యూనివర్సిటీల్లో రాజకీయాలు వద్దు: బిట్టా
తిరుచానూరు: దేశవ్యాప్తంగా యూనివర్సిటీల్లో రాజకీయ ప్రమేయం ఎక్కువైందని అఖిల భారత ఉగ్రవాద వ్యతిరేక సంస్థ చైర్మన్ ఎంఎస్.బిట్టా అన్నారు. వర్సిటీల్లో విద్యకు తప్ప రాజకీయాలకు తావుండరాదన్నారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో సోమవారం విలేకర్లతో ఆయన మాట్లాడారు. ఢిల్లీలోని జేఎన్‌యూలో జరిగిన ఘటన ల వెనక పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐ ప్రమేయం ఉందని తాను భావిస్తున్నట్లు తెలిపారు.
దేశంలోని పౌరులకు స్వేచ్ఛ ఉందని, అయితే దేశ వ్యతిరేక నినాదాలు చేయడం క్షమించరాని నేరమన్నారు.దేశానికి వ్యతిరేకంగా, ఉగ్రవాది అఫ్జల్‌గురుకు మద్దతుగా నినాదాలు చేసిన విద్యార్థి నాయకుడు కన్హయ్య దేశద్రోహేనని పేర్కొన్నారు. కన్హయ్యను జాతీయ ఎలక్ట్రానిక్ మీడియా హీరో చేయడం సముచితం కాదన్నారు. ఉగ్రవాదానికి కేంద్ర బిందువైన పాకిస్తాన్‌ను ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టాలని కేంద్రాన్ని కోరారు. తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోవడం బాధాకరమన్నారు. ఏపీ, తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందడానికి కేంద్రం భారీగా ప్యాకేజీలు ఇవ్వాలన్నారు. ఉగ్రవాద ముప్పు ఉన్న నేపథ్యంలో తిరుమల ఆలయాన్ని నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించాలని కోరారు.