Albie Morkel
-
టీమిండియా కోచ్‌గా తమ్ముడు.. అన్న ఆసక్తికర వ్యాఖ్యలు
బంగ్లాదేశ్‌తో సిరీస్ సందర్భంగా టీమిండియా బౌలింగ్ కోచ్‌గా సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ మోర్నీ మోర్కెల్ ప్రయాణం మొదలుకానుంది. ప్రధాన కోచ్ గౌతం గంభీర్ సహాయక బృందంలోని ర్యాన్ టెన్ డస్కటే, అభిషేక్ నాయర్లతో అతడు కూడా చేరనున్నాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్లో భాగంగా జరుగనున్న ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్ భారత జట్టుకు కీలకంగా మారింది.ఈ నేపథ్యంలో మోర్నీ మోర్కెల్ అన్నయ్య, మాజీ క్రికెటర్ ఆల్బీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా కోచింగ్ సిబ్బందిలో భాగమయ్యే అవకాశం రావడం అరుదని.. ఇలాంటి బాధ్యతను సక్రమంగా నెరవేరిస్తేనే అంతా సాఫీగా సాగిపోతుందని అన్నాడు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నాడు.ఈ మేరకు ఆల్బీ మోర్కెల్ మాట్లాడుతూ.. ‘‘ఇతర జట్లతో పోలిస్తే టీమిండియాకు కోచ్‌గా పనిచేయడం ఎంతో ప్రతిష్టాత్మకమైనది. సుదీర్ఘ కాలంగా విజయవంతమైన జట్టుగా భారత్ కొనసాగుతోంది. అలాంటి చోట పొరపాట్లకు తావుండదు. ఇక ఆ జట్టులో ఇప్పటికే ఎన్నో అరుదైన ఘనతలు సాధించిన ఆటగాళ్లు ఉన్నారు.ముందుగా వారందరి నమ్మకం చూరగొనడం మోర్నీకి అత్యంత ముఖ్యమైనది. తమ నైపుణ్యాలకు మరింత మెరుగులుదిద్దుకునేలా మోర్నీ సహకరిస్తాడని వారు విశ్వసించాలి. అప్పుడే చక్కగా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ బౌలర్‌గా మోర్నీకి ఎంతో అనుభవం ఉంది.అతడి మార్గదర్శనంలో టీమిండియా బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారుతుంది. మోర్నీ గనుక తన ప్రణాళికలను పక్కాగా అమలు చేస్తే.. భారత జట్టుకు తప్పక మేలు చేకూరుతుంది’’ అని పేర్కొన్నాడు. మిడ్ డే తో మాట్లాడుతూ ఆల్బీ మోర్కెల్ ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా మోర్నీ మోర్కెల్‌కు గంభీర్‌తో మంచి అనుబంధం ఉంది.ఐపీఎల్లో కేకేఆర్ తరఫున గంభీర్ సారథ్యంలో ఆడాడు మోర్నీ. అనంతరం... లక్నో సూపర్ జెయింట్స్‌కు మెంటార్‌గా గంభీర్ పనిచేసిన సమయంలో అతడు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. ఇక సౌతాఫ్రికా తరఫున 86 టెస్టులు, 117 వన్డేలు, 44 టీ20లు ఆడిన మోర్నీ మోర్కెల్.. ఓవరాల్‌గా మూడు ఫార్మాట్లలో కలిపి 544 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం మోర్కెల్ పలు జట్లకు బౌలింగ్ కోచ్‌గా పనిచేశాడు. -
ఆత్మవిశ్వాసంతో ఉన్నాం
టి20ల్లో ఫలితాన్ని ఊహించలేం మళ్లీ దక్షిణాఫ్రికాకు ఆడతానని అనుకోలేదు ఆల్బీ మోర్కెల్ ఇంటర్వ్యూ ఢాకా నుంచి బత్తినేని జయప్రకాష్ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా ట్వంటీ 20 మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్ ఆల్బీ మోర్కెల్. ఇప్పటికే 259 మ్యాచ్‌లు ఆడాడు. భారీ హిట్టింగ్ చేయగల సామర్థ్యం, నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయగల నైపుణ్యంతో ఈ దక్షిణాఫ్రికా క్రికెటర్‌కు ప్రపంచ వ్యాప్తంగా టి20ల్లో భారీ డిమాండ్ ఉంది. అందుకే చెన్నై సూపర్ కింగ్స్ ఆరేళ్లు ధోనితో పాటు ఆల్బీనీ కొనసాగించింది. ఈసారి మాత్రం కొనసాగించలేదు. ఐపీఎల్-7 కోసం జరిగిన వేలంలో బెంగళూరు జట్టు కొనుగోలు చేసింది. అయితే రెండేళ్ల క్రితం టి20 ప్రపంచకప్ తర్వాత ఆల్బీ మోర్కెల్‌కు దక్షిణాఫ్రికా జట్టులో చోటు పోయింది. కొత్త వాళ్లు, యువకుల కోసం 32 ఏళ్ల మోర్కెల్‌ను పక్కనబెట్టారు. అయితే టి20 ప్రపంచకప్‌కు అతని అనుభ వం ఎంత అవసరమో దక్షిణాఫ్రికా బోర్డు ఆలస్యంగానైనా మళ్లీ గుర్తించింది. దీంతో ఈసారి బంగ్లాదేశ్‌లో దక్షిణాఫ్రికా తరఫున ఆడుతున్నాడు. ఇప్పటి వరకూ ఎన్నడూ ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవని లోటును సఫారీ జట్టు తీర్చుకోవాలని భావిస్తోంది. టోర్నీ గెలవగలమనే ఆత్మవిశ్వాసం తమలో ఉందంటున్న ఆల్బీ మోర్కెల్ ఇంటర్వ్యూ ‘సాక్షి’కి ప్రత్యేకం. ఈ టోర్నీలో ఇప్పటివరకూ మీ ప్రదర్శన సంతృప్తినిచ్చిందా? వరుసగా మూడు విజయాలు సాధించాం. అయితే అందులో రెండు మ్యాచ్‌లు ఆఖరి వరకూ పోరాడి గెలిచాం. సాధారణంగా అలాంటి మ్యాచ్‌లు గెలిచినప్పుడు ఊరట వస్తుంది. దానితో పాటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యక్తిగతంగా మాత్రం నా ప్రదర్శన ఇంకా మెరుగుపడాలి. సెమీస్‌లో భారత్‌లాంటి పటిష్టమైన జట్టుతో ఆడబోతున్నారు. ఈ మ్యాచ్‌పై కామెంట్? ఈ టోర్నమెంట్లో భారత్ అద్భుతంగా ఆడుతోంది. కాబట్టి మేం మా పూర్తి సామర్థ్యంతో పోరాడాల్సి ఉంటుంది. ఫైనల్‌కు చేరతామన్న నమ్మకం ఉందా? ఏ జట్టుకైనా నమ్మకం కచ్చితంగా ఉంటుంది. టి20ల్లో ఫలితాన్ని అంచనా వేయలేం. ఒక్క ఓవర్లోనే మ్యాచ్ స్వరూపం, ఫలితం కూడా మారిపోతుంది. ఏ జట్టుతో ఆడినా పూర్తి సామర్థ్యంతో ఆడటం ఒక్కటే ముఖ్యం. దక్షిణాఫ్రికా జట్టు ఏ పెద్ద టోర్నీలోనూ ఇప్పటివరకు టైటిల్ గెలవలేదు. ఆ లోటు బాధిస్తుందా? చాలా టోర్నీల్లో మేం మంచి క్రికెట్ ఆడాం. టోర్నీ అంతటా బాగా ఆడినా ఒక్కరోజు వైఫల్యం వల్ల మ్యాచ్‌లు పోయాయి. ఈసారి గెలవగలమనే ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. సాధారణంగా నాకౌట్ మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా తరచూ విఫలమవుతుంటుంది. దీనికి ఒత్తిడే కారణమా? నాకౌట్ అనే కాదు... ప్రతి మ్యాచ్‌లోనూ ఒత్తిడి ఉంటుంది. దీనిని ప్రొఫెషనల్ క్రికెటర్లు కచ్చితంగా అధిగమించాలి. ఈసారి మ్యాచ్‌లు ఒత్తిడిలోనే గెలిచామన్న విషయం గుర్తుంచుకోవాలి. టి20 స్పెషలిస్ట్ అనే ముద్ర వల్ల కెరీర్లో పెద్దగా టెస్టులు ఆడలేదు. దీని గురించి ఎప్పుడైనా బాధపడ్డారా? చివరి ఓవర్లలో వచ్చి మొదటి బంతి నుంచే హిట్టింగ్ చేయడం సమస్య కాదా? ప్రతి క్రికెటర్ తన సామర్థ్యం ఏమిటనేది తెలుసుకోగలగాలి. అప్పుడు బాధపడాల్సిన అవసరం ఉండదు. నా బలం టి20 అయినప్పుడు నేను టెస్టుల గురించి ఆలోచించడం అనవసరం. ఇక చివరి ఓవర్లలో వచ్చి మొదటి బంతి నుంచే హిట్టింగ్ చేయడం అనేది చాలా కష్టం. ఎక్కువసార్లు విఫలమవుతాం. ఇది మానసికంగా బాధిస్తుంది. దీనిని అధిగమిస్తేనే సక్సెస్ లభిస్తుంది. తిరిగి దక్షిణాఫ్రికా జట్టులోకి వస్తానని ఊహించారా? నిజాయితీగా చెప్పాలంటే లేదు. నా అంతర్జాతీయ కెరీర్ ముగిసిందని నేను ఫిక్సయ్యాను. కానీ ఈసారి దేశవాళీ క్రికెట్లో బాగా ఆడటం వల్ల ఈ పిలుపు వచ్చింది. నిజానికి నేను మళ్లీ జాతీయ జట్టులోకి ఎంపికయ్యానని తెలియగానే ఆశ్చర్యపోయాను. అయితే నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే నా బాధ్యత.