Aksayapatra
-
ఆనంద నిలయుడి చెంత ‘అక్షయ’ పాత్ర
♦ రోజూ లక్ష మంది భక్తులకు అన్నప్రసాదాల తయారీ ♦ ఏప్రిల్ నుంచి భక్తులకు అందుబాటులోకి.. సాక్షి, తిరుమల ; అక్షయపాత్రను శరణువేడితే ఆహార సంపదకు కొదవ ఉండదు. అదే సత్సంకల్పంతోనే తిరుమల తిరుపతి దేవస్థానం అక్షయ పాత్ర పేరుతో కొత్త వంటశాల నిర్మిస్తోంది. రోజుకు లక్ష మందికి ఆహార పదార్థాలు తయారు చేసేలా అందుబాటులోకి తీసుకువస్తోంది. ముప్పైవసంతాలుగా టీటీడీ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని మహాయజ్ఞంలా నిర్వహిస్తోంది. 1985 ఏప్రిల్ 6న రెండువేల మందితో ప్రారంభించి ప్రస్తుతం 1.27 లక్షల మందికి అన్నప్రసాదాలు అందిస్తోంది. ప్రధానంగా తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నప్రసాద కేంద్రంతోపాటు రెండవ వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని వంటశాలల ద్వారా రోజుకు రూ.1.06 లక్షల మందికి, తిరుపతి, తిరుచానూరులో మరో 26 వేల మందికి అన్నప్రసాదాలు తయారుచేసి వడ్డిస్తున్నారు. మరో లక్ష మందికి అన్నప్రసాదాలు.. సాధారణ రోజుల్లో వచ్చే భక్తులకు ప్రస్తుతం ఉన్న రెండు వంటశాలలు సరిపోతున్నాయి. రద్దీ రోజుల్లోనూ, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి వంటి పర్వదినాల్లోనూ వచ్చే భక్తుల రద్దీకి ఇవి సరిపోవటం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మరో లక్ష మందికి అన్నప్రసాదాలు వడ్డించాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. పైగా రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని వంటశాల వల్ల ప్రమాదం జరిగితే దాని తీవ్రత పెద్ద స్థాయిలో ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. అలాగే, ఆ వంటశాల వల్ల వైకుంఠం క్యూకాంప్లెక్స్ పటిష్టత దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు గుర్తించారు. దీంతో వెలుపల ప్రాంతంలో రోజుకు లక్ష మందికి భక్తులకు అన్నప్రసాదాలు వండేలా కొత్త వంటశాల రూపొందించారు. మార్చిచివరినాటికి నిర్మాణం పనులు పూర్తవుతాయి. వేసవికి అందుబాటులోకి తీసుకొస్తాం అక్షయ కొత్త వంటశాలను వేసవి భక్తులరద్దీకి అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు ఆదేశించారు. ఆమేరకు మార్చినాటికి నిర్మాణం పనులు పూర్తవుతాయి. ఆ వెనువెంటనే వంటశాలకు సామగ్రి ఏర్పాటు చేస్తాం. ఇక్కడ వండే అన్నప్రసాదాలు శ్రీవారి దర్శనానికి వెళ్లే క్యూలోని భక్తులకు, కంపార్ట్మెంట్లలో వేచి ఉండేవారికి, ఉత్సవాల సమయాల్లో ఆలయ వీధుల్లో వేచి ఉండే భక్తులకు వడ్డిస్తాం. ఎంత రద్దీ వచ్చినా అందరికీ సులభంగా అన్నప్రసాదాలు వితరణ చేయాలనే సంకల్పంతో ముందుకు పోతున్నాం. - సాగి వేణుగోపాల్, టీటీడీ డిప్యూటీ ఈవో -
అంగన్వాడీల్లో ‘అక్షయపాత్ర’ వద్దు
ఏపీ అంగన్వాడీ యూనియన్ నాయకుల డిమాండ్15న చలో పార్లమెంట్ విజయవంతానికి పిలుపు పీఎన్‌కాలనీ (శ్రీకాకుళం):అంగన్వాడీ కేంద్రాల్లో నూతనంగా అమలు చేసిన ‘అక్షయపాత్ర’ పథకాన్ని రద్దు చేయాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.హిమాప్రభ డిమాండ్ చేశారు. శ్రీకాకుళం పట్టణంలోని సీఐటీయూ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఫిబ్రవరి 5న ‘అక్షయ పాత్ర’ అనే పథకాన్ని ప్రారంభించారని, పాతవాటినే కొనసాగించలేని ప్రభుత్వం కొత్త పథకాలకు ఏమిస్తుందని విరుచుకుపడ్డారు. ఇవన్నీ ప్రజలను మభ్యపెట్టడానికే అని మండిపడ్డారు. 2015-2016 ఆర్థిక సంవత్సరంలో ఐసీడీఎస్‌కు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కోత విధించడంతో పిల్లలకు పౌష్టికాహారం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల సరఫరా సరిగా లేదని, భవనాల అద్దెలు, టీఏ, డీఏలు గత 8 నెలలుగా చెల్లించలేదని పేర్కొన్నారు. 2016-2017 బడ్జెట్లో ఐసీడీఎస్‌కు రూ.26,533 కోట్లు కేటాయించాలని, అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయాలనే డిమాండ్‌తో ఈ నెల 15న చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని అంగన్వాడీ ఉద్యోగులంతా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీఐటీయూ గౌరవాధ్యక్షులు ఎం.జయలక్ష్మి, ఉపాధ్యక్షులు డి.సుదర్శనం, సహాయ కార్యదర్శి పి.లతాదేవి, ట్రెజరర్ కె.క ల్యాణి, టి.రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.