అమ్మేవి పుస్తకాలు.. కొనేవి ఫోన్లు
ఓఎల్ఎక్స్... ఇటీవల వినియోగదారులను తనవైపు తిప్పేసుకున్న వెబ్సైట్. పాత వస్తువులకు కొత్త గిరాకీని తెచ్చిపెట్టిన ఈ సంస్థ... పాత వస్తువులను అమ్మడంలో, కొనడంలో భారతీయుల ఆలోచనా విధానమెలా ఉందనే అంశంపై ఈ సంస్థ ఓ సర్వే నిర్వహించింది. అందులో బయటపడ్డ కొన్ని అంశాలు... భారతీయులు తాము వాడిన వస్తువులను అమ్మడానికి ఎక్కువ ఇష్టపడటం లేదు. ఇందుకు వాటితో ఉన్న అనుబంధం కారణమైతే.. ఇంకొన్ని రోజులు వాడితే పోలా అనే యాటిట్యూడ్ మరో కారణం. అయితే ఈ విషయంలో ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది. 48 శాతం అమ్మకాలతో ఉత్తర భారతీయులు ముందంజంలో ఉండగా.. ఈశాన్య రాష్ట్రాల వాసులు తమ వస్తువులు అమ్మడానికి ఇష్టపడటం లేదు. ఈ అమ్మకాలు.. కొనుగోళ్లలో ముంబై వాసులు ముందంజలో ఉండగా... దిల్లీవాసులు ద్వితీయ స్థానానికి చేరుకున్నారు. ఇంట్లో ఏదైనా వ స్తువును అమ్మాలంటే హోం మేకర్దే నిర్ణయం.
ఇక హైదరాబాదీ ఇళ్లలో సగటున రూ.8,400 విలువ చేసే వాడని వస్తువులు ఉంటున్నాయట. నగరంలో పాత వస్తువుల అమ్మకం నిర్ణయం 45 శాతం ఇళ్లలో మహిళలపైనే ఆధారపడి ఉంటోంది. వాళ్ల ఇష్టాయిష్టాల మేరకే అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతున్నాయి. నగరవాసులు అమ్మడానికి ఇష్టపడనివి కిచెన్ అప్లయన్సెస్. ఎక్కువగా అమ్ముతున్నవి పుస్తకాలు. ప్రధానంగా... కొత్తవి, ఇంకొంచెం ఆధునికమైనవి కొనాలనే ఆకాంక్షతో పాత వస్తువులను అమ్మేస్తున్నారట నగరవాసులు. ఇంట్లో పడి ఉన్నాయికదా అని అమ్మేసేవారూ ఉన్నారు. కొనుగోళ్ల విషయానికి వస్తే... మొబైల్స్ ఇతర డ్యూరబుల్ ఐటెమ్స్ కొనేందుకే ఎక్కువ మక్కువ చూపిస్తున్నవారూ ఉన్నారు. తక్కువ ఖరీదులో మంచి వస్తువులు దొరుకుతున్నాయి కాబట్టి వీటిని కొంటున్నామంటున్నారు.
సాక్షి, సిటీప్లస్