలిగించని పరికరాలను తయారు చేయడం నా లక్ష్యం’ అంటున్నాడు రాజీవ్ కుమార్ శర్మ. -
మన ఇంట్లోనే సైలెంట్ కిల్లర్స్
లండన్: ఫ్యాక్టరీల నుంచి, కార్ల నుంచి వెలువడే విష వాయువుల వల్ల పలు రోగాలు దాపురిస్తాయని, అకాల మృత్యువు సంభవిస్తుందని మనకు తెల్సిందే. కానీ ఇంట్లో వాడే బాయిలర్లు, కీటకాలకు చంపే స్ప్రేయర్లు, ఎయిర్ ప్రెషనర్స్, డియోడరంట్స్, సెంటెడ్ క్యాండిల్స్, క్లీనింగ్ ఉత్పత్తులు కూడా అంతే ప్రమాదకరమైనవని తాజాగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వీటి కారణంగా వెలువడే విషపూరిత వాయువులను పీల్చుకోవడం వల్ల గర్భస్రావాలు జరుగుతాయని, కడుపులోని పిండం ఎదుగుదల మందగిస్తుందని, పిల్లలో ఊపిరితిత్తుల అభివృద్ధి కుంటుపడుతుందని, ఆస్తమా లాంటి జబ్బులు వస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పెద్దల్లో ఆస్తమా, మధుమేహం, డిమెన్షియా, ఊపిరితిత్తుల వ్యాధులతోపాటు గుండెపోటు, ముక్కు, గొంతు, లంగ్ క్యాన్సర్‌లాంటి జబ్బులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. కొన్ని వాయువుల ద్వారా కళ్ల మంట, చర్మ జబ్బులు కూడా వస్తాయంటున్నారు. లండన్‌లోని రాయల్ కాలేజీకి చెందిన ఫిజీసియన్లు, పెడియాట్రిషన్లు, చైల్డ్ హెల్త్ నిపుణుల బృందం సంయుక్తంగా జరిపిన ఓ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. వీటి పూర్తి వివరాలను ఈ వారం మాగజైన్లో ప్రచురించనున్నారు. ఇంటా, బయట వెలువడే విషవాయువుల కారణంగా ఒక్క బ్రిటన్‌లో ఏటా 40 వేల మంది మరణిస్తుండగా, కేవలం ఇంట్లో వెలువడే విషవాయువుల వల్ల యూరప్‌లో ఏటా 90 వేల మంది మరణిస్తున్నారని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇంట్లో వాడే స్ప్రేలలో ప్రమాదకరమైన ‘వొలటైల్ ఆర్గానిక్ కాంపోండ్స్ లేదా లైమనిన్ (నిమ్మ వాసననిచ్చే)’ రసాయనాలు వాడుతున్నారని, ముఖ్యంగా ఎయిర్ ఫ్రెషనర్స్, సెంటెడ్ క్యాండిల్స్లలో వీటిని విరివిగా వాడుతున్నారని, కళ్లు మండటం, చర్మ చిమచిమా అనడమే కాకుండా ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల క్యాన్సర్లు వస్తాయని వారు వివరించారు. గది ఫ్రెషనర్స్ వాడినప్పుడు గదిలోని కిటికీలు మూసివేస్తాం కనుక ముప్పు ఎక్కువగా ఉంటుందని కూడా వారు తెలిపారు. ఫర్నీచర్ తళుకులకు ఉపయోగించే రసాయనాల వల్ల కూడా లంగ్స్‌కు ఇబ్బందులు కలుగుతాయని చెప్పారు. ఇంట్లో వాడే జంతు చర్మాల వల్ల కూడా ముప్పు ఉందని వారు అన్నారు.