ఇంగ్లండ్‌తో ఐదో టీ20(India vs England)లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) సృష్టించిన పరుగుల విధ్వంసాన్ని ఎవరూ అంత తేలికగా మర్చిపోలేరు. సహచరులు విఫలమైన చోట.. ‘చేతికే బ్యాట్ మొలిచిందా’ అన్నట్లుగా.. పొట్టి ఫార్మాట్‌కే వన్నె తెచ్చేలా అతడి ఇన్నింగ్స్ సాగింది.
మిగిలిన భారత ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టిన వేళ.. తను మాత్రం ‘తగ్గేదేలే’ అన్నట్లు ప్రత్యర్థి బౌలింగ్‌ను చితక్కొట్టిన విధానం టీ20 ప్రేమికులకు అసలైన మజా అందించింది. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
నితీశ్ రెడ్డి ఊరమాస్ కామెంట్!
ఈ క్రమంలో అభిషేక్ శర్మను ఉద్దేశించి సహచర ఆటగాడు, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌మేట్ నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. సలార్ సినిమాలో ప్రభాస్ కత్తి పట్టుకుని ఉన్న ఫొటోతో పాటు.. బ్యాట్‌తో అభిషేక్ పోజులిస్తున్న ఫొటోను పంచుకున్న నితీశ్.. ‘‘మెంటల్ నా కొడుకు’’ అంటూ క్యాప్షన్ జతచేశాడు.
ఇందుకు సెల్యూట్ ఎమోజీతో పాటు లవ్ సింబల్ జతచేశాడు. పూనకం వస్తే అతడిని ఎవరూ ఆపలేరన్న అర్థంలో అభిషేక్ ఇన్నింగ్స్‌ను ప్రశంసిస్తూ ఇలా ఊరమాస్ కామెంట్ పెట్టాడు. అయితే, కొంతమంది నెటిజన్లు మాత్రం నితీశ్ వాడిన పదాన్ని తప్పుబడుతుండగా.. మరికొందరు అభిషేక్ ఆట తీరును వర్ణించేందుకే ఆ పదం వాడాడని పేర్కొంటున్నారు.
150 పరుగుల తేడాతో మట్టికరిపించి
కాగా ఇప్పటికే ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ను టీమిండియా 3-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం నాటి నామమాత్రపు ఐదో టీ20లోనూ సూర్యకుమార్ సేన సత్తా చాటింది.
సమిష్టి ప్రదర్శనతో బట్లర్ బృందాన్ని 150 పరుగుల తేడాతో మట్టికరిపించి ఏకపక్ష విజయం సాధించింది. ప్రఖ్యాత వాంఖడే మైదానంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోరు సాధించింది. ఇందుకు ప్రధాన కారణం అభిషేక్ శర్మ.
ఆది నుంచే ఆకాశమే హద్దుగా చెలరేగిన అభిషేక్ శర్మ.. పదిహేడు బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కు అందుకున్నాడు. అదే జోరులో 37 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. మొత్తంగా 54 బంతుల్లో 135 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, పదమూడు సిక్స్‌లు ఉన్నాయి.
అభిషేక్ సునామీ ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా తొమ్మిది వికెట్ల నష్టానికి 247 పరుగులు సాధించింది. అయితే, లక్ష్య ఛేదనలో ఆది నుంచే తడబడ్డ ఇంగ్లండ్ 97 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా టీమిండియాకు ఘన విజయం దక్కింది. దీంతో 4-1తో ఈ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను సూర్యకుమార్ సేన సొంతం చేసుకుంది.
కాగా అంతర్జాతీయ టీ20లలో అభిషేక్ శర్మకు రెండో శతకం. ఇంతకు ముందు జింబాబ్వేపై అతడు సెంచరీ సాధించాడు. ఇక ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడుతున్న అభిషేక్ శర్మ.. గత సీజన్‌లో పరుగుల వరద పారించాడు. మరో ఓపెనర్ ట్రవిస్ హెడ్‌తో కలిసి విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగి.. జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు.
గాయం వల్ల దూరం
ఇక విశాఖపట్నం కుర్రాడు, పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి కూడా సన్‌రైజర్స్‌కే ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. టీమిండియాలోనూ ఇద్దరూ కలిసే ఆడుతున్నారు.
ఈ నేపథ్యంలో అభిషేక్‌తో స్నేహం దృష్ట్యా ఈ మేర కామెంట్ చేయడం గమనార్హం. కాగా నితీశ్ రెడ్డి కూడా ఇంగ్లండ్‌తో టీ20లకు సెలక్ట్ అయ్యాడు. కోల్‌కతా మ్యాచ్‌లో కూడా భాగమయ్యాడు. అయితే, గాయం కారణంగా అనంతరం జట్టుకు దూరమయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment