కంకిపాడు సబ్‌రిజిస్ట్రార్ సస్పెన్షన్
హైకోర్టు ఉత్తర్వులు బేఖాతరు
అక్షయ గోల్డ్ ఆస్తిని అక్రమంగా రిజిస్టర్ చేసిన సబ్ రిజిస్ట్రార్
సస్పెండ్ చేసిన రిజిస్ట్రేషన్ శాఖ
విజయవాడ : నగరంలో మరో అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారం బట్టబయలైంది. కస్టమర్లకు కోట్లాది రూపాయలు ఎగనామం పెట్టిన ఓ ఫైనాన్స్ సంస్థకు చెందిన ఆస్తులను కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్‌ను గురువారం సస్పెండ్ చేశారు. అక్షయ గోల్డ్ ఫైనాన్స్ సంస్థ ఖాతాదారుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి రెండేళ్ల క్రితం బోర్డు తిప్పేసింది. ఈ కేసు విచారిస్తున్న సీబీసీఐడీ అధికారులు ఫైనాన్స్ సంస్థకు సంబంధించిన ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయవద్దని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అక్షయ గోల్డ్ ఆస్తుల లావాదేవీలన్నీ నిలిపివేయాలని కొద్దిరోజుల క్రితం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఆ ఉత్తర్వులను కమిషనర్ రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపారు. అయితే గత ఏప్రిల్‌లో నూజివీడు ప్రాంతంలో అక్షయగోల్డ్ ఫైనాన్స్‌కు చెందిన 6.50 ఎకరాల భూమిని మరొకరి పేరుతో రిజిస్టర్ చేసినట్లు సీబీసీఐడీ అధికారులు గుర్తించారు. గుణదల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ అక్రమ రిజిస్ట్రేషన్ జరిగినట్లు నిర్ధారించారు.
ప్రస్తుతం కంకిపాడు సబ్-రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న ఆర్.కె.నరసింహారావు గుణదల జాయింట్-2 సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న సమయంలో విచారణలో ఈ రిజిస్ట్రేషన్ చేసినట్లు తేలింది. హైకోర్టు ఆదేశాలు, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ ఉత్తర్వులను ఉల్లంఘించి జరిగిన ఈ అక్రమ రిజిస్ట్రేషన్‌పై సీబీసీఐడీ అధికారులు ఆ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశారు. దీనిపై విచారణ జరపాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ విజయవాడ డీఐజీ లక్ష్మీనారాయణరెడ్డిని ఆ శాఖ కమిషనర్ ఆదేశించారు. డీఐజీ సూచనల మేరకు విజయవాడ తూర్పు డీఆర్ బాలకృష్ణ దీనిపై దర్యాప్తు నిర్వహించారు. హైకోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా అక్షయగోల్డ్ భూమిని రిజిస్టర్ చేసినట్లు బాలకృష్ణ గుర్తించి నివేదిక అందజేశారు. దీంతో సబ్ రిజిస్ట్రార్ నరసింహారావును డీఐజీ సస్పెండ్ చేశారు. కంకిపాడుకు నూతన సబ్ రిజిస్ట్రార్‌గా బిక్కవోలు నుంచి ఎన్.ఎం.వి.త్రినాథరావును నియమించారు. ఆయన గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు.
కోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తూ అక్షయ గోల్డ్ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసిన కంకిపాడు సబ్‌రిజిస్ట్రార్‌పై వేటు పడింది. దీంతో ఆయన్ని సస్పెండ్ చేస్తూ ఆ శాఖ విజయవాడ డీఐజీ గురువారం ఆదేశాలిచ్చారు.