ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్(India vs England)కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తమ జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని ఈ జట్టులో పదిహేను మందికి స్థానం కల్పించినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఎట్టకేలకు షమీ పునరాగమనం
ఇక ఈ సిరీస్‌తో టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఎట్టకేలకు పునరాగమనం చేయనున్నాడు. వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత చీలమండ నొప్పికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఈ బెంగాల్ బౌలర్.. దాదాపు ఏడాది కాలంగా జట్టుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ బరిలో దిగిన షమీ.. తొమ్మిది మ్యాచ్‌లు ఆడి పదకొండు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోనూ బెంగాల్ తరఫున బరిలోకి దిగి.. ఎటువంటి ఇబ్బంది లేకుండా పది ఓవర్ల కోటా పూర్తి చేశాడు. ఈ క్రమంలో ఫిట్‌నెస్ నిరూపించుకున్న షమీకి టీమిండియా సెలక్టర్లు పిలుపునిచ్చారు. ఇక పేస్ దళ నాయకుడు జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు, మరో స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ విశ్రాంతి పేరిట జట్టుకు దూరమయ్యారు.
వైస్ కెప్టెన్‌గా అతడే
ఈ క్రమంలో షమీ సారథ్యంలోని పేస్ విభాగంలో అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు హర్షిత్ రాణా చోటు దక్కించుకున్నారు. ఇక స్పిన్నర్ల కోటాలో వరుణ్ చక్రవర్తి, రవి బిష్షోయి స్థానం సంపాదించగా.. ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్(Axar Patel), వాషింగ్టన్ సుందర్ ఎంపికయ్యారు. ఇక ఈ సిరీస్ ద్వారా.. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
సూపర్‌స్టార్‌పై వేటు!
మరోవైపు.. సూపర్‌స్టార్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్(Rishabh Pant)ను మాత్రం సెలక్టర్లు ఇంగ్లండ్‌తో టీ20లకు ఎంపిక చేయలేదు. వికెట్ కీపర్ల కోటాలో సంజూ శాంసన్‌తో పాటు ధ్రువ్ జురెల్ చోటు దక్కించుకున్నాడు. అయితే, ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ కారణంగా బిజీగా గడిపిన పంత్‌కు విశ్రాంతినిచ్చారా? లేదంటే అతడిపై వేటు వేశారా అన్నది మాత్రం తెలియరాలేదు.
ఇక సౌతాఫ్రికాలో మాదిరి ఈసారి కూడా అభిషేక్ శర్మతో కలిసి సంజూ శాంసన్ ఓపెనర్‌గా బరిలోకి దిగనుండగా.. లెఫ్టాండర్లు తిలక్ వర్మ, రింకూ సింగ్ కూడా ఈ జట్టులో ఉన్నారు.
సౌతాఫ్రికా పర్యటనలో అదరగొట్టిన టీమిండియా
కాగా సూర్య సేన చివరగా సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టీ20 సిరీస్ ఆడింది. ఆ టూర్‌లో సంజూ శాంసన్, తిలక్ వర్మ రెండేసి శతకాలతో దుమ్ములేపారు. వీళ్లిద్దరి విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా ప్రొటిస్ జట్టును 3-1తో ఓడించి సిరీస్ కైవసం చేసుకుంది.
ఇంగ్లండ్‌తో ఐదు టీ20లు
కోల్‌కతా వేదికగా జనవరి 22న మొదటి టీ20 జరుగనుండగా.. జనవరి 25న చెన్నై రెండో టీ20 మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. అనంతరం.. జనవరి 28న రాజ్‌కోట్‌లో మూడో టీ20.. జనవరి 31న పుణె వేదికగా నాలుగో టీ20, ఫిబ్రవరి 2న ముంబైలో ఐదో టీ20 జరుగనుంది. అయితే, ఇంగ్లండ్‌తో మూడు వన్డేలకు మాత్రం బీసీసీఐ జట్టును ప్రకటించలేదు.
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు
సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్(వైస్ కెప్టెన్), హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయి, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్).
చదవండి: స్టీవ్ స్మిత్ ఊచకోత.. విధ్వంసకర శతకం.. ‘బిగ్’ రికార్డ్!
Comments
Please login to add a commentAdd a comment