సంజూ శాంసన్(Sanju Samson)కు తాను పెద్ద అభిమానినైపోయానని టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్(Sanjay Manjrekar) అన్నాడు. గతంలో బ్యాటింగ్ బాగా చేసినా.. పరుగులు రాబట్టలేక ఇబ్బంది పడేవాడని.. ఇప్పుడు మాత్రం దుమ్ములేపుతున్నాడని ప్రశంసించాడు. సంజూ ఆట తీరుకు తాను ఫిదా అయ్యానంటూ కితాబులిచ్చాడు. రానున్న కాలంలో ఈ కేరళ బ్యాటర్ అద్భుతాలు చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
కాగా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు అద్భుత నైపుణ్యాలున్నా.. నిలకడలేమి ఆట తీరుకు మారుపేరని అపవాదు ఉంది. అయితే, ఇటీవల అంతర్జాతీయ టీ20లలో అతడి ఆట తీరు అభిమానులతో పాటు విమర్శకులనూ మెప్పించింది. తొలుత స్వదేశంలో విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డ సంజూ.. సౌతాఫ్రికా గడ్డ మీద కూడా రెండు సెంచరీలతో రాణించాడు.
బంగ్లాదేశ్‌పై 47 బంతుల్లోనే 111 పరుగులు సాధించిన సంజూ శాంసన్.. ఆ తర్వాత సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో 107, 109 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో సొంతగడ్డపై ఇంగ్లండ్(India Vs England)తో టీ20 సిరీస్ ఆడనున్న భారత జట్టులో అతడికి చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.
సంజూ అలాంటి వాడే
ఈ నేపథ్యంలో కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ స్టార్ స్పోర్ట్స్ షో లో మాట్లాడుతూ.. ‘‘ఆత్మవిశ్వాసం.. పరిణతితో కూడిన బ్యాటింగ్.. వికెట్‌కు విలువ ఇచ్చే విధానం.. సంజూలోని ఈ గుణాలు నన్ను ఆకట్టుకున్నాయి. అతడు సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడలేడని, నిలకడలేని ఆటగాడని విమర్శలు ఉండేవి.
కానీ ఇప్పుడు అద్భుతంగా ఆడుతున్నాడు. కొంతమంది ఆలస్యంగా పేరు తెచ్చుకుంటారు. సంజూ అలాంటి వాడే. నేనిప్పుడు అతడికి వీరాభిమానిని. గతంలో అతడు బ్యాటింగ్ మాత్రమే బాగా చేస్తాడు.. పరుగులు చేయడని అంతా అంటూ ఉండేవారు. కానీ ఇప్పుడు రెండూ బాగానే చేస్తున్నాడు’’ అని ప్రశంసలు కురిపించాడు.
ఇక ఇదే షోలో మరో మాజీ క్రికెటర్, టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ సైతం సంజూ గురించి ప్రస్తావన రాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ప్రస్తుతం అతడు మంచి ఫామ్‌లో ఉన్నాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌లలో బాగా ఆడితే.. బ్యాటర్‌పై కాస్త ఒత్తిడి తగ్గుతుంది. తద్వారా అతడు మరింత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలుగుతాడు.
సిక్సర్లు బాదడంలో యువీ తర్వాత అతడే!
టాపార్డర్‌లో బ్యాటింగ్ చేయడం అతడికి సానుకూలాంశం. వికెట్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పని ఉండదు. అంతేకాదు.. సంజూ సిక్స్ హిట్టర్. ఎంతో ఈజ్‌తో సిక్సర్లు బాదుతాడు. యువరాజ్ సింగ్ తర్వాత.. అదే స్టైల్లో సిక్స్‌లు కొట్టగల మరో బ్యాటర్ సంజూ శాంసనే. అతడు పరుగుల వరద పారిస్తుంటే చూడటానికి చక్కగా ఉంటుంది’’ అని సంజయ్ బంగర్ కొనియాడాడు.
కాగా జింబాబ్వేతో టీ20 సిరీస్ ద్వారా 2015లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన సంజూ శాంసన్.. ఆ తర్వాత ఆరేళ్లకు వన్డేల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 37 టీ20లు, 16 వన్డేలు ఆడాడు.
వన్డేల్లో ఓ శతకం సాయంతో 510 పరుగులు చేయగా.. టీ20లలో మూడు సెంచరీల సహాయంతో 810 రన్స్ సాధించాడు. ఇదిలా ఉంటే.. జనవరి 22 నుంచి టీమిండియా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ మొదలుపెట్టనుంది.
చదవండి: IND Vs IRE 1st ODI: చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. వన్డేల్లో ఫాస్టెస్ట్‌గా..
Comments
Please login to add a commentAdd a comment