స్టీవ్ స్మిత్ (PC: BBL X)
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్(Steve Smith) విధ్వంసకర శతకంతో మెరిశాడు. ప్రత్యర్థి జట్టు బౌలింగ్‌ను ఊచకోత కోసి.. 58 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. బిగ్ బాష్ లీగ్ 2024- 25(Big Bash League 2024-25 )లో సిడ్నీ సిక్సర్స్- పెర్త్ స్కార్చర్స్ మ్యాచ్ సందర్భంగా స్మిత్ ఈ మేర బ్యాట్ ఝులిపించాడు.
బిగ్ రికార్డు.. ఫాస్టెస్ట్‌గా మూడు సెంచరీలు
ఓవరాల్‌గా టీ20 ఫార్మాట్‌లో స్మిత్‌కు ఇది నాలుగో సెంచరీ కాగా.. బిగ్ బాష్ లీగ్(బీబీఎల్)లో మూడోది. తద్వారా లీగ్ చరిత్రలో అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్‌గా బెన్ మెక్‌డెర్మాట్(3)ను రికార్డును అతడు సమం చేశాడు. అయితే, మెక్‌డెర్మాట్(Ben McDermott) మూడు శతకాలు బాదడానికి 100 మ్యాచ్‌లు అవసరం కాగా.. స్మిత్ తన 32వ ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించాడు.
కాగా బీబీఎల్‌లో స్మిత్ సిడ్నీ సిక్సర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. లీగ్ తాజా ఎడిషన్‌లో అతడికి ఇదే తొలి మ్యాచ్. ఇటీవల టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీతో బిజీబిజీగా గడిపిన ఈ ఆసీస్ సీనియర్ బ్యాటర్.. మెల్‌బోర్న్ బాక్సింగ్ డే టెస్టులో శతకం బాది ఫామ్‌లోకి వచ్చాడు.
లంక టూర్‌లో సారథిగా
ఇక ఈ ఐదు టెస్టు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 3-1తో భారత జట్టుపై గెలిచిన కంగారూలు.. పదేళ్ల తర్వాత ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీని సొంతం చేసుకున్నారు. అనంతరం.. శ్రీలంకతో రెండు టెస్టులు ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టు అక్కడికి వెళ్లనుంది. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఈ సిరీస్‌కు దూరం కాగా.. అతడి స్థానంలో స్టీవ్ స్మిత్ సారథ్య బాధ్యతలు నిర్వర్తించునున్నాడు.
అయితే, జనవరి 29 నుంచి ఆసీస్ లంక టూర్ మొదలుకానుంది. ఈ గ్యాప్‌లో స్మిత్ బీబీఎల్‌లో ఎంట్రీ ఇచ్చి.. తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో దుమ్ములేపాడు.
ఈలోపు బీబీఎల్‌లో ఎంట్రీ
సిడ్నీ వేదికగా పెర్త్ స్కార్చర్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడిన సిడ్నీ సిక్సర్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ జోష్ ఫిలిప్(9) విఫలం కాగా.. మరో ఓపెనర్ స్మిత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అరవై నాలుగు బంతుల్లోనే 121 పరుగులు చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా పది ఫోర్లతో పాటు ఏడు సిక్సర్లు ఉండటం విశేషం.
మిగతా వాళ్లలో కర్టిస్ పాటర్సన్(12) నిరాశపరచగా.. కెప్టెన్ మోయిజెస్ హెండ్రిక్స్ మెరుపు ఇన్నింగ్స్(28 బంతుల్లో 46) ఆడాడు. ఇక బెన్ డ్వార్షుయిస్ ధనాధన్ దంచికొట్టి కేవలం ఏడు బంతుల్లోనే 23 పరుగులు సాధించాడు. స్మిత్‌తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో సిడ్నీ సిక్సర్స్ కేవలం మూడు వికెట్ల నష్టానికి 220 పరుగులు స్కోరు చేసింది.
ఆఖరి వరకు పోరాడినా
ఇక లక్ష్య ఛేదనకు దిగిన పెర్త్ స్కార్చర్స్‌కు ఓపెనర్ సామ్ ఫానింగ్(41) శుభారంభం అందించినా.. మరో ఓపెనర్ ఫిన్ అలెన్(15) నిరాశపరిచాడు. మిగతా వాళ్లలో కూపర్ కొన్నోలీ(33), మాథ్యూ కెప్టెన్(17 బంతుల్లో 28) ఫర్వాలేదనిపించారు. ఇక ఆష్టన్ టర్నర్(32 బంతుల్లో 66 నాటౌట్) ఆఖరి వరకు పోరాడాడు.
కానీ అప్పటికే బంతులు అయిపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయిన పెర్త్ జట్టు 206 పరుగుల వద్దే నిలిచిపోయింది. ఫలితంగా సిడ్నీ పద్నాలుగు పరుగుల తేడాతో గెలుపొంది. సిడ్నీ సిక్సర్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన స్టీవ్ స్మిత్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.
చదవండి: ‘రోహిత్ శర్మ ఖేల్ ఖతం.. అందులో మాత్రం భవిష్యత్తు ఉంది’
Steve Smith is something else 😲
Here's all the highlights from his 121* off 64 balls. #BBL14 pic.twitter.com/MTo82oWAv1— KFC Big Bash League (@BBL) January 11, 2025
Comments
Please login to add a commentAdd a comment