శిక్షల అమలులో ఈ పక్షపాతమెందుకు?
ఉరిశిక్షకు గురైన హంతకుడు లేదా ఉగ్రవాదికి బలమైన రాజకీయ మద్దతు ఉంటే కేంద్రం కానీ, న్యాయస్థానాలు కానీ నిష్పాక్షికంగా తీర్పు విధించే సాహసం చేయలేవు. కానీ అజ్మల్, అఫ్జల్ గురు, యాకుబ్ మెమొన్ వంటి కొందరు హంతకుల విషయానికి వచ్చేసరికి అవి న్యాయాన్ని ఎత్తిపట్టడంలో, శిక్షల్ని అమలు చేయటంలో ఎంతో స్పష్టంగా ఉండటమే విచిత్రం. ముస్లింలకూ లేదా తలారి బారిన పడుతున్న వారి సంబంధీకులకూ రాజకీయ మద్దతు లోపించిందనిపిస్తోంది.
ఇబ్రహీం టైగర్ మెమొన్ సోదరుడు యాకుబ్ మెమొన్‌ను ఈ నెల చివర్లో ఉరితీయనున్నారు. రెండు దశాబ్దాలుగా నాకు సుపరిచితుడైన న్యాయమూర్తి పీడీ కొడే, మెమొన్కు ఉరిశిక్ష విధించారు. ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్న ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానంలో నేను రిపోర్టర్‌గా ఉండేవాడిని. కుట్ర ఆరోపణలతో యాకుబ్ మెమొన్కు కొడే ఉరిశిక్ష విధించడం మెమొన్ న్యాయవాది సతీష్ కాన్సేతోపాటు కొంతమందిని ఆశ్చర్యపరిచింది. సతీష్ కొన్నేళ్ల క్రితం రెడిఫ్.కామ్‌కి చెందిన షీలా భట్‌తో ఇలా అన్నారు.‘‘ పాకిస్తాన్లో సైనిక శిక్షణలో యాకుబ్ ఎన్నడూ పాల్గొనలేదు... అతడు బాంబులను లేదా ఆర్డీఎక్స్ని అమర్చలేదు. ఆయుధాలను దేశంలోకి తీసుకురావడంలో కూడా అతడు పాలు పంచుకోలేదు. ఈ కేసులో ఉరిశిక్షకు గురైనవారిలో ఒకరు ఇలాంటి ప్రాణాంతక చర్యల్లో ఒకదాంట్లో పాల్గొన్నారు. యాకుబ్‌పై చేసిన నేరారోపణలో ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు నమోదు కాలేదు.’’
అయినా అతడిని ఏదోరకంగా ఉరి తీయనున్నారు. బలమైన ఆరోపణ లేనప్పటికీ ఉరిశిక్ష విధిస్తున్న కేసులలో ఇదే మొదటిది. యాకుబ్ మెమొన్పై విచారణ సాగించిన న్యాయవాది ఉజ్వల్ నికమ్ (పాకిస్తాన్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ బిర్యానీని డిమాండ్ చేశాడని అబద్ధాలాడి వార్తల్లో నిలిచినవాడు) మెమొన్ గురించి ఇలా అభిప్రాయపడ్డారు. ‘‘న్యాయస్థానానికి తొలిసారి తీసుకువచ్చినప్పుడు అతడు ప్రశాంతంగానూ, మితభాషిగానూ కనిపించాడు. అతడు చార్టర్డ్ అకౌంటెంట్ కాబట్టి సాక్ష్యాలకు సంబంధించి వివరణాత్మకమైన నోట్స్ తీసుకున్నాడు. అతడు ప్రశాంతచిత్తంతో విడిగా ఉండేవాడు. ఇతరులతో అతడు ఎన్నడూ సంబంధం పెట్టుకోలేదు. తన న్యాయవాదితో మాత్రమే మాట్లాడేవాడు. వివేచనాపరుడిగా మొత్తం విచారణను సన్నిహితంగా పరిశీలించేవాడు.’’
న్యాయస్థానంలో నేనున్న సమయాల్లో కూడా నేను దీన్నే గమనించాను. మెమొన్ మౌనంగా ఉండి, విచారణను శ్రద్ధగా వినేవాడు. తను భావోద్వే గాన్ని వ్యక్తపరిచేవాడని నేను గమనించాను. బహుశా అది 1995 లేదా 1996 మొదట్లో కావచ్చు. ఆ సమయంలో ట్రయల్ జడ్జిగా ఉన్న జేఎన్ పటేల్ ముంబై బాంబు పేలుళ్ల ఘటనలో నిందితులైన పలువురికి బెయిల్ ఇచ్చారు. నిందితులు కొంత ఆశాభావంతో ఉండేవారు కానీ మెమొన్ మనుషులకు ఉండేది కాదు. తమకు బెయిల్ ఇవ్వని సమయంలో యాకుబ్ హింసాత్మ కంగా వ్యవహరిస్తూ (ఎవరినీ కొట్టకుండానే) పెద్దగా అరిచినట్లు గుర్తు. అతడన్నాడుః ‘‘టైగర్ చెప్పింది నిజం. మేం వెనక్కు తిరిగి రాకుండా ఉండాల్సింది.’’
తదుపరి సంవత్సరాల్లో అతడిలో ఏమైనా మార్పు వచ్చిందా అనే విషయం నన్ను విస్మయపరుస్తుంటుంది. అతడు నేడు నాగపూర్ జైలులో ఒంటరి నిర్బంధంలో ఉంటూ (సుప్రీంకోర్టు ప్రకారం అది చట్టవిరుద్ధం) తనను ఉరితీసే తలారీ కోసం ఎదురు చూస్తున్నాడు. చివరి ప్రయత్నంగా కోర్టు ముందుకు తీసుకెళ్లడమే మిగిలి ఉంది. యాకుబ్ మెమొన్ని ఎందుకు ఉరితీయకూడదో వాదిస్తూ ఫస్ట్‌పోస్ట్.కామ్‌కు చెందిన నా మిత్రుడు ఆర్. జగన్నాథన్ చక్కటి వ్యాసం రాశాడు. లేదా అతడి మాటల్లో చెప్పాలంటే మెమొన్‌ను ఉరితీయడంలో ఈ తొందరపాటు చర్య న్యాయపరీక్షకు నిలబడేది కాదు. రాజీవ్‌గాంధీ, పంజాబ్ దివంగత సీఎం బియాంత్ సింగ్‌ల హత్య ఘటనలో ఉరిశిక్షకు గురైన నేరస్తులను నేటికీ ఉరితీయలేదని నా మిత్రుడు వాదిస్తుంటాడు.
రాజీవ్ హంతకుల్లో ముగ్గురికి (శాంతన్, మురుగన్, పెరారివలన్) క్షమాబిక్ష పెట్టాలని తమిళనాడు శాసనసభ కోరిన తర్వాత వారి శిక్షను తగ్గించారు. బియాంత్ సింగ్ హంతకుడు బల్వంత్ సింగ్ తన అపరాధాన్ని గర్వాతిశయంతో అంగీకరించాడు. పైగా తనను ఉరితీయవలసిందిగా స్వయంగా డిమాండ్ చేశాడు. అయినప్పటికీ అతడిని సజీవుడిగానే ఉంచారు. బహుశా పంజాబ్ శాసనసభ సాగించిన ప్రయత్నాల వల్లే కావచ్చు. జగన్నాథన్ ఇంకా ఇలా రాశారు. ‘‘సాధారణ దృష్టికి స్పష్టమయ్యేది ఏమిటంటే, ఉరిశిక్షకు గురైన హంతకుడు లేదా ఉగ్రవాదికి బలమైన రాజకీయ మద్దతు ఉంటే, కేంద్రం కానీ, న్యాయస్థానాలు కానీ నిష్పాక్షికంగా తీర్పు విధించే సాహసం చేయలేవు. కానీ అజ్మల్, అఫ్జల్ గురు, ఇప్పుడు బహుశా యాకుబ్ మెమొన్ వంటి కొందరు హంతకుల విషయానికి వచ్చేసరికి ఇదే కేంద్రం, రాష్ట్రాలు, న్యాయస్థానాలు న్యాయాన్ని ఎత్తిపట్టడంలో ఎంత స్పష్టంగా ఉంటాయో ఎవరికి వారు పరిశీలించుకోవలసిందే.
ముస్లింలకూ లేదా తలారి బారిన పడుతున్న వారి సంబంధీకులకూ రాజకీయ మద్దతు లోపించిన విషయం స్పష్టంగా తెలుస్తోంది.’’ నేను ఒప్పుకుంటాను... హత్యలకు ముందే పేలుళ్లు జరిగాయి కాబట్టి, ఈ కారణంతోనే మెమొన్ని ఉరితీయాలని నేను భావిస్తాను. కానీ, నా అభి ప్రాయం ప్రకారం, పేలుడు ఘటనలపై సుదీర్ఘ న్యాయ ప్రక్రియ ముగిసిన తర్వాత చేపట్టవలసిన చిట్టచివరి చర్య ఉరితీత. ముంబై పేలుళ్ల నేరానికి పాల్పడిన వారిని రిపోర్టరుగా నా తొలిరోజే కలుసుకున్నాను. ఆ సాయంత్రం చాలా లేటుగా ముంబై అర్థర్ జైలులో వారిని నేను కలిశాను. అప్పటికే జైలు గేట్లను మూసివేశారు. కానీ విచారణ ఖైదీలుగా ఉంటూ బెయిల్ పొందని తమ భర్తలకు, కుమారులకు లేదా సోదరులకు ఇంటి నుంచి తెచ్చిన ఆహారాన్ని అందించడానికి అనుమతి కోరుతూ డజను మంది మహిళలు అక్కడ వేచి చూస్తున్నారు. వీరిలో ఎక్కువమంది బుర్ఖా ధరించి ఉన్నారు. ఆ మహిళలకు ఇంగ్లిష్‌లో రాయడం తెలీదు. వారిలో ఒకరు అనుమతి లేఖ రాసిపెట్టమని నన్ను కోరారు. వాళ్లందరికీ నేను అనుమతి పత్రాలు రాసిచ్చాను.
ఆ పని నేను పూర్తి చేయగానే, ఒక గార్డు జైలు గేటు బయటకు వచ్చి జైలులోపల ఉన్నతంగా కనిపిస్తున్న ప్రాంతంలో ఉన్న నల్లటి కిటికీవైపు చేయి చాచి, జైలర్ నన్ను కలవాలనుకుంటున్నట్లు చెప్పాడు. నేను అతడిని అనుసరించి జైలర్ వద్దకు వెళ్లాను. అతడి పేరు హిరేమత్. నేను ఏ పనిచేస్తున్నదీ అడిగాడు. నేను చెప్పాక అతడు నాపట్ల మృదువుగా వ్యవహరిం చాడు. జైలులోపలి భాగాలను చూపించడంలో నాకు సహకరించాడు. ‘మీరు సంజయ్‌దత్‌ను కలవాలనుకుంటున్నారా?’ అని నన్నడిగాడు. అవునన్నాను.
ఆ విధంగా నేను ముంబై పేలుళ్ల ఘటనలో నిందితుల గురించి తెలుసు కుంటూ వచ్చాను. న్యాయస్థానాల్లో, జైలులో వారితో భేటీ అవుతూ వచ్చాను. వారిలో కొందరు సంజయ్దత్లాగా తిరిగి జైలుకు వచ్చేవారు. మహమ్మద్ జింద్రాన్ వంటి ప్రశాంతచిత్తుడైన, చక్కగా మాట్లాడే మధ్యతరగతి వ్యక్తులు విచారణ క్రమంలోనే హత్యకు గురయ్యారు. ఈ సుదీర్ఘ విచారణ క్రమంలో యాకుబ్ ఇప్పుడు ఉరికొయ్యపై వేలాడేందుకు సిద్ధంగా ఉన్నాడు.
(వ్యాసకర్త కాలమిస్టు, రచయిత) aakar.patel@icloud.com)
- ఆకార్ పటేల్