airplane landing
-
పొగమంచుతో విమానాలకు ల్యాండింగ్ కష్టాలు
విమానాశ్రయం (గన్నవరం): దట్టమైన పొగమంచు రన్‌వే ప్రాంతాన్ని పూర్తిగా కప్పి వేయడంతో గన్నవరం విమానాశ్రయంలో గురువారం విమానాల ల్యాండింగ్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయి. తొలుత హైదరాబాద్ నుంచి ఉదయం 7.35 గంటలకు వచ్చిన ఇండిగో విమానం రన్‌వేపై దిగేందుకు విజిబిలిటీ లేకపోవడంతో 40 నిమిషాలు గాలిలో చక్కర్లు కొట్టింది. అయినప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సూచన మేరకు విమానం తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయింది. ఉదయం 8.15 గంటలకు న్యూఢిల్లీ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానం కూడా ల్యాండింగ్‌కు అనుకూలంగా లేకపోవడంతో అరగంట పాటు గాలిలో చక్కర్లు కొట్టింది. ఒకసారి రన్‌వేపై విమానాన్ని ల్యాండ్ చేసేందుకు పైలెట్లు ప్రయత్నించినప్పటికి విజిబిలిటీ లేకపోవడంతో టేకాఫ్ తీసుకున్నారు. మరో ప్రయత్నంలో సురక్షితంగా విమానాన్ని ల్యాండింగ్ చేయడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. పొగమంచు ప్రభావం తగ్గిన తర్వాత హైదరాబాద్ తిరిగి వెళ్లిన ఇండిగో విమానం కూడా గన్నవరం ఎయిర్‌పోర్టుకి ఉదయం 10 గంటలు దాటిన తరువాత చేరుకుంది. ఫాస్టాగ్ సేవలు ప్రారంభం గన్నవరం విమానాశ్రయంలోని టోల్గేట్లో ఫాస్టాగ్ సేవలు గురువారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. రద్దీ సమయాల్లో టోల్గేట్ వద్ద ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఈ సేవలను వినియోగంలోకి తీసుకువచ్చారు. టోల్గేట్ వద్ద జరిగిన పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న విమానాశ్రయ ఇన్చార్జ్ డైరెక్టర్ పీవీ రామారావు ఈ సేవలను ప్రారంభించారు. -
వామ్మో.. ఈ విమానం ల్యాండింగ్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
ఎథెన్స్: గ్రీస్‌లోని స్కియాథోస్ విమానాశ్రయం సుందరమైన వీక్షణలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ విమానాలు దిగడాన్ని చూడటానికి ప్రతిరోజూ వందలాది మంది పర్యాటకులు ల్యాండింగ్ ప్రాంతాన్ని సందర్శిస్తారు. విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌ను వీక్షించేందుకు రోజుకు సుమారు 100 మందికిపైగా ఇక్కడి వస్తారు. ఈ విమానాశ్రయం ఇతర అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుల్లా అంత పెద్దగా ఉండదు. చిన్న రన్‌వే ఉంటుంది. ఇక్కడ దిగేందుకు అనుమతి పొందిన అతిపెద్ద విమానం బోయింగ్ 757. ఇటీవల ఓ ప్రయాణికుల విమానం అత్యంత తక్కువ ఎత్తులో ల్యాండింగ్ చేసిన విధానాన్ని చాలా మంది ఆశ్వాదించారు. ఆ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. విజ్‌ఎయిర్ ఎయిర్‌బస్ ఏ321నియో ప్లేన్.. సముద్ర నీటిని తాకుందా అన్నట్లు వెళ్తూ.. అలెగ్జాండ్రోస్ పపడియామంటిస్ ఎయిర్‌పోర్ట్‌లో దిగింది. ల్యాండింగ్‌కు కొద్ది సెకన్ల ముందు విమానం ముందు టైర్లు రోడ్డుపై ఉన్న వారిని తాకుతాయా అన్నట్లు కనిపించింది. రన్‌వే ఫెన్సింగ్ దాటిన క్రమంలో ఆ గాలికి అక్కడి వారు దూరంగా పడిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియోను గ్రేట్ఫ్లైయర్ యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది. స్కియథోస్ అంతర్జాతీయ విమానాశ్రయం కేవలం 5,341 అడుగుల రన్‌వే కలిగి ఉంటుంది. అతితక్కువ పొడవు, తక్కువ వెడల్పుతో ఉండటం దీని ప్రత్యేకత. ఈ ఎయిర్పోర్ట్ 1972లో ప్రారంభమైంది. ఇదీ చదవండి: దక్షిణాఫ్రికాలోని ఒక పట్టణం...అక్కడ అంతా శ్వేత జాతీయులే! -
రహదారిపై ఎయిర్ స్ట్రిప్‌లు
సింగరాయకొండ/అద్దంకి: ఎయిర్ పోర్టులు లేనిచోట్ల విమానాల ల్యాండింగ్ కోసం జాతీయ, రాష్ట్రీయ రహదారుల్లో రన్‌వే (ఎయిర్ స్ట్రిప్)లను కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. దేశవ్యాప్తంగా 13 చోట్ల వీటిని నిర్మించనుండగా.. మన రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో రెండుచోట్ల నిర్మిస్తున్నారు. ప్రకాశం జిల్లా కొరిశపాడు–రేణింగవరం వద్ద ఒకటి, సింగరాయకొండలోని కలికివాయ–సింగరాయకొండ అండర్ పాస్ వరకు మరొకటి ఏర్పాటవుతున్నాయి. వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా.. ► జాతీయ రహదారిలో ఈ రన్‌వేలపై విమానాలు దిగే సమయంలో వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా నిర్మాణాలు చేపడతారు. సిమెంట్‌తో నిర్మించే రన్‌వేకు రెండు వైపులా రెండు గేట్లు ఉంటాయి. ఒక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ► కొరిశపాడు–రేణింగవరం వరకు రూ.23.77 కోట్లతో 5 కి.మీ. పొడవు, 60 మీటర్ల వెడల్పుతో ఒకేసారి 4 విమానాలు ల్యాండ్ అయ్యే విధంగా ఎయిర్ స్ట్రిప్ నిర్మిస్తున్నారు. ► కలికివాయ–సింగరాయకొండ మధ్య విమానాల అత్యవసర ల్యాండింగ్ కోసం రూ.52 కోట్లతో 3.60 కిలోమీటర్ల మేర ఎయిర్ స్ట్రిప్ నిర్మించనున్నారు. 33 మీటర్ల వెడల్పున కాంక్రీట్‌తో రన్‌వే, రెండువైపులా 12.50 మీటర్ల వెడల్పున గ్రావెల్ రోడ్డు, రోడ్డుకు ఇరువైపులా మీటరు వెడల్పున డ్రైనేజీ నిర్మాణం చేపడతారు. రన్‌వేకు 150 మీటర్ల దూరంలో ఏటీసీ భవనం నిర్మిస్తారు. ప్రస్తుతం రన్‌వేకు సంబంధించి కాంక్రీట్ రోడ్డు నిర్మాణం దాదాపు పూర్తి కావస్తోంది. ఇరువైపులా డ్రైనేజీ, గ్రావెల్ రోడ్డు నిర్మాణం పూర్తయింది. ► కందుకూరు ఫ్లైఓవర్ వద్ద కల్వర్టు నిర్మాణం పూర్తి కాగా, కలికవాయ ఫ్లైఓవర్ వద్ద బ్రిడ్జి నిర్మాణ దశలో ఉంది. -
చక్కర్లు కొట్టిన మమత విమానం
పట్నా నుంచి కోల్‌కతా వస్తుండగా ఘటన ► ఇంధనం అయిపోతోందన్నా ల్యాండింగ్‌కు అనుమతి జాప్యం ►మమత భద్రతపై పార్లమెంటులో విపక్షాల ఆందోళన కోల్‌కతా/న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న విమానం ల్యాండింగ్‌కు 15 నిమిషాలు ఆలస్యంగా అనుమతివ్వడం కలకలం రేపింది. బిహార్‌లో బుధవారం ఓ ర్యాలీలో పాల్గొన్న మమత సాయంత్రం 7.30కు పట్నా నుంచి ఇండిగో విమానంలో తిరుగుపయనమయ్యారు. కోల్‌కతాకు 200 కి.మీ. దూరంలో ఉన్నప్పుడే.. ల్యాండింగ్ వరుసలో మమత విమానం 8వ స్థానంలో ఉందని ఏటీసీ నుంచి పైలట్‌కు సందేశం వచ్చింది. అయితే ఈ విమానంలో ఇంధనం తక్కువగా ఉందని, అత్యవసరంగా ల్యాండింగ్‌కు అవకాశం ఇవ్వాలని పైలట్ తెలపటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అప్పటికే మరో మూడు విమానాలు ఇంధనం తక్కువుందని చెప్పటంతో 15 నిమిషాల తర్వాత మమత విమానానికి ఏటీసీ క్లియరెన్సు ఇచ్చింది. అయితే నోట్ల రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మమతను మట్టుబెట్టేందుకు ప్రయత్నం జరుగుతుందనే అనుమానాన్ని ఉభయసభల్లో తృణమూల్ సభ్యులు లేవనెత్తారు. కాగా ఈ ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. మమత ప్రయాణించిన ఇండిగో తోపాటు మరో రెండు విమానాల్లోనూ ఇంధన కొరత ఏర్పడినట్లు సమాచారం వచ్చిందని విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు పార్లమెంటుకు తెలిపారు. మమత విమానం క్షేమంగానే ల్యాండ్ అయిందన్నారు. 3 విమానాలు ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు కోరటంతోనే మమత విమానం రావటం 13 నిమిషాలు ఆలస్యమైందని మంత్రి తెలిపారు. ఈ వివాదంపై డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విచారణకు ఆదేశించింది. బాధ్యులపై చర్యలు తప్పవని తెలిపింది.