చక్కర్లు కొట్టిన మమత విమానం
పట్నా నుంచి కోల్‌కతా వస్తుండగా ఘటన
► ఇంధనం అయిపోతోందన్నా ల్యాండింగ్‌కు అనుమతి జాప్యం
►మమత భద్రతపై పార్లమెంటులో విపక్షాల ఆందోళన
కోల్‌కతా/న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న విమానం ల్యాండింగ్‌కు 15 నిమిషాలు ఆలస్యంగా అనుమతివ్వడం కలకలం రేపింది. బిహార్‌లో బుధవారం ఓ ర్యాలీలో పాల్గొన్న మమత సాయంత్రం 7.30కు పట్నా నుంచి ఇండిగో విమానంలో తిరుగుపయనమయ్యారు. కోల్‌కతాకు 200 కి.మీ. దూరంలో ఉన్నప్పుడే.. ల్యాండింగ్ వరుసలో మమత విమానం 8వ స్థానంలో ఉందని ఏటీసీ నుంచి పైలట్‌కు సందేశం వచ్చింది. అయితే ఈ విమానంలో ఇంధనం తక్కువగా ఉందని, అత్యవసరంగా ల్యాండింగ్‌కు అవకాశం ఇవ్వాలని పైలట్ తెలపటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అప్పటికే మరో మూడు విమానాలు ఇంధనం తక్కువుందని చెప్పటంతో 15 నిమిషాల తర్వాత మమత విమానానికి ఏటీసీ క్లియరెన్సు ఇచ్చింది.
అయితే నోట్ల రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మమతను మట్టుబెట్టేందుకు ప్రయత్నం జరుగుతుందనే అనుమానాన్ని ఉభయసభల్లో తృణమూల్ సభ్యులు లేవనెత్తారు. కాగా ఈ ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. మమత ప్రయాణించిన ఇండిగో తోపాటు మరో రెండు విమానాల్లోనూ ఇంధన కొరత ఏర్పడినట్లు సమాచారం వచ్చిందని విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు పార్లమెంటుకు తెలిపారు. మమత విమానం క్షేమంగానే ల్యాండ్ అయిందన్నారు. 3 విమానాలు ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు కోరటంతోనే మమత విమానం రావటం 13 నిమిషాలు ఆలస్యమైందని మంత్రి తెలిపారు. ఈ వివాదంపై డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విచారణకు ఆదేశించింది. బాధ్యులపై చర్యలు తప్పవని తెలిపింది.