Steve Smith: బిగ్ బాష్ లీగ్ 2022-23 సీజన్‌లో ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నాడు. టెస్ట్ ప్లేయర్‌గా ముద్రపడిన స్మిత్ వరుస సెంచరీలతో విరుచుకుపడుతూ, తన జట్టు (సిడ్నీ సిక్సర్స్) విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. జనవరి 17 అడిలైడ్ స్ట్రయికర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 56 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేసిన స్మిత్.. ఇవాళ (జనవరి 21) సిడ్నీ థండర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 66 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో ఏకంగా 125 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
19 ఓవర్లలో సిడ్నీ సిక్సర్స్ 2 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేయగా.. స్టీవ్ ఒక్కడే అందులో 80 శాతానికి పైగా పరుగులు సాధించాడు. అతడికి కెప్టెన్ హెన్రిక్స్ (36 బంతుల్లో 45 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) మరో ఎండ్‌లో సహకరించాడు. స్మిత్ ఊచకోత ధాటికి థండర్స్ బౌలర్లు విలవిలలాడిపోయారు. గురిందర్ సంధు ఒక్కడే 2 వికెట్లు పడగొట్టాడు.
అనంతరం 188 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన థండర్స్.. సిక్సర్స్ బౌలర్లు స్టీవ్ ఒకీఫ్ (4/10), సీన్ అబాట్ (3/11), బెన్ వార్షుయిస్ (2/14), టాడ్ మర్ఫీ (1/18) థాటికి 14.4 ఓవర్లలో 62 పరుగులకే చాపచుట్టేసింది. ఫలితంగా సిక్సర్స్ 125 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. థండర్స్ ఇన్నింగ్స్‌లో డేవిడ్ వార్నర్ (16), జోయల్ డేవిస్ (10) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు.
పేస్ బౌలర్లకు స్వర్గధామమైన సిడ్నీ పిచ్‌పై స్టీవ్ స్మిత్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 3 రోజుల గ్యాప్‌లో రెండు సెంచరీలు బాదిన స్మిత్‌ను ఆకాశానికెత్తుతున్నారు. బీబీఎల్‌లో సిక్సర్స్ తరఫున నమోదైన రెండు సెంచరీలు స్మితే చేయడం విశేషం. 12 ఏళ్ల బీబీఎల్ కెరీర్‌లో ఒక్క సెంచరీ కూడా చేయని స్మిత్ కేవలం 3 రోజుల గ్యాప్‌లో రెండు సెంచరీలు చేయడంతో ఆసీస్ అభిమానులు కొనియాడుతున్నారు. అంతర్జాతీయ టీ20ల్లో ఒక్క సెంచరీ కూడా చేయని స్మిత్.. ఐపీఎల్‌లోనూ సెంచరీ చేయడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment