హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ లో మార్పులు తేండి: సిలికాన్ వ్యాలీ
వాషింగ్టన్: హెచ్-1బీ వీసాలను పెద్ద మొత్తంలో జారీ చేయడం వల్ల అమెరికా అభివృద్ధి సాధ్యమవుతుందని, ఈ మేరకు వీసాల జారీలో మార్పులు తీసుకురావాలని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ ను సిలికాన్ వ్యాలీ కోరింది. ఈ మేరకు అమెరికన్ సీఈవోల మేగజిన్ సీ-సూట్ లో లారెల్ స్ట్రాటజీస్ వ్యవస్ధాపక సీఈవో అలన్ హెచ్ ఫ్లీచ్ మన్ ఓ కథనం రాశారు.
హెచ్-1బీ వీసాలను పెద్ద మొత్తంలో జారీ చేయడం ద్వారా నైపుణ్యం కలిగిన విదేశీయులకు అమెరికన్ కంపెనీల్లో పనిచేసే అవకాశం ఇవ్వాలని కోరారు. దీని వల్ల అమెరికా కంపెనీలు తొందరగా ఎదగడంతో పాటు పెద్ద కంపెనీలతో పోటీపడతాయని చెప్పారు. హెచ్-1బీ వీసాల జారీలో మార్పులు తీసుకురావడం వల్ల అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుందని పేర్కొన్నారు. అమెరికన్ కంపెనీల్లో ప్రత్యేక ఉద్యోగాలకు మాత్రమే విదేశీయులను రిక్రూట్ చేసుకోవాలనేది హెచ్-1బీ వీసా జారీలో నియమమని చెప్పారు.
హెచ్-1బీలో భారీ మార్పుల వల్ల అమెరికన్లు చేయలేని కొన్ని రకాల ఉద్యోగాలకు విదేశీయులను ఎంపిక చేసుకునే అవకాశం ఏర్పడుతుందని రాశారు. వీసా ప్రోగ్రామ్ లో మార్పులు చేయడం వల్ల అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలు, వేతనాలు పెరుగుతాయనే ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు. యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్-2012 రిపోర్టు ప్రకారం.. అమెరికన్ కంపెనీలు రిక్రూట్ చేసుకున్న విదేశీయుల వల్ల పెద్ద మొత్తంలో అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలు వచ్చినట్లు చెప్పారు.
హెచ్-1బీ వీసా కలిగిన ఒక్క ఉద్యోగి 2.62 మిలియన్ల అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించాడని పేర్కొన్నారు. 2011లో మెక్కిన్సే విడుదల చేసిన ఓ రిపోర్టులో అమెరికన్ కంపెనీల్లో విదేశీ ఉద్యోగుల కొరత ఏర్పడుతున్నట్లు చెప్పింది. ప్రస్తుతం ఉన్న హెచ్-1బీ వీసా కోటా 30 ఏళ్ల క్రితం సరిపోయేదని అలన్ చెప్పుకొచ్చారు. నైపుణ్యం కలిగిన విదేశీ వర్కర్ల కొరత అమెరికన్ కంపెనీలను బాధిస్తోందని పేర్కొన్నారు. అమెరికా టెక్నాలజీ సెక్టారు అభివృద్ధికి హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ లో మార్పులు తీసుకువచ్చేందుకు రిపబ్లికన్ల మద్దతు ఇవ్వాలని కోరారు.