‘ఐదో టీ20లో తప్పక ఆడిస్తాం.. అతడి రాకతో జట్టులో జోష్‌’ | Probably Going To: Morne Morkel Gives Update On Shami Place After Series Win | Sakshi
Sakshi News home page

ఐదో టీ20లో తప్పక ఆడిస్తాం.. అతడి రాకతో జట్టులో జోష్‌: మోర్నీ మోర్కెల్‌

Published Sat, Feb 1 2025 5:00 PM | Last Updated on Sat, Feb 1 2025 6:07 PM

Probably Going To: Morne Morkel Gives Update On Shami Place After Series Win

మహ్మద్‌ షమీ(PC: BCCI)

దాదాపు ఏడాది తర్వాత టీమిండియా తరఫున పునరాగమనం చేశాడు సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ(Mohammed Shami). ఇంగ్లండ్‌తో మూడో టీ20(India vs England) సందర్భంగా భారత తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే, మంగళవారం నాటి(జనవరి 28) ఈ మ్యాచ్‌లో షమీ కొత్త బంతితో ఆకట్టుకోలేకపోయాడు.  

ఫలితంగా రాజ్‌కోట్‌ టీ20లో మూడు ఓవర్లకే పరిమితమైన షమీ.. మొత్తంగా 25 పరుగులు ఇచ్చి.. ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో నాలుగో టీ20లో అతడికి ఆడే అవకాశం రాలేదు. షమీపై వేటు వేసిన టీమిండియా యాజమాన్యం యువ తరంగం అర్ష్‌దీప్‌ సింగ్‌(Arshdeep Singh)ను మళ్లీ వెనక్కి పిలిపించింది.

తుది జట్టులోకి వస్తాడా? లేదా? 
ఈ నేపథ్యంలో షమీ మళ్లీ తుది జట్టులోకి వస్తాడా? లేదా? అన్న చర్చ మొదలైంది. ఈ క్రమంలో టీమిండియా బౌలింగ్‌ కోచ్‌ మోర్నీ మోర్కెల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్‌తో ఐదో టీ20లో షమీని ఆడిస్తామనే సంకేతాలు ఇచ్చాడు. నాలుగో టీ20 జరుగుతున్న సమయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘షమీ బాగానే ఉన్నాడు.

అతడు చక్కగా బౌలింగ్‌ చేస్తున్నాడు. వార్మప్‌ మ్యాచ్‌లలోనూ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అతడు జట్టుతో చేరడం సంతోషంగా ఉంది. తదుపరి మ్యాచ్‌లో అతడికి ఆడే అవకాశం రావచ్చు. అయితే, అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేం.

భారత క్రికెట్‌కు కొత్త జోష్‌
ఏదేమైనా.. అతడు తిరిగి టీమిండియాలోకి రావడం బౌలింగ్‌ విభాగానికి సానుకూలాంశం. ఎంతో అనుభవజ్ఞుడు. తన అనుభవాలను యువ బౌలర్లతో పంచుకుంటున్నాడు. బౌలర్‌గా తన జ్ఞానాన్ని వాళ్లకూ పంచుతున్నాడు. షమీ రాకతో భారత క్రికెట్‌కు కొత్త జోష్‌ వచ్చింది. షమీ నుంచి గొప్ప ప్రదర్శన కోసం ఎదురుచూస్తున్నాం’’ అని మోర్నీ మోర్కెల్‌ చెప్పుకొచ్చాడు.

చీలమండ గాయానికి సర్జరీ
కాగా వన్డే వరల్డ్‌కప్‌-2023 ఫైనల్‌ తర్వాత షమీ జాతీయ జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. చీలమండ గాయం వేధిస్తున్నా ఐసీసీ టోర్నీలో మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న తర్వాతే సర్జరీ చేయించుకున్నాడు. అనంతరం జాతీయ క్రికెట్‌ అకాడమీలో పునరావాసం పొందిన షమీ.. కోలుకోవడానికి దాదాపు ఏడాది పట్టింది.

అనంతరం.. బెంగాల్‌ తరఫున రంజీ, సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ,  విజయ్‌ హజారే ట్రోఫీ మ్యాచ్‌లు ఆడి ఫిట్‌నెస్‌ నిరూపించుకున్న షమీని.. బీసీసీఐ ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు ఎంపిక చేసింది. అదే విధంగా ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 జట్టులోనూ చోటిచ్చింది. 

ఐదో టీ20లో ఆడటం పక్కా!
అయితే, ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో స్పిన్నర్లకు పెద్ద పీట వేసిన యాజమాన్యం.. ఒకే ఒక్క స్పెషలిస్టు పేసర్‌తో బరిలోకి దిగింది. ఈ నేపథ్యంలో అర్ష్‌దీప్‌పై నమ్మకం ఉంచిన యాజమాన్యం షమీకి ఇప్పటి వరకు ఒకే ఒక మ్యాచ్‌లో అవకాశం ఇచ్చింది.

ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో నాలుగో టీ20లో పదిహేను పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందింది. అంతకు ముందు కోల్‌కతా, చెన్నైలలో విజయం సాధించిన సూర్యకుమార్‌సేన.. తాజా విజయంతో 3-1తో సిరీస్‌ కైవసం చేసుకుంది. 

ఇక టీమిండియా-ఇంగ్లండ్‌ మధ్య ఆదివారం ముంబైలో ఆఖరిదైన నామమాత్రపు ఐదో టీ20 జరుగుతుంది. ఇప్పటికే భారత్‌ సిరీస్‌ గెలిచింది కాబట్టి.. అర్ష్‌దీప్‌ సింగ్‌కు విశ్రాంతినిచ్చి.. షమీని ఆడించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

చదవండి: హర్షిత్‌ బదులు అతడిని పంపాల్సింది.. ఇదేం పద్ధతి?: భారత మాజీ క్రికెటర్‌ ఫైర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement