టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) కెరీర్ గురించి ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్(Brad Hogg) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల్లో హిట్‌మ్యాన్ పనైపోయిందని.. ఇక అతడు రిటైర్మెంట్ ప్రకటించడమే తరువాయి అన్నాడు. గత ఆరేడు నెలలుగా అతడి విఫలమవుతున్న తీరు.. కెరీర్ ముగింపునకు వచ్చిందనడానికి సంకేతం అని పేర్కొన్నాడు.
అయితే, వన్డే(ODI Cricket)ల్లో మాత్రం రోహిత్ శర్మకు ఇంకా భవిష్యత్తు ఉందని బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డాడు. కాగా గత కొంతకాలంగా భారత సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ టెస్టుల్లో దారుణ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటున్న విషయం తెలిసిందే. అటు బ్యాటర్‌గా.. ఇటు కెప్టెన్‌గా అతడికి చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి.
వరుస వైఫల్యాలు
తొలుత స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టుల్లో తేలిపోయిన ఓపెనింగ్ బ్యాటర్ రోహిత్ శర్మ.. తర్వాత ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలోనూ నిరాశపరిచాడు. గత పదకొండు ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ నమోదు చేసిన స్కోర్లు వరుసగా 2, 52, 0, 8, 18, 11, 3, 6, 10, 3, 9. వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఆసీస్‌తో తొలి టెస్టుకు దూరమైన రోహిత్ శర్మ.. అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టు సందర్భంగా మళ్లీ జట్టుతో చేరాడు.
అయితే, తొలి టెస్టులో ఓపెనింగ్ జోడీగా యశస్వి జైస్వాల్- కేఎల్ రాహుల్ హిట్ కావడంతో.. రోహిత్ తప్పనిసరి పరిస్థితుల్లో మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే, అనవసరపు షాట్లకు పోయి వికెట్ పారేసుకున్నాడు.
అనంతరం మూడో టెస్టులోనూ అదే స్థానంలో బ్యాటింగ్ చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. మెల్‌బోర్న్‌లో జరిగిన నాలుగో టెస్టులో మాత్రం జైస్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించాడు. తన రెగ్యులర్ స్థానమైన ఓపెనింగ్‌లోనూ రోహిత్ శర్మ పూర్తిగా విఫలమయ్యాడు.
ఈ క్రమంలో పెద్ద ఎత్తున విమర్శలు రాగా.. రోహిత్ శర్మ ఆఖరిదైన సిడ్నీ టెస్టుకు ముందు కీలక నిర్ణయం తీసుకున్నాడు. జట్టు ప్రయోజనాల దృష్ట్యా విశ్రాంతి పేరిట తనంతట తానుగా జట్టు నుంచి తప్పుకొన్నాడు.
ఈ టెస్టు మ్యాచ్‌లో ఆరంభంలో అదరగొట్టిన టీమిండియా.. తర్వాత చతికిల పడి ఓటమిపాలైంది. తద్వారా ఐదు టెస్టుల సిరీస్‌లో ఆసీస్ చేతిలో 3-1తో ఓడి.. పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది.
రోహిత్ ఖేల్ ఖతం
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రాడ్ హాగ్ మాట్లాడుతూ.. ‘‘టెస్టు క్రికెట్‌లో రోహిత్ శర్మ పనైపోయిందనే అనుకుంటున్నా. ఇక అతడు ఈ ఫార్మాట్ నుంచి తప్పుకోవడమే మంచిది. గత ఆరు- ఏడు నెలలుగా అతడి ఫామ్ అంత గొప్పగా ఏమీ లేదు.
వికెట్ పారేసుకున్న తీరు మరీ ఘోరం
అంతేకాదు అతడు బౌల్డ్ అయ్యాడు. లెగ్ బిఫోర్ వికెట్(ఎల్బీడబ్ల్యూ)గా వెనుదిరిగాడు. ఒక ఓపెనర్ అయి ఉండి ఇలా అవుట్ కావడం సరికాదు. ముఖ్యంగా అతడు ఎల్బీడబ్ల్యూ కావడం మరీ ఘోరం’’ అని విమర్శలు గుప్పించాడు. అయితే, ఐదో టెస్టు నుంచి రోహిత్ శర్మ స్వయంగా తప్పుకోవడాన్ని బ్రాడ్ హాగ్ ప్రశంసించాడు.
‘‘రోహిత్ శర్మ ఫామ్‌లో లేకపోవడం నిరాశాజనకం. అయితే, సిడ్నీలో అతడు తీసుకున్న నిర్ణయం సరైంది. కానీ అంతకంటే ముందే.. అంటే మెల్‌బోర్న్ టెస్టు సందర్భంగానే అతడు తుదిజట్టు నుంచి తప్పుకొంటే ఇంకా బాగుండేది. తన స్థానంలో శుబ్‌మన్ గిల్‌కు ఆడించి ఉంటే మేలు జరిగేది’’ అని బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డాడు.
వన్డేల్లో రోహిత్ శర్మకు ఇంకా భవిష్యత్తు ఉంది
ఇక 37 ఏళ్ల రోహిత్ శర్మ వన్డే కెరీర్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘టెస్టుల సంగతి ఎలా ఉన్నా.. వన్డేల్లో రోహిత్ శర్మకు ఇంకా భవిష్యత్తు ఉంది. ఈ ఫార్మాట్లో కాస్త దూకుడుగా.. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే, వయసు మీద పడుతున్న దృష్ట్యా అతడు కాస్త జాగ్రత్తగా ఆడితేనే ఇంకొన్నాళ్లు కొనసాగగలుగుతాడు.
ఇప్పటి వరకు అతడి వన్డే కెరీర్ అత్యద్భుతం. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే, జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రోహిత్ శర్మ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాడని భావిస్తున్నా’’ అని బ్రాడ్ హాగ్ పేర్కొన్నాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 వరకు రోహిత్ శర్మనే టీమిండియాకు ముందుకు నడిపిస్తాడని అభిప్రాయపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment