దక్షిణాఫ్రికా వీరుడికి ఆసియా నోబెల్ ప్రదానం
తైపీ: దక్షిణాఫ్రికాలో జాతివివక్షకు వ్యతిరేకంగా పోరాడిన అల్బీ సాచ్స్, నార్వేలో పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేసిన ఆ దేశ మాజీ ప్రధాని గ్రో హాలెమ్ బ్రంట్‌లాండ్ సహా ఐదుగురికి గురువారం ఆసియా నోబెల్‌గా పేరొందిన ‘తాంగ్ ప్రైజ్’ను తైవాన్ అధ్యక్షుడు మా యింగ్ జ్యూ ప్రదానం చేశారు. పర్యావరణం, మానవహక్కులు, వైద్యం, చైనా చరిత్ర.. రంగాల్లో అద్వితీయ సేవలందించిన వారికి ఈ అవార్డ్‌ను ప్రకటించారు.
2012లో తైవాన్‌లో అత్యంత ధనవంతుల్లో ఒకరైన సామ్యూల్ యిన్ ప్రసిద్ధ చైనా రాజవంశం ‘తాంగ్’ పేరుమీద ఈ అవార్డ్‌ను నెలకొల్పారు. పురస్కార గ్రహీతలకు 5 కోట్ల తైవాన్ డాలర్లు(రూ.10.33 కోట్లు) అందిస్తారు. ఇది నోబెల్ విజేతలకు లభించే మొత్తంకన్నా ఎక్కువ. 2014 నుంచే ఈ అవార్డులను ఇవ్వడం ప్రారంభించారు.