ప్రేమికురాలిపై యాసిడ్ దాడి: నిందితుడికి జీవిత ఖైదు
ప్రేమికురాలిపై యాసిడ్ దాడి చేసి ఆమె మృతికి కారణమైన నిందితుడికి న్యూఢిల్లీ కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. కోర్టు అడిషనల్ సెషన్స్ జడ్జి రాజేష్ కుమార్ గోయెల్ నిందితుడు అజయ్ భారతికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించారు. అంతేకాకుండా రూ. 2వేల నగదు జరిమానాగా విధించింది. నగరంలోని రోహిణి సమీపంలోని జపనీస్ పార్క్ ప్రాంతంలో నివసించే ఓ వివాహిత మహిళతో నిందితుడు అజయ్ భరత్ అక్రమ సంబంధం ఏర్పరుచుకున్నాడు. అయితే ఆ మహిళ మరో పురుషుడితో సన్నిహితంగా ఉండటాన్ని అజయ్ భరించలేకపోయాడు. దాంతో ఆమెపై యాసిడ్ దాడి చేసి పరారైయ్యాడు.
స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటన ఢిల్లీలో 2006లో చోటు చేసుకుంది. సమాజంలో మహిళలపై వేధింపులు అధికమవడమే కాకుండా యాసిడ్ దాడులు జరుగుతుండటంపై జడ్జి ఆందోళన వ్యక్తం చేశారు.