ఆ ఎస్కేప్ కోసం 17 సూసైడ్ కారు బాంబులు!
లండన్: ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ అధినేత, స్వయం ప్రకటిత ఖలిఫా అబూ బకర్ అల్ బగ్గాదీని రెండు నెలల కిందటే మోసుల్ పట్టణం నుంచి తప్పించారని కుర్దీష్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మోసుల్ నుంచి పశ్చిమ దిశ మార్గంలో బగ్దాదీని తప్పించేందుకు ఐఎస్ఐఎస్ భారీ ఆపరేషన్ చేపట్టిందని, ఇందుకోసం 17 సూసైడ్ కారు బాంబులను వినియోగించడమే కాక, సిరియా నుంచి దాదాపు 300 మంది ఫైటర్లను స్టేట్ రప్పించిందని, ఈ సందర్భంగా హోరాహోరీ పోరు జరిగిందని కుర్దీష్ ప్రెసిడెంట్ మసౌద్ బర్జానీ చీఫ్ స్టాప్ ఫౌద్ హుస్సేన్ 'ద ఇండింపెండెంట్' పత్రికకు తెలిపారు. బగ్దాదీని సురక్షితంగా తప్పించేందుకే ఇంతటి భారీ ఆపరేషన్ను ఐఎస్ఐఎస్ చేపట్టిందని తాము భావిస్తున్నామని, ఈ ఆపరేషన్లో ఆ గ్రూప్ భారీగా దెబ్బతిన్నదని ఆయన చెప్పారు.
ఫిబ్రవరి 19న ఐఎస్ఐఎస్ అధీనంలో ఉన్న మోసుల్ పట్టణాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకునేందుకు ఇరాకీ సేనలు తుది దాడిని ప్రారంభించిన సంగతి తెలిసిందే. కీలకమైన మోసుల్ పట్టణాన్ని ఇరాకీ సేనలు దాదాపుగా తమ అధీనంలోకి తెచ్చుకున్నా.. ఇంకా నాలుగు లక్షలమంది జనాభా కలిగిన మోసుల్ పాత పట్టణం ఐఎస్ఐఎస్ గుప్పిట్లోనే ఉంది. అయితే, ఇరాకీ సేనల తుది దాడి ప్రారంభం కావడంతోనే ఇస్లామిక్ స్టేట్ తన అధినేతను సురక్షితంగా తప్పించే ఆపరేషన్ను చేపట్టిందని, మోసుల్కు పశ్చిమంగా ఉన్న ప్రాంతం హష్ద్ అల్ షాబి షియా మిలిషియా అధీనంలో ఉందని, ఈ ప్రాంతం నుంచి బగ్దాదీని తప్పిస్తే.. తక్కువ ప్రతిఘటన ఉంటుందని, ఈ మార్గాన్ని అది ఎంచుకున్నదని ఆయన చెప్పారు. మోసుల్ పట్టణం చేజారిన తర్వాత ఐఎస్ఐఎస్ ప్రాబల్యం గణనీయంగా తగ్గిపోయే అవకాశముందని వివరించారు.