ఇంతకీ ఎవరు ఆ టోపీవాలా.. ?
బ్రస్సెల్స్: బెల్జియం అధికారులు కంటిపై కునుకు లేకుండా పనిచేస్తున్నారు. బ్రస్సెల్స్ విమానాశ్రయంపై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఆత్మహుతి దాడి చేసి 32మంది పౌరులను బలి తీసుకున్న తర్వాత దాడికి కారణమైన ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే వాయువేగంతో దర్యాప్తు చేస్తున్న అధికారులు తాజాగా ఓ వీడియో ఫుటేజీని విడుదల చేశారు. అందులో ఓ వ్యక్తి లైట్ వైట్ కలర్ జాకెట్ వేసుకొని గుండ్రటి టోపీ పెట్టుకొని కంగారు పడుతూ వేగంగా కదలడం కనిపించింది.
బ్రస్సెల్స్‌లో ఎన్ని సీసీటీవీ కెమెరాలు ఉన్నాయో అన్నింటిలో అతడి కదలిక రికార్డయింది. ప్రస్తుతం దాడికి పాల్పడిన ముగ్గురిలో ఇద్దరు ఎయిర్ పోర్ట్ లోనే తమను తాము పేల్చుకోగా మిగిలి ఉన్న ఆ మూడో అనుమానిత ఉగ్రవాది ఇతడే అయ్యుంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మార్చి 22న ఉదయం 7.58గంటలకు ఎయిర్ పోర్ట్‌లో బాంబు పేలుళ్లు సంభవించాయి. ఆ వెంటనే ఈ వ్యక్తి అక్కడి నుంచి పారిపోవడం ప్రారంభించినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా తెలుస్తోంది.
ఎంతో సునాయాసంగా అతడు మొత్తం నగరాన్ని కాలినడకనే దాదాపు రెండు గంటలపాటు నడిచి తప్పించుకున్నాడు. అతడు వెళ్లిన విధానం చూస్తుంటే ముందుగానే ఆ మార్గంపై కసరత్తు చేసుకున్నట్లు కూడా అర్ధమవుతోంది. సరిగ్గా 9.50 గంటల ప్రాంతంలో అతడికి సీసీటీవీ కెమెరాకు సంబంధాలు తెగిపోయాయి. ఒకానొక చోట ఇదే వ్యక్తి తన జాకెట్ విప్పేసి కనిపించాడు. మరో సీసీటీవీలో చేతిలో ఫోన్‌తో ప్రత్యక్షమయ్యాడు. ఈ వీడియో విడుదల సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ తాము విడుదల చేసిన వీడియోలో ఉన్న వ్యక్తిని ఎవరైనా వీడియో తీసినా లేదా ఫొటో తీసిన తమకు ఇచ్చి సహకరించాలని అన్నారు.