BBL 2022-23: Brisbane Heat Defeat Sydney Sixers In Challenger By Four Wickets - Sakshi
Sakshi News home page

BBL 2022-23: నెసర్‌ ఆల్‌రౌండ్‌ షో.. స్టీవ్‌ స్మిత్‌ లేని సిక్సర్స్‌ను కొట్టి ఫైనల్‌కు చేరిన హీట్‌

Published Thu, Feb 2 2023 5:36 PM | Last Updated on Thu, Feb 2 2023 7:31 PM

BBL 2022 23: Brisbane Heat Defeat Sydney Sixers In Challenger - Sakshi

బిగ్‌బాష్‌ లీగ్‌ 2022-23 సీజన్‌లో ఫైనల్‌ బెర్తులు ఖరారయ్యాయి. ఇవాళ (ఫిబ్రవరి 2) జరిగిన ఛాలెంజర్‌ గేమ్‌లో బ్రిస్బేన్‌ హీట్‌.. సిడ్నీ సిక్సర్స్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి, తుది సమరంలో పెర్త్‌ క్కార్చర్స్‌తో ఢీకి సిద్ధమైంది. లోకల్‌ (ఆసీస్‌) స్టార్‌ ఆటగాళ్లంతా ఇండియా టూర్‌ (4 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌)కు వెళ్లడంతో చప్పగా సాగిన ఇవాల్టి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సిక్సర్స్‌.. కున్నెమన్‌ (3/17), స్పెన్సర్‌ జాన్సన్‌ (3/28), మైఖేల్‌ నెసర్‌ (2/28), మెక్‌ స్వీనీ (1/21) ధాటికి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 116 పరుగులు మాత్రమే చేసింది.

డేనియల్‌ హ్యూస్‌ (23) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 117 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హీట్‌ను.. నెసర్‌ (32 బంతుల్లో 48 నాటౌట్‌; 7 ఫోర్లు) అజేయమైన ఇన్నింగ్స్‌తో విజయతీరాలకు చేర్చాడు. ఆరంభంలో ఈ జట్టు కూడా వడివడిగా వికెట్లు కోల్పోయినా నెసర్‌ ఒక్కడే నిలబడి, ఒంటిచేత్తో తన జట్టును ఫైనల్‌కు చేర్చాడు. హీట్‌ టీమ్‌ 18.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జోష్‌ బ్రౌన్‌ (20) ఓ మోస్తరుగా రాణించాడు. సిక్సర్స్‌ బౌలర్లలో నవీద్‌ 2, స్టీవ్‌ ఓకీఫ్‌, సీన్‌ అబాట్‌, డ్వార్షుయిష్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో చెలరేగిన నెసర్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. ఫిబ్రవరి 4న జరిగే ఫైనల్లో బ్రిస్బేన్‌ హీట్‌ టీమ్‌.. పెర్త్‌ స్కార్చర్స్‌తో టైటిల్‌ కోసం పోరాడుతుంది. ఈ మ్యాచ్‌ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:45 గంటలకు ప్రారంభమవుతుంది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌కు ముందు వరకు స్టీవ్‌ స్మిత్‌, ఉస్మాన్‌ ఖ్వాజా, డేవిడ్‌ వార్నర్‌, ట్రవిస్‌ హెడ్‌ లాంటి విధ్వంసకర వీరుల మెరుపులతో బీబీఎల్‌ కళకళలాడింది. ప్రస్తుతం ఈ ఆటగాళ్లంతా భారత పర్యటనలో ఉండటంతో లీగ్‌ కళావిహీనంగా, ఎలాంటి మెరుపులు లేకుండా చప్పగా సాగుతుంది. ఫైనల్‌ మ్యాచ్‌ కూడా దాదాపుగా ఇలాగే సాగవచ్చని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు.    


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement