alahabad Bank
-
డాక్టర్ టు ఫ్రాడ్‌స్టర్!
సాక్షి, సిటీబ్యూరో: అమీర్‌పేటలోని అలహాబాద్ బ్యాంక్ నుంచి రూ.1.95 కోట్ల రుణం తీసుకుని మోసం చేసిన కేసులో నిందితులుగా ఉన్న డాక్టర్ విక్రమ్ పిల్లారిశెట్టి, జంగిరాల భరత్‌లను నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసుల రెండు రోజల పాటు తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు. గురువారం గడువు ముగియడంతో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. వీరి విచారణ నేపథ్యంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుల్లో ఒకరైన డాక్టర్ విక్రమ్ హోమిహోపతి డాక్టర్. విదేశాల్లో పీజీ చేసి వచ్చిన ఇతగాడు నగరంలో ‘మాడ్వెక్’ పేరుతో ఫార్మాస్యుటికల్ కంపెనీ ఏర్పాటు చేశాడు. దీనికోసం తీసుకున్న రుణం చెల్లించలేకపోవడంతో అడ్డదారులు వెతికాడు. తప్పుడు పత్రాలతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి దాదాపు రూ.6 కోట్లు రుణం తీసుకున్నాడు. దీని చెల్లింపులో విఫలం కావడంతో చెన్నై సీబీఐ అధికారులు 2017లో కేసు నమోదు చేసి విక్రమ్‌తో పాటు ఇతడికి సహకరించిన భరత్‌ను అరెస్టు చేశారు. వీరికి బ్యాంకులు రుణాలు మంజూరు చేసే విధివిధానాలపై పట్టు ఉండటంతో జైలు నుంచి బయటకు వచ్చిన ఇరువురూ అదే దందా ప్రారంభించారు. వీరిద్దరూ తమ బంధువులు, స్నేహితుల పేర్లతో అనేక చిన్న తరహా సంస్థల్ని ఏర్పాటు చేయించారు. వీటిని చిన్న తరహా పరిశ్రమలుగా జిల్లా పరిశ్రమల కేంద్రంలో రిజిస్టర్ చేయించారు. అలాంటి వాటిలో సురేష్‌కుమార్‌కు చెందిన ముషీరాబాద్ కేంద్రంగా నడుస్తున్నట్లు చూపించిన ఆమ్స్టర్ సొల్యూషన్స్ ఒకటి. కూరగాయలు, పండ్లకు సంబంధించి డ్రై పౌడర్ తయారు చేసే సంస్థగా దీనిని రిజిస్టర్ చేశారు. ఉప్పల్‌లోని ఓ ఇంటి విలువను ఎక్కువగా చూపించిన వీరు దాన్ని కొలట్రల్ సెక్యూరిటీగా చూపుతూ అమీర్‌పేట మారుతీనగర్‌లోని అలహాబాద్ బ్యాంక్ నుంచి 2016లో రూ.1.95 కోట్ల రుణం తీసుకున్నారు. ఈ మొత్తాన్ని సోమేశ్వర ఎంటర్ప్రైజెస్, ధనియ వర్చువల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లతో పాటు మరో నాలుగు డమ్మీ సంస్థల పేర్లతో ఉన్న కరెంట్ ఖాతాల్లోకి మార్చి స్వాహా చేశారు. రుణం చెల్లింపులో విఫలం కావడంతో అలహాబాద్ బ్యాంక్ 2018లో ఉప్పల్‌లోని ఇంటికి వేలం వేసింది. ఈ నేపథ్యంలో కేవలం రూ.80 లక్షలు మాత్రమే వచ్చాయి. వ్యాపార విస్తరణ కోసమంటూ రుణం తీసుకుని దారి మళ్లించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అలహాబాద్ బ్యాంక్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా నమోదైన కేసును వైట్ కాలర్ అఫెన్సెస్ టీమ్–4 ఇన్స్పెక్టర్ కేవీ సూర్యప్రకాష్‌రావు దర్యాప్తు చేశారు. బాధ్యులుగా ఉన్న డాక్టర్ విక్రమ్‌తో పాటు భరత్‌కుమార్‌ను గత శుక్రవారం అరెస్టు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం రెండు రోజుల కస్టడీకి అనుమతించడంతో బుధవారం అదుపులోకి తీసుకున్నారు. విచారణ గడువు ముగియడంతో గురువారం జైలుకు తరలించారు. -
‘బ్యాంకుల విలీనంతో ఉద్యోగాలలో కోత’
సాక్షి, విజయవాడ: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న బ్యాంకుల విలీన నిర్ణయం ప్రభుత్వ రంగ బ్యాంకులను నిర్వీర్యం చేసేలా ఉందని అలహాబాద్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. బ్యాంకుల విలీన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడలో అసోసియేషన్ నిరసన ర్యాలీ చేపట్టింది. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ బ్యాంకుల విలీనం వల్ల బ్యాంకు ఉద్యోగాలు కోతకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బ్యాంక్ ఖాతాదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొన్నారు. కార్పొరేట్ శక్తులకు కొమ్మకాసేలా ఈ నిర్ణయం ఉందని విమర్శించారు. బ్యాంకుల విలీన విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, విలీన నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చదవండి : ‘ఆంధ్రా బ్యాంకు విలీనాన్ని అందరూ వ్యతిరేకించాలి’ -
పీఎన్బీ, అలాహాబాద్ బ్యాంకు రెపో రేటు రుణాలు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగలోని పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ), అలహాబాద్ బ్యాంకులు తమ రిటైల్ రుణాలను ఆర్బీఐ రెపో రేటుకు అనుసంధానిస్తున్నట్టు ప్రకటించాయి. దీంతో రుణాల రేట్లు దిగిరానున్నాయి. రెపో రేటుతో అనుసంధానించిన ‘పీఎన్బీ అడ్వాంటేజ్’ పథకాన్ని పీఎన్బీ ప్రారంభించింది. ‘‘ప్రస్తుతమున్న ఎంసీఎల్ఆర్తో పోలిస్తే రెపో ఆధారిత విధానంలో 0.25 శాతం తక్కువగా వడ్డీ రేటు ఉంటుంది. ఇంటి రుణాలు తీసుకునే వారికి నూతన రేట్లు 8.25 శాతం నుంచి 8.35 శాతం వరకు.. కార్ల కోసం తీసుకునే రుణాలపై 8.65 శాతం వరకు వడ్డీ రేటు ఉంటుంది’’ అని పీఎన్బీ తెలిపింది. అంతేకాదు, ఎంసీఎల్ఆర్ కింద ఇప్పటికే రుణాలు తీసుకున్న వారు రెపో ఆధారిత లెండింగ్ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్)కు మారిపోయే అవకాశం కూడా ఇస్తున్నట్టు పేర్కొంది. ఇక రూ.75 లక్షల వరకు రుణాలకు ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ అనుసంధానిత రేటు (ఈబీఎల్ఆర్) ఆధారంగా రుణాలను మంజూరు చేయనున్నట్టు అలహాబాద్ బ్యాంకు ప్రకటించింది. -
పీఎన్బీ సహా నాలుగు బ్యాంకులకు జరిమానా
ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ), యూకో బ్యాంక్, అలహాబాద్ బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకులకు ఆర్బీఐ రూ.1.75 కోట్ల జరిమానాలు విధించింది. కేవైసీ అవసరాలు, కరెంటు ఖాతాల ప్రారంభానికి సంబంధించి నిబంధనలు పాటించకపోవడమే కారణం. పీఎన్బీ, అలహాబాద్ బ్యాంకు, యూకో బ్యాంకులకు ఒక్కో దానికి రూ.50 లక్షల చొప్పున, కార్పొరేషన్ బ్యాంకుపై రూ.25 లక్షల జరిమానా విధించినట్టు ఆర్బీఐ తెలిపింది. -
ఐదు బ్యాంకులపై రూ. 10 కోట్ల జరిమానా
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రెగ్యులేటర్– ఆర్బీఐ ఐదు బ్యాంకులపై రూ.10 కోట్ల జరిమానా విధించింది. అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ బ్యాంక్, యస్ బ్యాంక్, కెనరా బ్యాంక్‌లు ఇందులో ఉన్నాయి. నోస్ట్రో ఖాతాలకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించడంవల్ల ఆర్బీఐ అలహాబాద్ బ్యాంక్‌పై జరిమానా విధించింది. ఒక బ్యాంక్ వేరే బ్యాంక్‌లో విదేశీ కరెన్సీలో నిర్వహించే ఖాతాను నోస్ట్రో ఖాతాగా వ్యవహరిస్తారు. అంతర్జాతీయ మెసేజింగ్ సాఫ్ట్వేర్..స్విఫ్ట్‌కు సంబంధించిన నిబంధనల ఉల్లంఘనలకుగాను ఈ రెండు బ్యాంక్‌లపై ఆర్బీఐ చెరో కోటి రూపాయలు జరిమానా విధించింది. -
ఏడు బ్యాంకులకు ఆర్బీఐ ఝలక్
సాక్షి,ముంబై: బ్యాంకింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ప్రభుత్వ, ప్రవేటు రంగాలకు చెందిన ఏడు బ్యాంకులపై రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జరిమానా విధించింది. నో యువర్ కస్టమర్ (కెవైసి) నిబంధనలు, యాంటీ మనీ లాండరింగ్ (ఏఎంఎల్) ప్రమాణాలపై ఆర్బీఐ జారీ చేసిన పలు సూచనలను పాటించనందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ముఖ్యంగా అలహాబాదు బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ మహారాష్ట్రకు 1.5 కోట్ల రూపాయల జరిమానా విధంచగా, ఆంధ్రాబ్యాంకునకు కోటి రూపాయల పెనాల్టీ వడ్డించింది. వీటితో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ మహింద్ర బ్యాంక్, ఐడిబిఐ బ్యాంకులకు రూ. 20 లక్షలు చొప్పున జరిమానా విధించింది. ఈ చర్య కేవలం క్రమబద్ధీకరణను పాటించడంలో జరిగిన లోపాలపై తీసుకున్నట్టు ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఖాతాదారులతో బ్యాంకుల ఎలాంటి లావాదేవీని, లేదా ఒప్పందాల విశ్వసనీయతను దెబ్బతీసేందుకు ఉద్దేశించినది కాదని తెలిపింది. నిధుల అంతిమ వినియోగంపై పర్యవేక్షణ, ఇతర బ్యాంకులతో సమాచార వినిమయం, మోసాల వర్గీకరణ, వివరణ, ఖాతాల పునర్నిర్మాణంపై ఆర్బీఐ నిబంధనలను పాటించని కారణంగా ఈ చర్య తీసుకున్నామని ఆర్బీఐ స్పష్టం చేసింది. -
ప్రభుత్వ బ్యాంకులకు మొండి బకాయిల భారం
♦ రూ. 51 కోట్లకు తగ్గిన పీఎన్బీ లాభం ♦ దేనా, ఆలహాబాద్ బ్యాంక్‌లకు భారీ నష్టం న్యూఢిల్లీ/ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకులకు మొండి బకాయిలు గుదిబండలా మారుతున్నాయి. మొండి బకాయిల కేటాయింపుల కారణంగా ఈ బ్యాంకుల నికర లాభాల్లో భారీగా కోత పడుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలానికి సంబంధించి మంగళవారం ఆర్థిక ఫలితాలు ప్రకటించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్, దేనా బ్యాంక్, అలహాబాద్ బ్యాంకుల నికర లాభాలపై మొండి బకాయిలు విశ్వరూపం చూపించాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నికర లాభం 93 శాతం క్షీణించగా, దేనా బ్యాంక్‌కు రూ.663 కోట్లు, అలహాబాద్ బ్యాంక్‌కు రూ.486 కోట్ల చొప్పున నికర నష్టాలు వచ్చాయి. వివరాలు... దేనాబ్యాంక్కు 663 కోట్ల నష్టం దేనా బ్యాంక్‌కు డిసెంబర్ క్వార్టర్లో రూ.663 కోట్ల నష్టం వచ్చింది. మొండి బకాయిలు భారీగా పెరగడమే దీనికి ప్రధాన కారణమని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు రూ.77 కోట్ల నికర లాభం ఆర్జించామని వివరించింది. గత క్యూ3లో రూ.2,867కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో రూ.2,722 కోట్లకు తగ్గిందని పేర్కొంది. స్థూల మొండి బకాయిలు 5.61 శాతం నుంచి9.85 శాతానికి పెరిగినట్లు బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. 93% తగ్గిన పీఎన్బీ నికర లాభం పంజాబ్ నేషనల్ బ్యాంక్ నికర లాభంపై మొండి బకాయిలకు కేటాయింపులు తీవ్రమైన ప్రభావం చూపాయి. గత క్యూ3లో రూ.775 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో 93 శాతం క్షీణించి రూ.51 కోట్లకు పడిపోయిందని పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.12,905 కోట్లనుంచి 8 శాతం వృద్ధితో రూ.13,891 కోట్లకు పెరిగిందని పంజాబ్ నేషనల్ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉషా అనంతసుబ్రహ్మణ్యన్ చెప్పారు ఈ క్యూ3లో నికర వడ్డీ ఆదాయం రూ.4,120 కోట్లు, వడ్డీయేతర ఆదాయం రూ.1,671 కోట్లు చొప్పున ఆర్జించామని చెప్పారు. పరిశ్రమ తీవ్రమైన కష్టాల్లో ఉందని, రుణాలు అధికంగా ఇచ్చే బ్యాంకుల్లో ఒకటైనందున తమ బ్యాంక్‌పై తీవ్రమైన ప్రభావం పడిందని. క్యూ3 ఫలితాల వెల్లడి సందర్భంగా ఉషా మాట్లాడారు. అలహాబాద్ బ్యాంక్... అధిక కేటాయింపుల ఫలితం అలహాబాద్ బ్యాంక్‌కు 3వ త్రైమాసికలో రూ.486 కోట్ల నికర నష్టం వచ్చింది. మొండి బకాయిలకు భారీ కేటాయింపుల కారణంగా ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని బ్యాంక్ తెలిపింది. గత క్యూ3లో రూ.164 కోట్ల నికర లాభం వచ్చిందని పేర్కొంది. గత క్యూ3లో రూ.5,387 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో రూ.5,030కు తగ్గిందని తెలిపింది. స్థూల మొండి బకాయిలు 5.46 శాతం నుంచి 6.40 శాతానికి ఎగశాయి.