Ind vs Eng: టీమిండియాకు ఎదురుదెబ్బ.. విధ్వంసకర వీరుడికి గాయం! | Ind vs Eng: Abhishek Sharma Twists ankle during training Blow To Team India | Sakshi
Sakshi News home page

Ind vs Eng: టీమిండియాకు ఎదురుదెబ్బ.. విధ్వంసకర వీరుడికి గాయం!

Published Sat, Jan 25 2025 10:35 AM | Last Updated on Sat, Jan 25 2025 10:54 AM

Ind vs Eng: Abhishek Sharma Twists ankle during training Blow To Team India

ఇంగ్లండ్‌తో రెండో టీ20కి టీమిండియా(India Vs England 2nd T20) పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. విజయంతో ఆరంభించిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆధిపత్యమే లక్ష్యంగా చెపాక్‌ బరిలో దిగనుంది. అయితే, చెన్నై మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది.

కోల్‌కతా వేదికగా జరిగిన తొలి టీ20లో విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగిన అభిషేక్‌ శర్మ(Abhishek Sharma) గాయపడినట్లు సమాచారం. ప్రాక్టీస్‌ సెషన్‌లో భాగంగా శుక్రవారం సాయంత్రం చిదంబరం స్టేడియంలో నెట్స్‌లో టీమిండియా ఆటగాళ్లు తీవ్రంగా శ్రమించారు.

చీలమండ నొప్పి
ఈ సందర్భంగానే అభిషేక్‌ శర్మ గాయపడినట్లు తెలుస్తోంది. అతడి పాదం మెలిక పడగా.. చీలమండ నొప్పి(Ankle Injury)తో విలవిల్లాడాడు. ఈ క్రమంలో వెంటనే ఫిజియోలు వచ్చి అభిషేక్‌ను పరీక్షించారు. అనంతరం అతడు మైదానం వీడాడు. అయితే, మళ్లీ నెట్‌ సెషన్‌లో బ్యాటింగ్‌కు కూడా రాలేదు. ఈ నేపథ్యంలో శనివారం నాటి రెండో టీ20కి అభిషేక్‌ శర్మ అందుబాటులో ఉంటాడా లేదా అన్న అంశంపై సందిగ్దం నెలకొంది.

సంజూకు జోడీ ఎవరు?
ఒకవేళ అభిషేక్‌ శర్మ గనుక దూరమైతే సంజూ శాంసన్‌తో కలిసి కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌  ఓపెనర్‌గా వస్తాడా? లేదంటే ప్రయోగాత్మకంగా ఇంకెవరినైనా టాపార్డర్‌కు ప్రమోట్‌ చేస్తాడా? అనే చర్చ జరుగుతోంది. కాగా ఈడెన్‌ గార్డెన్స్‌లో బుధవారం ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

తొలి టీ20లో అభిషేక్‌ ధనాధన్‌
టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన భారత జట్టు.. బట్లర్‌ బృందాన్ని 132 పరుగులకే ఆలౌట్‌ చేసింది. అనంతరం.. లక్ష్య ఛేదనలో సంజూ శాంసన్‌(20 బంతుల్లో 26) ఫర్వాలేదనిపించగా.. మరో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ ధనాధన్‌ దంచికొట్టాడు. 

మొత్తంగా 34 బంతులు ఎదుర్కొన్న 24 ఏళ్ల ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌.. 79 పరుగులతో దుమ్ములేపాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లతో పాటు ఏకంగా ఎనిమిది సిక్సర్లు ఉండటం విశేషం.

మిగతా వాళ్లలో కెప్టెన్‌ సూర్యకుమార్‌ డకౌట్‌ కాగా.. తిలక్‌ వర్మ 19, హార్దిక్‌ పాండ్యా 3 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయాన్ని ఖరారు చేశారు. ఈ క్రమంలో కేవలం మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా.. 12.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.

షమీ వస్తాడా?
కాగా టీమిండియలో పునగామనం కోసం ఎదురుచూస్తున్న సీనియర్‌ పేస్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీకి కోల్‌కతాలో మొండిచేయి ఎదురైన విషయం తెలిసిందే. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన క్రమంలో షమీకి చోటు ఇవ్వలేకపోయినట్లు మేనేజ్‌మెంట్‌ వర్గాలు తెలిపాయి. ఇక అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అద్భుత గణాంకాలు కలిగి ఉన్న యువ పేసర్‌ అర్ష్‌దీప్‌ ఒక్కడికే తుదిజట్టులో దక్కగా.. షమీ బెంచ్‌కే పరిమితమయ్యాడు.

అయితే, తొలి టీ20లో ప్రభావం చూపలేకపోయినప్పటికీ రవి బిష్ణోయికి మరో అవకాశం ఇచ్చేందుకు యాజమాన్యం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. చెపాక్‌ పిచ్‌ స్పిన్నర్లకు ఎక్కువగా అనుకూలిస్తుంది కాబట్టి వరుణ్‌ చక్రవర్తి, అక్షర్‌ పటేల్‌లతో పాటు అతడినీ రెండో టీ20లో కొనసాగించే అవకాశం ఉంది. 

ఇక అభిషేక్‌ శర్మ గాయంతో దూరమైతే గనుక షమీని తుదిజట్టుకు ఎంపిక చేసే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా పొదుపుగా బౌలింగ్‌ చేయలేకపోయాడు. ఆరంభ ఓవర్లలో అర్ష్‌దీప్‌ త్వరత్వరగా వికెట్లు తీశాడు కాబట్టి సరిపోయింది. 

అందుకే ఈసారి అర్ష్‌దీప్‌తో పాటు షమీని కొత్త బంతితో బరిలోకి దించాలనే యోచనలో మేనేజ్‌మెంట్‌ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా చెన్నైలో చిదంబరం స్టేడియం(చెపాక్‌)లో శనివారం రాత్రి ఏడు గంటలకు ఇండియా- ఇంగ్లండ్‌ మధ్య రెండో టీ20 ఆరంభం కానుంది.

చదవండి: భారత్‌తో రెండో టీ20: ఇంగ్లండ్‌ తుదిజట్టు ప్రకటన.. అతడిపై వేటు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement