గోవాడ సుగర్స్‌లో తప్పిన ఘోర ప్రమాదం
=గోడౌన్లో మీదపడ్డ పంచదార బస్తాలు
=ఆరుగురు కార్మికులకు తీవ్ర గాయాలు
=ముగ్గురి పరిస్థితి విషమం
చోడవరం, న్యూస్‌లైన్ : గోవాడ చక్కెర కర్మాగారంలో భారీ ప్రమాదం తప్పింది. గోడౌన్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులపై పంచదార బస్తాలు పడిపోవడంతో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. యాజమాన్యం సకాలంలో స్పందించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. గోవాడ చక్కెర కర్మాగారంలో శుక్రవారం ఎ షిప్ట్‌లో కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. రెండో నంబర్ గోడౌన్లో వేరేచోటికి తరలించేందుకు బస్తాలను మోస్తున్న 8మంది కార్మికులపై ప్రమాదవశాత్తు నిట్టలో ఉన్న బస్తాలు వచ్చి మీదపడ్డాయి.
ఒకేసారి వందలాది బస్తాలు పడిపోవడంతో ఆరుగురు వాటికింద చిక్కుకుపోయారు. ఇంతలో అక్కడే ఉన్న తోటి కార్మికులు హుటాహుటిన అక్కడికి వచ్చి వారిని బయటికి తీశారు. వీరిలో శానాపతి దాలిబాబు, గోవాడ అప్పారావు, గొర్లె రాజాబాబులు తీవ్రంగా గాయపడగా పొట్నూరి గోవింద, పూతి అర్జున, చల్లా శేషగిరిరావులకు స్పల్ప గాయాలయ్యాయి. వీరందరికీ కర్మాగారంలోని ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురు పంచదార బస్తాల కింద బాగా నలిగిపోవడంతో శ్వాస ఆడలేదు. ఇద్దరికి చేతులు విరిగిపోయాయి.
దీంతో వీరిని మెరుగైన వైద్యానికి విశాఖలోని ప్రయివేటు ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలించారు. ప్రమాదం జరిగిందని సైరన్ మోగడంతో కార్మికులంతా పరుగులు తీశారు. కర్మాగారం చైర్మన్ గూనూరు మల్లునాయుడు, మేనేజింగ్ డైరక్టర్ మజ్జి సూర్యభగవాన్ హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. యూనియన్ అధ్యక్షుడు బాస్కరరావు, అధికారులు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. కార్మికులు ప్రమాదానికి గురయ్యారని తెలియడంతో గోవాడ, అంబేరుపురం పరిసర ప్రాంతాల నుంచి కార్మికుల కుటుంబ సభ్యులు, ప్రజలు, వివిధ పార్టీల నేతలు చేరుకున్నారు. ఆ ప్రాంతమంతా ఆర్తనాదాలతో నిండిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.