ఇప్పుడే ఒక అతి పెద్ద ఘటన జరిగింది: ట్రంప్
వాషింగ్టన్ : ఇస్లామిక్ స్టేట్స్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా పేరుతో ప్రపంచాన్ని వణికించిన ఐసిస్ ఉగ్రవాద సంస్థ అధినేత అబుబాకర్ ఆల్ బాగ్దాదిని అమెరికా సైనిక బలగాలు హతమార్చినట్లు సమాచారం. ఈ మేరకు అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ అధికారి ఒకరు ఓ ప్రకటన విడుదల చేశారు. సిరియాలోని ఐసిస్ స్థావరాలపై అమెరికా బలగాలు జరిపిన దాడుల్లో బాగ్దాది హతమైనట్టు తెలుస్తోంది. దీనికి సంకేతమే అన్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం ఉదయం ఒక ట్వీట్ చేశారు.
ఇప్పుడే ఓ భారీ సంఘటన చోటుచేసుకుంది (సమ్‌థింగ్ వెరీ బిగ్ హ్యాస్ జస్ట్ హ్యాపెన్డ్) అంటూ ట్విటర్ ద్వారా వెల్లడించారు. అబూబకర్‌ను మట్టుపెట్టడానికి పెద్ద ఎత్తున వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వ్యవహారాలను డొనాల్డ్ట్రంప్ వారం రోజుల క్రితమే ఆమోదం తెలిపినట్టు సమాచారం. దీనిపై ట్రంప్ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేయనున్నారు. గతంలో కూడా ఆల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ అధినేత ఒసామా బిన్‌లాడెన్‌ను హతమార్చిన తరహాలోనే సీక్రెట్ ఆపరేషన్ ద్వారా అమెరికా సైనిక బలగాలు బాగ్దాదిని హతమార్చినట్లు తెలుస్తోంది. 2011లో ఇదే విధంగా అమెరికా సైనిక బలగాలు దాడులు చేసి లాడెన్‌ను హతమార్చిన విషయం తెలిసిందే..!
Something very big has just happened!
— Donald J. Trump (@realDonaldTrump) October 27, 2019