Ajay Mathur
-
రూఫ్‌టాప్ సోలార్ కిట్లకు తెగ డిమాండ్
న్యూఢిల్లీ: రూఫ్‌టాప్ సోలార్ కిట్లకు డిమాండ్ గణనీయంగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా గతేడాది ద్వితీయ ఆరు నెలల కాలంలో 5.2 మిలియన్ కిట్లు అమ్ముడుపోయాయి. గతేడాది మొదటి ఆరు నెలల అమ్మకాలతో పోలిస్తే 20 శాతం పెరగ్గా, 2019 ద్వితీయ ఆరు నెలల కాలంతో పోలిస్తే 18 శాతం వృద్ధిని చూసినట్టు ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ డైరెక్టర్ జనరల్ అజయ్ మాథుర్ తెలిపారు. సోలార్ రూఫ్‌టాప్ మార్కెట్ గతేడాది బలమైన పనితీరు చూపించినట్టు పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన దక్షిణాసియా ఫోరమ్ సదస్సులో భాగంగా మాథుర్ మాట్లాడారు. ఈ సదస్సును కేంద్ర పునరుత్పాదక ఇంధనం, కెమికల్స్, ఫెర్టిలైజర్స్ శాఖల సహాయ మంత్రి భగవంత్ ఖుబా ప్రారంభించారు. సుస్థిర అభివృద్ధి, ఇంధన లభ్యత పెంపొందించడం తదితర అంశాలపై ఈ కార్యక్రమంలో భాగంగా చర్చలు జరిగాయి. 200 వరకు దేశీ, అంతర్జాతీయ భాగస్వాములు ఇందులో పాల్గొన్నారు. -
‘100 బిలియన్ల’ హామీపై స్పష్టత!
భారత్ సహా ‘బేసిక్’ దేశాల డిమాండ్ లీ బౌజెట్(ఫ్రాన్స్): వాతావరణ మార్పుపై పోరాటానికి మద్దతుగా వర్ధమాన దేశాలకు 2020 నుంచి ఏటా 100 బిలియన్ డాలర్ల సాయం అందిస్తామన్న హామీకి సంబంధించి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక కావాలని ధనిక దేశాలను ‘బేసిక్’ దేశాలు డిమాండ్ చేశాయి. వాతావరణ సదస్సులో న్యాయమైన, సమతౌల్య ఒప్పందం కుదిరేందుకు సభ్యదేశాల భాగస్వామ్యం ఉన్న పారదర్శక చర్చల ప్రక్రియకు పూర్తి సహకారం అందిస్తామని బేసిక్ దేశాలైన బ్రెజిల్, దక్షిణాఫ్రికా, భారత్, చైనాల తరఫున బుధవారం చైనా ఒక ప్రకటన విడుదల చేసింది. ఉద్గారాల తగ్గింపునకు సంబంధించి అభివృద్ధి చెందిన దేశాలు ప్రగతిశీల లక్ష్యాలను పెట్టుకోవాలని భారత్ కోరుతోందని పారిస్ చర్చల్లో భారత్ తరఫున పాల్గొంటున్న అజయ్ మాథుర్ తెలిపారు. కర్బన ఉద్గారాల తగ్గింపునకు సంబంధించి ఒబామా ప్రభుత్వం తీసుకువచ్చిన నిబంధనలను తోసిపుచ్చుతూ అమెరికా ప్రతినిధుల సభ రెండు తీర్మానాలను ఆమోదించింది. ఇది ఒబామాకు పెద్ద ఎదురుదెబ్బే. మొదటి 10% వాటా 50%: ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లోని తొలి 10% మంది వల్ల విడుదలయ్యే శిలాజ ఇంధన ఉద్గారాలు మొత్తం ఉద్గారాల్లో 50% ఉంటాయని, అత్యంత పేదల్లోని చివరి 50% మంది వల్ల విడుదలయ్యే ఉద్గారాలు మొత్తం ఉద్గారాల్లో 10 శాతమేనని ఆక్స్‌ఫామ్ సంస్థ ఒక నివేదికలో పేర్కొంది. అత్యంత పేద వ్యక్తి వల్ల విడుదలయ్యే కాలుష్య కారకాల కన్నా అత్యంత ధనికుల్లోని మొదటి 1%లో ఉన్న సంపన్నుడి వల్ల విడుదలయ్యే కాలుష్యం 175 రెట్లు అధికంగా ఉంటుందని వెల్లడించింది. -
ఇక టీవీలూ, గీజర్లకూ రేటింగ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విద్యుత్ వాడకం ఆధారంగా ఇచ్చే స్టార్ రేటింగ్‌ను ఇక నుంచి టీవీలు, గీజర్లకు తప్పనిసరి చేయనున్నట్టు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ(బీఈఈ) తెలిపింది. విద్యుత్ వాడకాన్ని బట్టి వీటికి 1 నుంచి 5 వరకు బీఈఈ స్టార్ రేటింగ్ ఉంటుంది. ప్రస్తుతం స్వచ్ఛంద రేటింగ్ జాబితాలో ఉన్న టీవీలు, గీజర్లు 2014 జనవరి 1 నుంచి తప్పనిసరి రేటింగ్ జాబితా కిందకు వెళ్తాయి. తద్వారా ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, ట్రాన్స్ఫార్మర్ల సరసన చేరతాయి. స్టార్ ఏసీ కనుమరుగు.. 2014 జనవరి 1 నుంచి స్టార్ రేటింగ్‌ను కఠినతరం చేయనున్నట్టు బీఈఈ డెరైక్టర్ జనరల్ అజయ్ మాథుర్ తెలిపారు. బుధవారమిక్కడ సీఐఐ 12వ ఎనర్జీ ఎఫీషియెన్సీ సమ్మిట్-2013లో పాల్గొన్న ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. ‘ఏసీలు, రిఫ్రిజిరేటర్ల ప్రస్తుత రేటింగ్‌ను మారుస్తాం. అంటే 5 స్టార్ 4 స్టార్ అవుతుంది. 4 స్టార్ 3 స్టార్ అవుతుంది. ఈ విధానంలో ప్రస్తుత 1 స్టార్ ఏసీలు కనుమరుగవుతాయి. అలాగే 5 స్టార్ ఉపకరణం మరింత సమర్థవంతంగా పనిచేసి అతి తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తుంది’ అని తెలిపారు. అయితే ఉత్పత్తుల ధరలు పెరగడానికి రేటింగ్ ఒక్కటే కారణం కాదు. ముడిసరుకు ధర పెరగడం, రూపాయి పతనం కూడా కారణమని ఆయన స్పష్టం చేశారు. విద్యుత్‌ను ఆదా చేసే పరిజ్ఞానం అభివృద్ధికి పరిశోధనా సంస్థలకు, కంపెనీలకు రుణ సహాయం చేసే అంశంపై కేంద్ర ఆర్థిక శాఖతో చర్చిస్తున్నట్టు ఈ సందర్భంగా ఆయన చెప్పారు.