డాక్టర్‌ టు ఫ్రాడ్‌స్టర్‌! | Allahabad Bank Accused Arrested And Produced in Court | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ టు ఫ్రాడ్‌స్టర్‌!

Published Fri, Jan 10 2020 10:02 AM | Last Updated on Fri, Jan 10 2020 10:02 AM

Allahabad Bank Accused Arrested And Produced in Court - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: అమీర్‌పేటలోని అలహాబాద్‌ బ్యాంక్‌ నుంచి రూ.1.95 కోట్ల రుణం తీసుకుని మోసం చేసిన కేసులో నిందితులుగా ఉన్న డాక్టర్‌ విక్రమ్‌ పిల్లారిశెట్టి, జంగిరాల భరత్‌లను నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) పోలీసుల రెండు రోజల పాటు తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు. గురువారం గడువు ముగియడంతో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. వీరి విచారణ నేపథ్యంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.  నిందితుల్లో ఒకరైన డాక్టర్‌ విక్రమ్‌ హోమిహోపతి డాక్టర్‌. విదేశాల్లో పీజీ చేసి వచ్చిన ఇతగాడు నగరంలో ‘మాడ్వెక్‌’ పేరుతో ఫార్మాస్యుటికల్‌ కంపెనీ ఏర్పాటు చేశాడు. దీనికోసం తీసుకున్న రుణం చెల్లించలేకపోవడంతో అడ్డదారులు వెతికాడు. తప్పుడు పత్రాలతో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి దాదాపు రూ.6 కోట్లు రుణం తీసుకున్నాడు. దీని చెల్లింపులో విఫలం కావడంతో చెన్నై సీబీఐ అధికారులు 2017లో కేసు నమోదు చేసి విక్రమ్‌తో పాటు ఇతడికి సహకరించిన భరత్‌ను అరెస్టు చేశారు. వీరికి బ్యాంకులు రుణాలు మంజూరు చేసే విధివిధానాలపై పట్టు ఉండటంతో జైలు నుంచి బయటకు వచ్చిన ఇరువురూ అదే దందా ప్రారంభించారు.

వీరిద్దరూ తమ బంధువులు, స్నేహితుల పేర్లతో అనేక చిన్న తరహా సంస్థల్ని ఏర్పాటు చేయించారు. వీటిని చిన్న తరహా పరిశ్రమలుగా జిల్లా పరిశ్రమల కేంద్రంలో రిజిస్టర్‌ చేయించారు. అలాంటి వాటిలో సురేష్‌కుమార్‌కు చెందిన ముషీరాబాద్‌ కేంద్రంగా నడుస్తున్నట్లు చూపించిన ఆమ్‌స్టర్‌ సొల్యూషన్స్‌ ఒకటి. కూరగాయలు, పండ్లకు సంబంధించి డ్రై పౌడర్‌ తయారు చేసే సంస్థగా దీనిని రిజిస్టర్‌ చేశారు. ఉప్పల్‌లోని ఓ ఇంటి విలువను ఎక్కువగా చూపించిన వీరు దాన్ని కొలట్రల్‌ సెక్యూరిటీగా చూపుతూ అమీర్‌పేట మారుతీనగర్‌లోని అలహాబాద్‌ బ్యాంక్‌ నుంచి 2016లో రూ.1.95 కోట్ల రుణం తీసుకున్నారు. ఈ మొత్తాన్ని సోమేశ్వర ఎంటర్‌ప్రైజెస్, ధనియ వర్చువల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లతో పాటు మరో నాలుగు డమ్మీ సంస్థల పేర్లతో ఉన్న కరెంట్‌ ఖాతాల్లోకి మార్చి స్వాహా చేశారు. రుణం చెల్లింపులో విఫలం కావడంతో అలహాబాద్‌ బ్యాంక్‌ 2018లో ఉప్పల్‌లోని ఇంటికి వేలం వేసింది. ఈ నేపథ్యంలో కేవలం రూ.80 లక్షలు మాత్రమే వచ్చాయి. వ్యాపార విస్తరణ కోసమంటూ రుణం తీసుకుని దారి మళ్లించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అలహాబాద్‌ బ్యాంక్‌ సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా నమోదైన కేసును వైట్‌ కాలర్‌ అఫెన్సెస్‌ టీమ్‌–4 ఇన్‌స్పెక్టర్‌ కేవీ సూర్యప్రకాష్‌రావు దర్యాప్తు చేశారు. బాధ్యులుగా ఉన్న డాక్టర్‌ విక్రమ్‌తో పాటు భరత్‌కుమార్‌ను గత శుక్రవారం అరెస్టు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం రెండు రోజుల కస్టడీకి అనుమతించడంతో బుధవారం అదుపులోకి తీసుకున్నారు. విచారణ గడువు ముగియడంతో గురువారం జైలుకు తరలించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement