దాచి..దాటించేస్తారు..
లోదుస్తుల్లో 1.2 కేజీల బంగారం
వెనుక వైపు ప్రత్యేకంగా జిప్‌తో పాకెట్లు ఏర్పాటు
జిద్దా నుంచి నలుగురు వ్యక్తుల అక్రమ రవాణా
పట్టుకున్న కస్టమ్స్ అధికారులు
సాక్షి, సిటీబ్యూరో: జెడ్డా నుంచి బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న నలుగురు ‘క్యారియర్స్’ను శంషాబాద్ విమానాశ్రయం కస్టమ్స్ ఆధీనంలోని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. జెడ్డా నుంచి వస్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ (ఏఐ–966) విమానంలో హైదరాబాద్‌కు చెందిన కొందరు వ్యక్తులు అక్రమంగా బంగారం తరలిస్తున్నట్లు ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్‌కు సమాచారం అందింది. దీంతో శుక్రవారం తెల్లవారుజామున వలపన్నిన అధికారులు నలుగురు ప్రయాణికుల నుంచి 1.2 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం కొరియర్లుగా భావిస్తున్న వారు ప్రత్యేకంగా ప్యాక్ చేసి లోదుస్తుల్లో దాచుకున్నారు. ఇందుకుగాను లోదుస్తులకూ వెనుక వైపు జిప్‌తో కూడిన ప్రత్యేక పాకెట్లను ఏర్పాటు చేసుకున్నారు. వారు ఒకే ముఠా కోసం పని చేస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రాథమిక విచారణలో ఈ అక్రమ రవాణా దందా వ్యవస్థీకృతంగా జరుగుతున్నట్లు గుర్తించారు. హైదరాబాద్‌కు చెందిన కొందరు వ్యక్తులు ఓ ముఠాగా ఏర్పడి ఈ దందా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ గ్యాంగ్‌కు చెందిన ఒకరిద్దరు ముందే జెడ్డా చేరుకుని మకాం వేస్తున్నారని తెలుస్తోంది. ఈ ముఠా సభ్యులు ముందుగానే జెడ్డా విమానాశ్రయానికి చేరుకుని ఒకటిరెండేళ్ళు అక్కడ ఉండి తిరిగి వస్తున్న ప్రయాణికుల్ని గుర్తించి వీరిలో దిగువ మధ్యతరగతి, మధ్య తరగతి వారిని పావులుగా వాడుకుంటున్నారు. వీరికి కమీషన్లు ఎరవేస్తూ విమానంలో బంగారం రవాణా చేసే క్యారియర్లుగా వాడుకుంటున్నారు. హైదరాబాద్‌లో తమ వారు వచ్చి అంతా చూసుకుంటారని చెప్పి ఒప్పిస్తున్నారు. ఇందుకు అంగీకరించిన వారికి విమానాశ్రయంలోనే బంగారంతో పాటు ప్రత్యేకంగా డిజైన్ చేసిన లోదుస్తులు అందిస్తున్నారు. అక్కడ విమానం ఎక్కే ముందు తనిఖీలు చేసినప్పటికీ... బంగారానికి సంబంధించిన ఆధారాలు చూపిస్తే అనుమతిస్తారు. ఇలా విమానంలోకి వచ్చాక శంషాబాద్‌లో తనిఖీలు తప్పించుకునేందుకు క్యారియర్లు ప్రత్యేకమైన లోదుస్తులు ధరించి బంగారాన్ని వాటిలో దాస్తున్నారు. బంగారాన్ని అప్పగిస్తున్న వారు క్యారియర్లతో తమ వివరాలతో పాటు రిసీవ్ చేసుకునే వారి వివరాలు చెప్పరు. వీరు చిక్కినా తమ వివరాలు బయటకు రాకుండా ఉండేందుకు ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేవలం క్యారియర్ల ఫొటోలు తీసి వాట్సాప్ ద్వారా ఇక్కడున్న రిసీవర్లకు పంపిస్తుండటంతో వారు క్యారియర్లు విమానాశ్రయంలో దిగి బయటకు వచ్చిన వెంటనే గుర్తిస్తారు.
ఆపై ఎయిర్పోర్ట్ పార్కింగ్, సమీపంలోనే క్యారియర్లను కలుసుకుని బంగారాన్ని తీసుకుంటూ కమీషన్లు ముట్టచెబుతున్నారు. విమానాశ్రయంలో పసిడిని పట్టుకువచ్చే వ్యక్తులు పట్టుబడితే రిసీవర్లు తప్పించుకుని పారిపోతున్నారు. పసిడి ఖరీదు తక్కువగా ఉన్న ఇతర దేశాల నుంచీ ఇదే రకంగా తరలిస్తున్నట్లు సమాచారం. ఎయిర్‌పోర్ట్‌లో శుక్రవారం చిక్కిన ఈ నలుగురు నగరవాసులకు సంబంధించి లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.