అక్కినేని అవార్డుల వేడుక
చెన్నై కామరాజర్ అరంగమే వేదిక జీ ఆనంద్ స్వరమాధురి
అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (ఏఎఫ్ఏ) నేతృత్వం
ప్రవేశం ఉచితం
సాక్షి ప్రతినిధి, చెన్నై: అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (అఫా) నేతృత్వంలో అక్కినేని ఇంటర్నేషనల్ అవార్డుల కార్యక్రమం ఈనెల 14వ తేదీన చెన్నైలో జరుగనుంది. తేనాంపేట కామరాజర్ అరంగంలో సాయంత్రం 5.30 గంటలకు ఆరంభమయ్యే ఈ వేడుకలకు ప్రవేశం ఉచితంగా కాగా అందరూ ఆహ్వానితులేనని నిర్వాహకులు తెలిపారు. పద్మవిభూషణ్, నటసామ్రాట్ అక్కినేని ఇంటర్నేషనల్ పేరున అమెరికాకు చెందిన అఫా సంస్థ మూడో అవార్డుల వేడుకను చెన్నైలో నిర్వహించాలని తలపెట్టింది. అపోలో గ్రూపు ఆసుపత్రుల వ్యవస్థాపక చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతుండగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిప్యూటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్, పల్లవ గ్రూపు సంస్థల చైర్మన్, ఆంధ్రా సోషల్, కల్చరల్ అసోసియేషన్(ఆస్కా) అధ్యక్షులు డాక్టర్ కే సుబ్డారెడ్డి, మహానటి సావిత్రి కుమార్తె విజయచాముండేశ్వరి విశిష్ట అతిధులుగా హాజరవుతున్నారు. ప్రముఖ సినీ నేపధ్యగాయకులు, సంగీత దర్శకులు జీ ఆనంద్ వారి స్వరమాధురి ఫౌండేషన్ అధ్వర్యంలో మ్యూజికల్ నైట్ సాగనుంది. ప్రముఖ సినీ నేపథ్య గాయకులు రాము, చంద్రతేజ, పవన్, సమీరా భరద్వాజ్, వర్దాని తమన్, ప్రవస్థి, ఆకునూరి శారద (యూఎస్ఏ), హరిప్రియ సినీ గీతాలను ఆలపిస్తారు. ఈ అవార్డుల మహోత్సవానికి అందరూ ఆహ్వానితులే, ప్రవేశం పూర్తిగా ఉచితమని నిర్వాహకులు తెలిపారు.