హైదరాబాద్‌లో పదో బయో ఆసియా సదస్సు..
2013- రాష్ట్రీయం
మెరుగైన ఈ-పాలనకు నెలవైన రాష్ట్రం 2013లో ప్రధాన సదస్సులకు వేదికగా నిలిచింది. పదో బయో ఆసియా సదస్సుతో పాటు తూర్పు ఆసియా, పసిఫిక్, దక్షిణాసియాల పర్యాటక సమావేశాలకు ఆతిథ్యమిచ్చింది!
రాష్ట్రంలోని శ్రీహరికోటలో గల సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) డెరైక్టర్‌గా మలపాక యజ్ఞేశ్వర సత్యప్రసాద్ (ఎం.వై.ఎస్. ప్రసాద్) జనవరి 1న బాధ్యతలు స్వీకరించారు. ఈయన 1953లో పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. 1975లో ఇస్రోలో చేరారు.
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్‌ను జనవరి 8 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించారు. పులికాట్ సరస్సుకు అధిక సంఖ్యలో వలస వచ్చే ఫ్లెమింగో పక్షుల ప్రాధాన్యతను తెలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం, పర్యాటక శాఖ ఈ ఉత్సవాలను నిర్వహించింది. గుజరాత్‌లోని రాణ్ ఆఫ్ కచ్ నుంచి ఈ పక్షులు వేలాదిగా వలస వస్తాయి.
తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలంలోని మాచవరం పంచాయతీ పరిధి కోఠివారి అగ్రహారానికి చెందిన గరిమెళ్ల మైథిలి అంతర్జాతీయ స్థాయి మహిళా రైతు అవార్డుకు ఎంపికయ్యారు. సేద్యంలో ‘విస్తరణ వ్యూహాలు, జీవన విధానం పెంపుదల’ అంశం ఆధారంగా మైథిలిని నాగపూర్‌లోని ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ ఈ అవార్డుకు ఎంపిక చేసింది.
హైదరాబాద్‌లో పదో బయో ఆసియా సదస్సు జనవరి 28 నుంచి 30 వరకు జరిగింది. ఇందులో 45 దేశాల నుంచి 600 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బయోటెక్నాలజీ రంగంలో అత్యున్నత కృషి చేసిన వారికి ఏటా ఇచ్చే జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్సీ
అవార్డులను కేంద్ర బయోటెక్నాలజీ విభాగం మాజీ కార్యదర్శి డాక్టర్ ఎం.కె.భాన్, ఫైజర్ ఫార్మా కంపెనీకి చెందిన ఫ్రీడా లూయిస్లకు ప్రదానం చేశారు.
ఉపాధి హామీ చట్టంపై ఎనిమిదో జాతీయ సదస్సును ఫిబ్రవరి 2న న్యూఢిల్లీలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తూ సామాజిక సమానత్వాన్ని పెంపొందించినందుకుగాను విశాఖ జిల్లాకు జాతీయ అవార్డు లభించింది. ఈ అవార్డును ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా అప్పటి విశాఖ జిల్లా కలెక్టర్ వి.శేషాద్రి అందుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు ఈ-పాలనలో రెండు జాతీయ అవార్డులు లభించాయి. ‘వినియోగదారుల ప్రయోజనార్థం ఐసీటీ (ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ)ని ప్రభుత్వ రంగ సంస్థలు సృజనాత్మకంగా ఉపయోగించడం’ అనే కేటగిరీలో ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఏపీ లిమిటెడ్‌కు చెందిన ఈపీఐఎంఆర్‌ఎస్ ఐటీ విభాగానికి రజతం, ‘ఎగ్జెంప్లరీ రీ యూజ్ ఆఫ్ ఐసీటీ బేస్డ్ సొల్యూషన్స్’ కేటగిరీలో గురుకుల విద్యాసంస్థల్లో ఐటీ సేవలకుగాను రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖకు కాంస్య పతకాలు లభించాయి.
హైదరాబాద్ మెట్రో రైలు (హెచ్ఎంఆర్)కు ‘బెస్ట్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు లభించింది. ఈ పురస్కారాన్ని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి న్యూయార్క్‌లో జరిగిన ఆరో వార్షిక ‘గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫోరమ్’ కాన్ఫరెన్స్‌లో ఫిబ్రవరి 28న అందుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 100 ఇన్ఫ్రాస్ట్రక్చర్
ప్రాజెక్ట్‌ల నుంచి హెచ్‌ఎంఆర్‌ను గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫోరమ్ ఎంపిక చేసింది.
2013-14 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మార్చి 18న శాసనసభకు సమర్పించారు. వివరాలు..
బడ్జెట్ మొత్తం:
రూ. 1,61,348 కోట్లు.
ప్రణాళికేతర వ్యయం: రూ. 1,01,926 కోట్లు
ప్రణాళికా వ్యయం: రూ. 59,422 కోట్లు
ద్రవ్యలోటు: రూ. 24,487 కోట్లు
రెవెన్యూ రాబడి: రూ.1,27,772.19 కోట్లు
రెవెన్యూ వ్యయం: రూ.1,26,749.41 కోట్లు
మొత్తం అప్పులు: రూ.1,79,637కోట్లు
వ్యవసాయానికి కార్యాచరణ ప్రణాళిక:రాష్ట్రంలో తొలిసారి వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికను వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ శాసనసభకు సమర్పించారు. వివరాలు..
కార్యాచరణ ప్రణాళిక వ్యయం: రూ.98,940.54 కోట్లు
ఉచిత విద్యుత్: రూ.3,621.99 కోట్లు
సహకార శాఖ: రూ. 197.40 కోట్లు
రైతులకు రుణాలు: రూ.59,918 కోట్లు
భారతీయ ఫార్మా రంగానికి అంతర్జాతీయంగా ఎనలేని గుర్తింపు తెచ్చిన ఔషధ రంగ దిగ్గజం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ అధినేత కల్లం అంజి రెడ్డి (72) కేన్సర్ వ్యాధితో మార్చి 15న హైదరాబాద్‌లో కన్నుమూశారు. అంజిరెడ్డి 1984లో హైదరాబాద్‌లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్‌ను ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ (2001), పద్మభూషణ్ (2011) అవార్డులతో సత్కరించింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో 1941, మే 27న అంజిరెడ్డి జన్మించారు.
ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ (అప్పా) పేరును రాజ బహదూర్ వెంకటరామిరెడ్డి రాష్ర్ట పోలీస్ అకాడమీ (ఆర్బీవీఆర్ రెడ్డి అప్పా)గా పేరు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 14న ఉత్తర్వులు జారీ చేసింది. వెంకటరామిరెడ్డి హైదరాబాద్ రాష్ట్ర పోలీసు కమిషనర్‌గా పని చేశారు.
తెలుగు భాష, సంస్కృతిని పరిరక్షిస్తూ, భావితరాలకు అందించేందుకుగాను ప్రపంచ తెలుగు మహాసభల్లో చేసిన తీర్మానాల మేరకు 2013ను ‘తెలుగు భాష, సాంస్కృతిక వికాస సంవత్సరం’గా అమలు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మార్చి 14న సాంస్కృతికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
2011-12 సంవత్సరానికి జాతీయ పర్యాటక పురస్కారాలను కేంద్ర పర్యాటక శాఖ మార్చి 12న ప్రకటించింది. మొత్తం 36 విభాగాల్లో 87 అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డులను మార్చి 18న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందజేశారు. అందులో మన రాష్ట్రానికి ఏడు పురస్కారాలు లభించాయి.
వివరాలు: సమగ్ర పర్యాటకరంగ అభివృద్ధి (రెస్ట్ ఆఫ్ ఇండియా విభాగంలో) - ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచింది; ఉత్తమ వారసత్వ నగరం - వరంగల్; ఉత్తమ విమానాశ్రయం (‘క్లాస్ టెన్ సిటీ’ విభాగంలో)- రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (హైదరాబాద్); ఉత్తమ విమానాశ్రయం (రెస్ట్ ఆఫ్ ఇండియా)-విశాఖపట్నం ఎయిర్‌పోర్టు;‘మెడికల్ టూరిజం ఫెసిలిటీ’ అవార్డు-అపోలో హెల్త్ సిటీ, హైదరాబాద్; ఉత్తమ స్టాండ్ అలోన్ కన్వెన్షన్ సెంటర్- హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్; బెస్ట్ సివిక్ మేనేజ్మెంట్ ఆఫ్ డెస్టినేషన్ కేటగిరీ ‘ఎ’ సిటీ - గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర సాహిత్య, సంగీత, లలితకళా అకాడమీలను పునరుద్ధరించింది. ఇందుకు సంబంధించి ఏప్రిల్ 10న ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగు భాష సంస్కృతి, నృత్యం, కళలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు తెలుగు, ఆంగ్ల భాషలను తప్పనిసరిగా చదివేలా ప్రభుత్వం ఏప్రిల్ 10న ఉత్తర్వులు జారీ చేసింది.
తూర్పు ఆసియా, పసిఫిక్, దక్షిణ ఆసియాల 25వ పర్యాటక సమావేశాలు హైదరాబాద్‌లో ఏప్రిల్ 11 నుంచి మూడు రోజులు జరిగాయి. 21 దేశాల నుంచి ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఐక్యరాజ్య సమితి వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (యూఎన్‌డబ్ల్యూటీవో) ఈ సమావేశాలు నిర్వహించింది. ఈ సందర్భంగా యూఎన్‌డబ్ల్యూటీవో సుస్థిర పర్యాటక అభివృద్ధి సమావేశం కూడా జరిగింది. తూర్పు, పసిఫిక్, దక్షిణాసియాల తదుపరి పర్యాటక సమావేశం ఫిలిప్పీన్స్‌లో, యూఎన్‌డబ్ల్యూటీవో సమావేశాన్ని 2015లో కాంబోడియాలో జరిపేందుకు నిర్ణయించారు.
ఆడపిల్లల చదువును ప్రోత్సహించడానికి ఉద్దేశించిన ‘బంగారు తల్లి’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి సంగారెడ్డిలో ఏప్రిల్ 28న ప్రారంభించారు. ఈ పథకం కింద ఒక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలకు జననం నమోదైనప్పటి నుంచి కాలేజీ చదువు వరకూ ఏటా ప్రోత్సాహకాలను అందిస్తారు. మధ్యలో బడి ఆపకుండా చదివే అమ్మాయికి కాలేజీ చదువుల వరకూ మొత్తం రూ. 55,500 ప్రభుత్వం అందిస్తుంది. అలాగే 18 ఏళ్ల వరకు వివాహం చేసుకోకుండా 12వ తరగతి పూర్తి చేసిన ఆడపిల్లలకు రూ. 50,000, డిగ్రీ పూర్తిచేస్తే మరో రూ. 50,000 బహుమతిగా ఇస్తారు. ఈ ప్రోత్సాహకాలు ఇప్పటివరకు ఆడపిల్లలకు కల్పిస్తున్న ప్రయోజనాలకు అదనంగా ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్ జనాభా లెక్కలు
రాష్ర్ట జనాభా 8,45,80,777.
2001 లెక్కలతో పోల్చితే రాష్ర్ట జనాభా 11శాతం పెరిగింది.
ప్రతి 1000 మంది పురుషులకు 992 మంది స్త్రీలు ఉన్నారు.
గ్రామీణ జనాభా 5,63,61,702. పట్టణ జనాభా 2,82,19,075.
అత్యధిక జనాభా ఉన్న జిల్లా-రంగారెడ్డి (27,41,239).
అత్యల్ప జనాభా ఉన్న జిల్లా- విజయనగరం (23,44,474).
స్త్రీ, పురుష నిష్పత్తి: 992/1000. ఆరేళ్లలోపు పిల్లల్లో లింగ నిష్పత్తి- 939/1000.
జన సాంద్రత: 307.
అక్షరాస్యత- 67.02 శాతం (మహిళలు 59.15 శాతం, పురుషులు-74.88 శాతం).
అక్షరాస్యతలో ప్రథమ స్థానం హైదరాబాద్ (75.87 శాతం). చివరి స్థానం మహబూబ్‌నగర్- 55.04 శాతం.
రాష్ర్టంలో ఎస్టీలు- 6.59 శాతం.రాష్ర్టంలో ఎస్సీలు- 16.41 శాతం.
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్ జిల్లా పేరును ‘అనంతపురం’గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 8న నిర్ణయించింది. దీనికి సంబంధించి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
దక్షిణాఫ్రికా ప్రభుత్వం అత్యున్నత జాతీయ పురస్కారం ‘నేషనల్ ఆర్థర్’ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏనుగు శ్రీనివాసులు రెడ్డికి లభించింది. మరో ఆరుగురు భారత సంతతి వ్యక్తులతో కలుపుకొని 38 మంది దేశ, విదేశీయులకు కూడా ఈ అవార్డును బహూకరించారు. ఈ సత్కారాన్ని దక్షిణాఫ్రికా స్వాతంత్య్ర దినోత్సవం ఏప్రిల్ 27న ఆ దేశ అధ్యక్షుడు జాకబ్ ప్రదానం చేశారు. దౌత్యవేత్త అయిన శ్రీనివాసులు రెడ్డి 1963 నుంచి జాతివివక్ష వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తొలిసారిగా ఏర్పాటు చేసిన స్థాయీ సంఘాలకు చైర్మన్లను స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఏప్రిల్ 24న ప్రకటించారు. మొత్తం 12 కమిటీలను ఏర్పాటు చేశారు. వీటికి చైర్మన్లుగా అధికార పార్టీ కాంగ్రెస్ నుంచి తొమ్మిది మందిని, ప్రతిపక్ష తెలుగుదేశం నుంచి ముగ్గురిని నియమించారు. రాష్ర్ట శాసనసభ, శాసనమండలిలోని మొత్తం సభ్యులు ఆయా సంఘాల్లో సభ్యులుగా ఉంటారు. ప్రతి సంఘంలో 31 మంది సభ్యులుగా ఉంటారు. బడ్జెట్లో శాఖల వారీగా జరిపిన కేటాయింపులపై స్థాయీ సంఘాలు సమగ్రంగా చర్చించి నివేదికలను రూపొందిస్తాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర భద్రతా కమిషన్‌ను మే 4న ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కమిషన్‌కు రాష్ట్ర హోంమంత్రి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. ప్రజా భద్రతా పర్యవేక్షణ, వ్యవస్థలో లోపాలను తొలగించడం వంటి విధులను ఈ కమిషన్ నిర్వర్తిస్తుంది. విధానపరమైన నిర్ణయాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలిస్తుంది. పోలీసుల ఉత్తమ పనితీరుకు, వ్యవస్థాపరమైన లక్ష్యాలకు సంబంధించి ముందస్తు చర్యలకు సలహాలివ్వడం, పోలీసుల వృత్తి పరమైన విధానాలకు సంబంధించి కూడా ఈ కమిటీ సూచనలిస్తుంది.
ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్లో భారీ ఓడరేవుల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ రెండు ఓడరేవుల నిర్మాణానికి రూ. 15,820 కోట్లు ఖర్చవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏడాదికి 5.40 కోట్ల టన్నుల నిర్వహణ సామర్థ్యంగల ఓడరేవును నిర్మిస్తారు. దీనికి రూ. 8 వేల కోట్ల మేర పెట్టుబడులు అవసరం. ఓడరేవు నిర్మాణానికి అనువైన ప్రాంతాలుగా విశాఖపట్నం జిల్లాలోని నక్కపల్లి, ప్రకాశం జిల్లాలోని రామయ్యపట్నం, నెల్లూరు జిల్లాలోని దుగరాజపట్నంను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది. అయితే, కేంద్రం దుగరాజపట్నంపై మొగ్గుచూపింది.
ప్రపంచంలో టాప్-100 ప్రతిభావంతులైన వైద్య నిపుణుల జాబితాలో రాష్ట్రానికి చెందిన ప్రముఖ దంత వైద్యుడు ఎంఎస్ గౌడ్‌కు చోటు లభించింది. భారత్ నుంచి జాబితాలో ఆయన ఒక్కరికే స్థానం దక్కింది. ఇంగ్లండ్‌లోని ‘కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ బయోగ్రఫికల్ సెంటర్’ ఏటా ఈ జాబితాను విడుదల చేస్తుంది. మెదక్ పట్టణానికి చెందిన ఎంఎస్ గౌడ్ దాదాపు 40 ఏళ్లుగా దంత వైద్య సేవలు అందిస్తున్నారు.
దేశంలో పర్యావరణ నిర్వహణ సూచీ (ఈపీఐ)- 2012లో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో నిలిచింది. నాణ్యమైన గాలి; నీరు, అటవీ సంరక్షణకు; చెత్త నిర్వహణకు అత్యుత్తమ పర్యావరణ అనుకూల విధానాలను అవలంబించినందుకుగాను ఆంధ్రప్రదేశ్‌కు ఈ గుర్తింపు లభించింది. జాబితాలో సిక్కిం రెండో స్థానంలో నిలవగా హిమాచల్‌ప్రదేశ్ మూడో స్థానాన్ని దక్కించుకుంది. హర్యానా (27), బీహార్ (30) స్థానంలో నిలిచాయి. చివరిస్థానం (35) లో లక్షద్వీప్ నిలిచింది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా (కె.జి. సేన్‌గుప్తా) నియమితులయ్యారు. ఆయన నియామకానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. మే 21న ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సేన్‌గుప్తాతో గవర్నర్ నరసింహన్ రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయించారు. జస్టిస్ సేన్‌గుప్తా ఉత్తరాఖండ్ హైకోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ సొసైటీ ఫర్ నాలెడ్జ్ నెట్వర్క్స్.. ‘గూగుల్ ఇండియా’తో ఓ అవగాహన ఒప్పందంపై మే 14న సంతకాలు చేసింది. ఈ ఒప్పందం కింద ఇంజనీరింగ్ విద్యార్థులకు, బోధకులకు గూగుల్ శిక్షణ ఇస్తుంది. ఈ ఒప్పందానికి సంబంధించిన పత్రాలను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, గూగుల్ సంస్థ ప్రతినిధి నెల్సన్ మట్టోస్ పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నారు. గూగుల్.. దేశంలో విద్యాపరమైన అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం ఇదే తొలిసారి. జవహర్ నాలెడ్జ్ సెంటర్ (జేకేసీ) కళాశాలలకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులకు మొబైల్, క్లౌడ్ కంప్యూటింగ్‌కు సంబంధించిన ఆధునిక టెక్నాలజీల్లో గూగుల్ శిక్షణ ఇస్తుంది. మెటీరియల్‌ను ఉచితంగా అందిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ మైనార్టీ కమిషన్ చైర్మన్‌గా హైదరాబాద్‌కు చెందిన అబిద్ రసూల్‌ఖాన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వైస్ చైర్మన్‌గా డాక్టర్ పెరుమాళ్లపల్లి నేతాజీ సుభాష్ చంద్రబోస్ (గుంటూరు) నియమితులయ్యారు. సభ్యులుగా సయ్యద్ మఖ్బూల్ హుస్సేన్ బాషా (వైఎస్సార్ జిల్లా), డాక్టర్ హసన్ ఖురాతులేన్ (హైదరాబాద్), ప్రభా ఎలిజబెత్ జోసెఫ్ (తూర్పుగోదావరి), సర్దార్ సర్జీత్సింగ్ (రంగారెడ్డి), గౌతమ్‌జైన్ (హైదరాబాద్)లను నియమించినట్లు మే 16న ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈ కమిషన్ మూడేళ్లపాటు పనిచేస్తుంది.
పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించి వివిధ కేటగిరీల రిజర్వేషన్ శాతాన్ని ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1న మార్గదర్శకాలు జారీ చేసింది. వీటికి అనుగుణంగా గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్‌లలో రిజర్వేషన్ స్థానాలను ఖరారు చేస్తారు. జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం గ్రామపంచాయతీలైతే ఎస్టీలకు 6.28 శాతం, ఎస్సీలకు 19.43 శాతం, బీసీలకు 34 శాతం స్థానాలను రిజర్వ్ చేస్తారు. మండల పరిషత్‌లైతే ఎస్టీలకు 6.99 శాతం, ఎస్సీలకు 19.32 శాతం, జిల్లా పరిషత్‌లైతే ఎస్టీలకు 9.15 శాతం, ఎస్సీలకు 18.88 శాతం రిజర్వేషన్లు ఉంటాయి. మిగిలిన స్థానాలు జనరల్ కేటగిరీకి ఉద్దేశించినవి. ఈ నాలుగు కేటగిరీల్లోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఉంటుంది.
శాంతి సమయంలో ధైర్యసాహసాలకిచ్చే రెండో అత్యున్నత అవార్డు అశోక్ చక్ర మరణానంతరం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ ఎన్.వి.ప్రసాద్ బాబుకు దక్కింది. 67వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 14న కేంద్రం ఈ అవార్డును ప్రకటించింది. మరో ముగ్గురికి కీర్తి చక్ర లభించింది. ఇవే కాకుండా 10 సౌర్య చక్ర అవార్డులతోపాటు మొత్తం 43 గ్యాలెంటరీ అవార్డులను రాష్ట్రపతి ప్రకటించారు.
హైదరాబాద్ చుట్టుపక్కల ఏర్పాటు చేసే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) కు కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 20న ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రధాని నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. మొత్తం 202 చదరపు కిలోమీటర్ల పరిధిలో, 50 వేల ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయ తలపెట్టిన ఐటీఐఆర్‌లో దాదాపు రూ. 2,19,440 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా.
ఇందులో ఐటీ, ఐటీ ఆధారిత సేవల (ఐటీఈఎస్) సంస్థల ఏర్పాటుకు రూ. 1.18 లక్షల కోట్లు, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ తయారీ సంస్థల ఏర్పాటుకు 1.01 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రధానంగా ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యంతో పెట్టుబడులు ఉంటాయి. ప్రత్యక్షంగా 15 లక్షల మందికి ఉద్యోగాలు, పరోక్షంగా 56 లక్షల మందికి ఐటీఐఆర్ ఉపాధి కల్పిస్తుందని అంచనా.
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్ర మండలి (ఏపీఈఆర్సీ) చైర్మన్‌గా 1981 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి వి. భాస్కర్ సెప్టెంబర్ 19న బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేస్తూ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.
హైదరాబాద్‌లో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డికి మాస్టర్ ఆఫ్ వరల్డ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ అవార్డు లభించింది. చైనాలోని షాంఘైలో సెప్టెంబర్ 23న జరిగిన ప్రపంచ గ్యాస్ట్రో ఎంటరాలజీ సదస్సులో ఆ సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ హెన్రీ కోహెన్ బహూకరించారు. ఈ అంతర్జాతీయ అవార్డును ప్రతి నాలుగేళ్లకొకసారి ప్రదానం చేస్తారు. ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయుడు నాగేశ్వర్‌రెడ్డి.
ప్రముఖ తెలుగు సాహితీవేత్త, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ రావూరి భరద్వాజ (87) అక్టోబర్ 18న హైదరాబాద్‌లో మరణించారు. కృష్ణా జిల్లా నందిగామ తాలూకా మోగులూరులో 1927 జూలై 5న జన్మించిన భరద్వాజ 17వ ఏట నుంచి రచనలు చేయడం మొదలుపెట్టారు. అచ్చు అయిన తొలి కథ విమల. దాదాపు 43 పిల్లల కథలు, 17 నవలలు, 11 సాహిత్య గ్రంథాలు, 33 సైన్స్ కథలను రాశారు. 2012 సంవత్సరానికి ఆయన రాసిన నవల పాకుడురాళ్లుకు జ్ఞానపీఠ్ అవార్డు దక్కింది.
తొమ్మిదో ప్రపంచ వ్యవసాయ సదస్సు- 2013 హైదరాబాద్‌లో జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి నవంబర్ 4న దీన్ని ప్రారంభించారు. వరల్డ్ అగ్రికల్చర్ ఫోరం (డబ్ల్యూఏఎఫ్) రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మూడు రోజులపాటు సదస్సును నిర్వహించింది. సుస్థిర భవిష్యత్తు కోసం వ్యవసాయాన్ని తీర్చిదిద్దడం, సన్నకారు రైతులపై దృష్టి అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరిగింది. దేశ, విదేశాల నుంచి 400 మంది ప్రతినిధులు, శాస్త్రవేత్తలు హాజరయ్యారు.
2050 నాటికి 1000 కోట్ల జనాభాకు ఆహారం అందించడం పెద్ద సవాలుగా ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. వ్యవసాయేతర ఆదాయాలవైపునకు మళ్లుతున్నవారిని అడ్డుకునేందుకు వ్యవసాయ, వ్యవసాయేతర ఆదాయం మధ్య పెరుగుతున్న అంతరాన్ని పూరించాలని డబ్ల్యూఏఎఫ్ చైర్మన్ బోల్గర్ అన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జైలు నుంచి విడుదలైన క్షణం నుంచి జనంతో మమేకమయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో పోరు బాట పట్టారు. మూడో అధికరణాన్ని కేంద్రం దుర్వినియోగం చేస్తున్నందున దాన్ని సవరించాలనే డిమాండ్‌తో జాతి యావత్తు దృష్టినీ ఆకర్షించారు. ఈ క్రమంలో వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలను కలిశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు హైడెఫినిషన్ వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కల్పించింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్ (ఏపీస్వాన్) ద్వారా అనుసంధానం చేసే ఈ సౌకర్యాన్ని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి డిసెంబర్ 9న హైదరాబాద్‌లో ప్రారంభించారు. దీంతో ఇటువంటి సౌకర్యం గల మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఈ వ్యవస్థ రాష్ట్ర రాజధానిని 23 జిల్లాలు, 1126 మండల కార్యాలయాలతో అనుసంధానం చేస్తుంది.
చిత్తూరు జిల్లా శ్రీ సిటీలో రూ. 1200 కోట్లతో పెప్సికో సంస్థ ఏర్పాటుచేసే శీతల పానీయాల పరిశ్రమకు ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి డిసెంబర్ 21న హైదరాబాద్‌లో శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం సంతరించుకుంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా 8000 మందికి ఉపాధి లభిస్తుంది.
శ్రీకాకుళంలో కాట్రగడ్డ వద్ద వంశధార నది నీటిని వాడుకొనేందుకు మళ్లింపు కాలువ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్‌కు వంశధార ట్రిబ్యునల్ అనుమతినిచ్చింది. ఈ అడ్డుగోడ (సైడ్ వీయర్) నిర్మాణాన్ని అడ్డుకుంటూ ఒడిశా చేసిన అభ్యంతరాలను తోసిపుచ్చుతూ వంశధార జల వివాదాల ట్రిబ్యునల్ డిసెంబర్ 17న తీర్పునిచ్చింది. ఈ తీర్పు వల్ల 50 వేల ఎకరాలకు నీటి సౌకర్యం కల్పించేందుకు వీలవుతుంది.