పెరూ మాజీ అధ్యక్షుడు ఫుజిమొరి కన్నుమూత
లిమా (పెరూ): పెరూ మాజీ అధ్యక్షుడు అల్బెర్టో ఫుజిమొరి బుధవారం రాజధాని లిమాలో కన్నుమూశారు. దీర్ఘ కాలంగా క్యాన్సర్‌తో పోరాడి మరణించారని ఆయన కుమార్తె కీకో ఫుజిమొరి ‘ఎక్స్’లో ప్రకటించారు. విద్యావేత్త నుంచి పెరూ రాజకీయాల్లోకి మెరుపులా వచ్చిన ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాయి. అవే సంస్కరణలు ఆయన్ను చిక్కుల్లోకీ నెట్టాయి. వామపక్షాల సహకారంతో అధికారంలోకి వచ్చి తిరుగుబాటుదారులపై తీవ్రమైన అణచివేతను అమలు చేశారు. చివరకు దేశం నుంచి పారిపోయి, ఆ తరువాత జైలు పాలై.. తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు. పరిస్థితి విషమించడంతో 86 ఏళ్ల వయసులో మృతి చెందారు. 2026 ఎన్నికల్లో అధ్యక్ష పదవికి మళ్లీ పోటీ చేయాలని తన తండ్రి భావిస్తున్నారంటూ కొన్ని నెలల క్రితం కీకో ప్రకటించడం గమనార్హం.ఆర్థిక వ్యవస్థ బలోపేతం.. పెరూ స్వాతంత్య్ర దినం 1938 జూలై 28వ తేదీన రాజధాని లిమాలో ఫుజిమొరి జని్మంచారు. ఈయన కు టుంబం జపాన్ నుంచి వలస వచ్చింది. గణిత శాస్త్రవేత్త, వ్యవసాయ ఇంజనీర్ అయిన ఫుజిమొరి 1990 ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఆయనెవరికీ తెలియదు. తన ప్రచార ర్యాలీల్లో ట్రాక్టర్ నడుపుతూ అందరినీ ఆకట్టుకున్నారు. వామపక్షాల భారీ మద్దతుతో ప్రఖ్యాత రచయిత మారియో వర్గాస్ లోసాను ఓడించి అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. ద్రవ్యోల్బణం తగ్గిస్తానన్న హామీతో అధికారంలోకి వచి్చన ఫుజిమొరి రెండో వారంలోనే నిత్యావసరాలపై సబ్సిడీలను ఎత్తివేయడం ‘ఫుజీ–షాక్’గా పేరుగాంచింది. డజన్ల కొద్దీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించారు. వాణిజ్య సుంకాలను తగ్గించారు. ఆయన చేపట్టిన ఆర్థిక సంస్కరణలు పెరూ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయి. లాటిన్ అమెరికాలో అత్యంత స్థిరమైన ఆర్థిక వ్యవస్థగా మారడానికి పునాదులు వేశాయి. ఇక స్వేచ్ఛా–మార్కెట్ సంస్కరణలు, కఠినమైన ఉగ్రవాద వ్యతిరేక చట్టాల అమలు కోసం రాజ్యాంగాన్ని పునర్నిరి్మంచారు. వ్యతిరేకత.. అణచివేత.. కేసులు.. 1992లో పార్లమెంట్‌పైకి యుద్ధ ట్యాంకులను ఉపయోగించడంతో పెరూ ప్రజల్లో ఆయనపై వ్యతిరేకత పెరిగింది. పదేళ్ల పాలనలో అవినీతి కుంభకోణాలు కూడా ప్రజలను ఆయనకు వ్యతిరేకంగా మార్చాయి. అయినా రెండోసారి అధికారంలోకి వచ్చాక తిరుగుబాటుదారులపై తీవ్రమైన అణచివేత, నిర్బంధం అమలు చేశారు. 2000లో మూడోసారి గెలిచిన తరువాత ఫుజిమొరి ఉన్నత సలహాదారు, గూఢచారి చీఫ్ వ్లాదిమిరో మాంటెసినోస్ రాజకీయ నాయకులకు లంచం ఇస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో ఫుజిమొరి తన పూరీ్వకుల జపాన్‌కు పారిపోయారు. టోక్యో నుంచి ఫ్యాక్స్ ద్వారా రాజీనామా లేఖ పంపారు. రెండు దేశాల పౌరసత్వం ఉన్న ఆయన.. ఆ తరువాత జపాన్ సెనేటర్ పదవికి పోటీపడి ఓడిపోయారు. షైనింగ్ పాత్ మిలిటెంట్ల అణచివేతకు ఆదేశించారనే ఆరోపణలతో ఫుజిమొరిపై పలు కేసులు నమోదయ్యాయి. 25 ఏళ్ల జైలు శిక్ష 2005లో పెరూకు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 2007లో చిలీ వచి్చన ఆయన్ను అక్కడి అధికారులు 2009లో పెరూకు అప్పగించారు. పలు కేసుల్లో దోషిగా 25 ఏళ్ల జైలుపాలయ్యారు. తరచూ అనారోగ్యం పాలవ్వడంతో క్షమాభిక్ష కోసం అప్పీలు చేశారు. అయితే జైలు నుంచి బయటకు రావడానికి అదో ఎత్తుగడగా ప్రత్యర్థులు తోసిపుచ్చారు. అప్పటి అధ్యక్షుడు పెడ్రో పాబ్లో కుజిన్స్కి 2017లో ఫుజిమొరికి క్షమాభిక్ష ప్రసాదించారు. కొన్ని నెలల తరువాత కుజిన్‌స్కీ అభిశంసనకు గురయ్యారు. పెరూ న్యాయస్థానం ఫుజిమొరి క్షమాభిక్షను రద్దు చేసి, ప్రత్యేక జైలుకు పంపింది. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయనకు 2023లో కోర్టు క్షమాభిక్షను పునరుద్ధరించింది. అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే మొదటి భార్య సుసానాతో విభేదాలు రావడంతో విడిపోయారు. తరువాత ఆయన కుమార్తె కీకోను ప్రథమ మహిళగా నియమించారు. ఆమె మూడుసార్లు పెరూ అధ్యక్ష పదవికి పోటీ పడి, ఓడిపోయారు. కుమారుడు కెంజో కూడా రాజకీయాల్లోనే ఉన్నారు.