అతడే ఎక్స్‌ ఫ్యాక్టర్‌.. జట్టులో కొనసాగించండి: భారత మాజీ క్రికెటర్‌ | X Factor Abhishek Sharma Deserves Longer Rope in T20I Squad: Piyush Chawla | Sakshi
Sakshi News home page

అతడే ఎక్స్‌ ఫ్యాక్టర్‌.. జట్టులో కొనసాగించండి: భారత మాజీ క్రికెటర్‌

Published Thu, Jan 23 2025 1:03 PM | Last Updated on Thu, Jan 23 2025 3:02 PM

X Factor Abhishek Sharma Deserves Longer Rope in T20I Squad: Piyush Chawla

టీమిండియా యువ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మపై భారత మాజీ క్రికెటర్‌ పీయూష్‌ చావ్లా(Piyush Chawla) ప్రశంసలు కురిపించాడు. అతడు గనుక బ్యాట్‌ ఝులిపిస్తే అది కచ్చితంగా మ్యాచ్‌ విన్నింగ్సే అవుతుందని కొనియాడాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడుతున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌ను సుదీర్ఘకాలం టీ20 జట్టులో కొనసాగించాలని టీమిండియా మేనేజ్‌మెంట్‌కు విజ్ఞప్లి చేశాడు.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-2024లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున సత్తా చాటిన అభిషేక్‌ శర్మ.. గతేడాది జూలైలో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. జింబాబ్వేతో టీ20 సిరీస్‌ సందర్భంగా తన తొలి అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ ఆడిన ఈ పంజాబీ బ్యాటర్‌ డకౌట్‌ అయి విమర్శల పాలయ్యాడు. అయితే, అదే వేదికపై శతకంతో చెలరేగి తానేంటో నిరూపించుకున్నాడు.

సంజూకు కెప్టెన్‌ మద్దతు
అయితే, ఆ తర్వాత కూడా అభిషేక్‌ శర్మ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. ఇక టీ20 జట్టులో ఓపెనింగ్‌ జోడీగా సంజూ శాంసన్‌(Sanju Samson)తో పాటు అభిషేక్‌ను మేనేజ్‌మెంట్‌ ఆడిస్తున్న విషయం తెలిసిందే. వికెట్‌ కీపర్‌గా సంజూనే కొనసాగిస్తామని ఇప్పటికే కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ స్పష్టం చేశాడు. దీంతో అతడికి ఢోకా లేనట్లే.

జైస్వాల్‌ రూపంలో ముప్పు
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో గనుక విఫలమైతే అభిషేక్‌ శర్మకు కష్టాలు తప్పవని మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. మరో లెఫ్టాండర్‌ బ్యాటర్‌ అయిన యశస్వి జైస్వాల్‌(Yashasvi Jaiswal) రూపంలో అతడికి ముప్పు పొంచి ఉందని పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో బ్యాట్‌ ఝులిపిస్తేనే మరికొంతకాలం జట్టుతో కొనసాగగలడని అంచనా వేశాడు.

ఇరవై బంతుల్లోనే 
అందుకు తగ్గట్లుగానే అభిషేక్‌ శర్మ తొలి టీ20లోనే దుమ్ములేపాడు. కేవలం ఇరవై బంతుల్లోనే యాభై పరుగులు పూర్తి చేసుకున్న అతడు.. మొత్తంగా 34 బంతులు ఎదుర్కొని 79 రన్స్‌ సాధించాడు. ఇందులో ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్స్‌లు ఉండటం విశేషం.

ఈ నేపథ్యంలో జియో సినిమా షోలో భారత మాజీ స్పిన్నర్‌ పీయూష్‌ చావ్లా అభిషేక్‌ శర్మ ఆట తీరును ప్రశంసించాడు. ‘‘అభిషేక్‌ హై- రిస్క్‌ బ్యాటర్‌. ఒకవేళ అతడు పరుగుల వరద పారించాడంటే.. ఆ మ్యాచ్‌లో జట్టు గెలవాల్సిందే.

ఎక్స్‌- ఫ్యాక్టర్‌ ప్లేయర్‌
అభిషేక్‌ శర్మ ఎక్స్‌- ఫ్యాక్టర్‌ ప్లేయర్‌. 20-22 బంతుల్లోనే 60 పరుగులు చేయగలడు. ఇలాంటి వాళ్లను జట్టులో సుదీర్ఘకాలం కొనసాగించాలి. ఈరోజు అతడు కాస్త నెమ్మదిగానే ఇన్నింగ్స్‌ మొదలుపెట్టి ఉండవచ్చు. కానీ కేవలం ఇరవై బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.

అతడి ఆట తీరు ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదొక చక్కటి నిదర్శనం. అతడి ఆడిన షాట్లు కూడా చూడముచ్చటగా ఉన్నాయి’’ అని పీయూష్‌ చావ్లా కితాబులిచ్చాడు. కాగా ఇంగ్లండ్‌తో కోల్‌కతాలో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన భారత్‌.. ప్రత్యర్థిని 132 పరుగులకే ఆలౌట్‌ చేసింది. 

అనంతరం.. లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా 12.5 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. అభిషేక్‌ శర్మ(79) మెరుపు ఇన్నింగ్స్‌ కారణంగా వేగంగా టార్గెట్‌ను ఛేదించింది. ఇక ఇంగ్లండ్‌ను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించిన మూడు వికెట్ల వీరుడు, మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తికి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.  

చదవండి: అతడొక సూపర్‌స్టార్‌.. మా ఓటమికి కారణం అదే: బట్లర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement