‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అతడికి ఇవ్వాల్సింది.. మూడు ఓవర్లలోనే.. | Ind vs Eng He Bulldozed The Batting: Former Pakistan Batter Disagrees with POTM | Sakshi
Sakshi News home page

‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు వరుణ్‌కి ఎలా ఇస్తారు?.. నా వరకు అతడే బెస్ట్‌!

Published Thu, Jan 23 2025 2:02 PM | Last Updated on Thu, Jan 23 2025 2:53 PM

Ind vs Eng He Bulldozed The Batting: Former Pakistan Batter Disagrees with POTM

ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల పొట్టి ఫార్మాట్‌ సిరీస్‌లో టీమిండియా(India Beat England) శుభారంభం చేసింది. కోల్‌కతా వేదికగా బుధవారం జరిగిన తొలి టీ20లో ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తొలుత బౌలర్లు అద్భుత ప్రదర్శనతో ఇంగ్లండ్‌ను కట్టడి చేయగా.. లక్ష్య ఛేదనలో ఆకాశమే హద్దుగా చెలరేగి అభిషేక్‌ శర్మ విజయాన్ని నల్లేరు మీద నడకలా మార్చాడు.

ఈ మ్యాచ్‌లో సత్తా చాటి భారత్‌ గెలుపులో కీలకపాత్ర పోషించిన అర్ష్‌దీప్‌ సింగ్‌(Arshdeep Singh), వరుణ్‌ చక్రవర్తి, అభిషేక్‌ శర్మలను టీమిండియా అభిమానులు హీరోలుగా అభివర్ణిస్తున్నారు. ఈ ముగ్గురి చక్కటి ఆట తీరు వినోదాన్ని పంచిందంటూ కితాబులిస్తున్నారు. ఇక వీరిలో వరుణ్‌ చక్రవర్తిని ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు వరించిన విషయం తెలిసిందే.

అభిషేక్‌ శర్మ లేదంటే వరుణ్?
ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ బసిత్‌ అలీ(Basit Ali) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన దృష్టిలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు’కు అర్ష్‌దీప్‌ సింగ్‌ మాత్రమే అర్హుడని పేర్కొన్నాడు. ఈ మేరకు తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా మాట్లాడుతూ.. ‘‘ఈ మ్యాచ్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ఎవరు?.. అభిషేక్‌ శర్మ లేదంటే వరుణ్?.. కానేకాదు..

నా వరకైతే అర్ష్‌దీప్‌ మాత్రమే ఈ అవార్డుకు అర్హుడు. ఎందుకంటే.. ఇంగ్లండ్‌ టాపార్డర్‌ను అతడు కుప్పకూల్చాడు. ఒకరకంగా.. కేవలం మూడంటే మూడు ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించేశాడు’’ అని బసిత్‌ అలీ అర్ష్‌దీప్‌ సింగ్‌ను ప్రశంసించాడు.

అత్యుత్తమంగా రాణించాడు
అదే విధంగా.. ‘‘వరుణ్‌ చక్రవర్తి కూడా బాగా బౌలింగ్‌ చేశాడు. మూడు వికెట్లు పడగొట్టాడు. అయినా సరే.. అద్భుతంగా బౌలింగ్‌ చేసింది మాత్రం అర్ష్‌దీప్‌ అనే చెబుతాను. అతడు ఈరోజు అత్యుత్తమంగా రాణించాడు. రవి బిష్ణోయి కూడా ఫరవాలేదు. వికెట్‌ తీయలేకపోయినా కాస్త పొదుపుగానే బౌల్‌ చేశాడు’’ అని బసిత్‌ అలీ పేర్కొన్నాడు.

బౌలర్ల విజృంభణ
కాగా టీమిండియాతో తొలి టీ20లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 132 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు ఫిల్‌ సాల్ట్‌(0), బెన్‌ డకెట్‌(4)లను వచ్చీ రాగానే అర్ష్‌దీప్‌ అవుట్‌ చేశాడు. ఆరంభంలోనే మూడు ఓవర్లు వేసిన ఈ లెఫ్టార్మ్‌ పేసర్‌.. రెండు వికెట్లతో సత్తా చాటాడు. మొత్తంగా నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 17 పరుగులే మాత్రమే ఇచ్చాడు.

మరోవైపు.. వరుణ్‌ చక్రవర్తి నాలుగు ఓవర్లు పూర్తి చేసి 23 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. మిగతా వాళ్లలో హార్దిక్‌ పాండ్యా(2/42), అక్షర్‌ పటేల్‌(2/22) రెండేసి వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక వికెట్‌ కీపర్‌ సంజూ శాంసన్‌ ఆదిల్‌ రషీద్‌ రనౌట్‌లో భాగమయ్యాడు.

బ్యాటర్ల సత్తా
ఇక లక్ష్య ఛేదనలో టీమిండియాకు ఓపెనర్లు సంజూ శాంసన్‌, అభిషేక్‌ శర్మ శుభారంభం అందించారు. సంజూ వేగంగా(20 బంతుల్లో 26) ఆడి జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో అవుట్‌ కాగా.. అభిషేక్‌ మాత్రం ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో దుమ్ములేపాడు. కేవలం 34 బంతుల్లోనే ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లసాయంతో 79 పరుగులు చేశాడు. కెప్టెన్‌ సూర్య​కుమార్‌ యాదవ్‌(0) డకౌట్‌ కాగా.. తిలక్‌ వర్మ(9*) , హార్దిక్‌ పాండ్యా(3*) అజేయంగా నిలిచి పనిపూర్తి చేశారు.

చదవండి: అతడే ఎక్స్‌ ఫ్యాక్టర్‌.. జట్టులో కొనసాగించండి: భారత మాజీ క్రికెటర్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement