మోర్నీ మోర్కెల్- గంభీర్
బంగ్లాదేశ్‌తో సిరీస్ సందర్భంగా టీమిండియా బౌలింగ్ కోచ్‌గా సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ మోర్నీ మోర్కెల్ ప్రయాణం మొదలుకానుంది. ప్రధాన కోచ్ గౌతం గంభీర్ సహాయక బృందంలోని ర్యాన్ టెన్ డస్కటే, అభిషేక్ నాయర్‌లతో అతడు కూడా చేరనున్నాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్‌లో భాగంగా జరుగనున్న ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్ భారత జట్టుకు కీలకంగా మారింది.
ఈ నేపథ్యంలో మోర్నీ మోర్కెల్ అన్నయ్య, మాజీ క్రికెటర్ ఆల్బీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా కోచింగ్ సిబ్బందిలో భాగమయ్యే అవకాశం రావడం అరుదని.. ఇలాంటి బాధ్యతను సక్రమంగా నెరవేరిస్తేనే అంతా సాఫీగా సాగిపోతుందని అన్నాడు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నాడు.
ఈ మేరకు ఆల్బీ మోర్కెల్ మాట్లాడుతూ.. ‘‘ఇతర జట్లతో పోలిస్తే టీమిండియాకు కోచ్‌గా పనిచేయడం ఎంతో ప్రతిష్టాత్మకమైనది. సుదీర్ఘ కాలంగా విజయవంతమైన జట్టుగా భారత్ కొనసాగుతోంది. అలాంటి చోట పొరపాట్లకు తావుండదు. ఇక ఆ జట్టులో ఇప్పటికే ఎన్నో అరుదైన ఘనతలు సాధించిన ఆటగాళ్లు ఉన్నారు.
ముందుగా వారందరి నమ్మకం చూరగొనడం మోర్నీకి అత్యంత ముఖ్యమైనది. తమ నైపుణ్యాలకు మరింత మెరుగులుదిద్దుకునేలా మోర్నీ సహకరిస్తాడని వారు విశ్వసించాలి. అప్పుడే చక్కగా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ బౌలర్‌గా మోర్నీకి ఎంతో అనుభవం ఉంది.
అతడి మార్గదర్శనంలో టీమిండియా బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారుతుంది. మోర్నీ గనుక తన ప్రణాళికలను పక్కాగా అమలు చేస్తే.. భారత జట్టుకు తప్పక మేలు చేకూరుతుంది’’ అని పేర్కొన్నాడు. మిడ్ డే తో మాట్లాడుతూ ఆల్బీ మోర్కెల్ ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా మోర్నీ మోర్కెల్‌కు గంభీర్‌తో మంచి అనుబంధం ఉంది.
ఐపీఎల్‌లో కేకేఆర్ తరఫున గంభీర్ సారథ్యంలో ఆడాడు మోర్నీ. అనంతరం... లక్నో సూపర్ జెయింట్స్‌కు మెంటార్‌గా గంభీర్ పనిచేసిన సమయంలో అతడు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. ఇక సౌతాఫ్రికా తరఫున 86 టెస్టులు, 117 వన్డేలు, 44 టీ20లు ఆడిన మోర్నీ మోర్కెల్.. ఓవరాల్‌గా మూడు ఫార్మాట్లలో కలిపి 544 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం మోర్కెల్ పలు జట్లకు బౌలింగ్ కోచ్‌గా పనిచేశాడు.
Comments
Please login to add a commentAdd a comment