మన ఇంట్లోనే సైలెంట్ కిల్లర్స్
లండన్: ఫ్యాక్టరీల నుంచి, కార్ల నుంచి వెలువడే విష వాయువుల వల్ల పలు రోగాలు దాపురిస్తాయని, అకాల మృత్యువు సంభవిస్తుందని మనకు తెల్సిందే. కానీ ఇంట్లో వాడే బాయిలర్లు, కీటకాలకు చంపే స్ప్రేయర్లు, ఎయిర్ ప్రెషనర్స్, డియోడరంట్స్, సెంటెడ్ క్యాండిల్స్, క్లీనింగ్ ఉత్పత్తులు కూడా అంతే ప్రమాదకరమైనవని తాజాగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
వీటి కారణంగా వెలువడే విషపూరిత వాయువులను పీల్చుకోవడం వల్ల గర్భస్రావాలు జరుగుతాయని, కడుపులోని పిండం ఎదుగుదల మందగిస్తుందని, పిల్లలో ఊపిరితిత్తుల అభివృద్ధి కుంటుపడుతుందని, ఆస్తమా లాంటి జబ్బులు వస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పెద్దల్లో ఆస్తమా, మధుమేహం, డిమెన్షియా, ఊపిరితిత్తుల వ్యాధులతోపాటు గుండెపోటు, ముక్కు, గొంతు, లంగ్ క్యాన్సర్‌లాంటి జబ్బులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. కొన్ని వాయువుల ద్వారా కళ్ల మంట, చర్మ జబ్బులు కూడా వస్తాయంటున్నారు.
లండన్‌లోని రాయల్ కాలేజీకి చెందిన ఫిజీసియన్లు, పెడియాట్రిషన్లు, చైల్డ్ హెల్త్ నిపుణుల బృందం సంయుక్తంగా జరిపిన ఓ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. వీటి పూర్తి వివరాలను ఈ వారం మాగజైన్‌లో ప్రచురించనున్నారు. ఇంటా, బయట వెలువడే విషవాయువుల కారణంగా ఒక్క బ్రిటన్‌లో ఏటా 40 వేల మంది మరణిస్తుండగా, కేవలం ఇంట్లో వెలువడే విషవాయువుల వల్ల యూరప్‌లో ఏటా 90 వేల మంది మరణిస్తున్నారని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఇంట్లో వాడే స్ప్రేలలో ప్రమాదకరమైన ‘వొలటైల్ ఆర్గానిక్ కాంపోండ్స్ లేదా లైమనిన్ (నిమ్మ వాసననిచ్చే)’ రసాయనాలు వాడుతున్నారని, ముఖ్యంగా ఎయిర్ ఫ్రెషనర్స్, సెంటెడ్ క్యాండిల్స్‌లలో వీటిని విరివిగా వాడుతున్నారని, కళ్లు మండటం, చర్మ చిమచిమా అనడమే కాకుండా ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల క్యాన్సర్లు వస్తాయని వారు వివరించారు. గది ఫ్రెషనర్స్ వాడినప్పుడు గదిలోని కిటికీలు మూసివేస్తాం కనుక ముప్పు ఎక్కువగా ఉంటుందని కూడా వారు తెలిపారు. ఫర్నీచర్ తళుకులకు ఉపయోగించే రసాయనాల వల్ల కూడా లంగ్స్‌కు ఇబ్బందులు కలుగుతాయని చెప్పారు. ఇంట్లో వాడే జంతు చర్మాల వల్ల కూడా ముప్పు ఉందని వారు అన్నారు.