Alembic
-
లారస్ ల్యాబ్స్- అలెంబిక్.. భలే జోరు
దేశీ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో దూసుకెళుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు హెల్త్‌కేర్ రంగ కౌంటర్లు మరింత దూకుడు చూపుతున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో లారస్ ల్యాబ్స్ షేరు తాజాగా చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. ఇక మరోపక్క అలెంబిక్ లిమిటెడ్ సైతం 52 వారాల గరిష్టాన్ని తాకింది. ఇతర వివరాలు చూద్దాం.. లారస్ ల్యాబ్స్ లిమిటెడ్ వరుసగా నాలుగో రోజు లారస్ ల్యాబ్స్ షేరు జోరందుకుంది. ఎన్ఎస్ఈలో తొలుత 4.5 శాతం జంప్‌చేసింది. రూ. 1,265కు చేరింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. ప్రస్తుతం 2.3 శాతం ఎగసి రూ. 1,239 వద్ద ట్రేడవుతోంది. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో పటిష్ట ఫలితాలు సాధించడంతో ఈ కౌంటర్‌కు డిమాండ్ కొనసాగుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. వెరసి గత నాలుగు నెలల్లో ఈ షేరు 171 శాతం ర్యాలీ చేసింది. ఇదే కాలంలో సెన్సెక్స్ 19 శాతంమే బలపడింది. కాగా.. రూ. 10 ముఖ విలువగల ఒక్కో షేరునీ రూ. 2 ముఖ విలువగల 5 షేర్లుగా విభజించనుంది. ఇందుకు సెప్టెంబర్ 30 రికార్డ్ డేట్‌గా ప్రకటించింది. అలెంబిక్ లిమిటెడ్ ఈ నెల మొదట్లో ప్రమోటర్ గ్రూప్ సంస్థ అదనపు వాటాను కొనుగోలు చేసినట్లు వెల్లడయ్యాక జోరందుకున్న అలెంబిక్ లిమిటెడ్ మరోసారి దూకుడు చూపుతోంది. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 12 శాతం దూసుకెళ్లి రూ. 115కు చేరింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ఈ నెలలో ఇప్పటివరకూ 30 శాతం ర్యాలీ చేసింది. ఓపెన్ మార్కెట్ ద్వారా ఈ నెల 2-4 మధ్య నిరయూ లిమిటెడ్ అదనంగా 0.6 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు అలెంబిక్ ఇప్పటికే తెలియజేసింది. నిజానికి జూన్‌కల్లా కంపెనీలో ప్రమోటర్ల వాటా 67.62 శాతం నుంచి 69.57 శాతానికి ఎగసింది. ఈ నేపథ్యంలో అలెంబిక్ కౌంటర్ జోరు కొనసాగుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. -
అలెంబిక్ ఫార్మా- ర్యాలీస్.. దూకుడు
అలెంబిక్ ఫార్మాస్యూటికల్స్ డయాబెటిక్ ఔషధానికి యూఎస్ఎఫ్డీఏ నుంచి సూత్రప్రాయ అనుమతి లభించినట్లు వెల్లడించడంతో అలెంబిక్ ఫార్మాస్యూటికల్స్ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 5.3 శాతం జంప్‌చేసి రూ. 1029 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1040 వరకూ దూసుకెళ్లింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ఎంపగ్లిఫోజిన్, మెట్ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ ట్యాబ్లెట్లకు యూఎస్ నుంచి అనుమతి లభించినట్లు అలెంబిక్ తెలియజేసింది. వీటిని 5ఎంజీ/500 ఎంజీ, 5ఎంజీ/1000 ఎంజీ, 12.5ఎంజీ/500 ఎంజీ, 12.5ఎంజీ/1000 ఎంజీ డోసేజీలలో విక్రయించనున్నట్లు వెల్లడించింది. బోరింగర్ ఫార్మా తయారీ సింజార్డీ ట్యాబ్లెట్లకు ఇవి జనరిక్ వెర్షన్కాగా.. గ్లైసమిక్ నియంత్రణకు వినియోగపడుతుందని విశ్లేషకులు పేర్కొన్నారు. వీటికి 17.2 కోట్ల డాలర్ల(రూ. 1300 కోట్లు) మార్కెట్ ఉన్నట్లు అంచనా. ర్యాలీస్ ఇండియా ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో సుప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా అదనంగా 7.25 లక్షల షేర్లను కొనుగోలు చేసినట్లు వెల్లడికావడంతో ర్యాలీస్ ఇండియా కౌంటర్ జోరందుకుంది. ఈ టాటా గ్రూప్ కంపెనీలో తాజాగా రాకేష్ వాటా 10.31 శాతానికి ఎగసినట్లు తెలుస్తోంది. వెరసి 2016 మార్చి తదుపరి ర్యాలీస్ ఇండియాలో తిరిగి రాకేష్ వాటా భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో ర్యాలీస్ ఇండియా షేరు తొలుత ఎన్ఎస్ఈలో 5 శాతం జంప్‌చేసి రూ. 301ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 3 శాతం పెరిగి రూ. 295 వద్ద ట్రేడవుతోంది. ఈ ఏడాది మార్చి 24న నమోదైన కనిష్టం రూ. 127 నుంచి ర్యాలీస్ ఇండియా కౌంటర్ 136 శాతం ర్యాలీ చేయడం విశేషం! -
అలెంబిక్ ఫార్మా- బేయర్ క్రాప్.. భళా
గతంలో సూచనప్రాయ అనుమతి పొందిన డిఫిరాజిరాక్స్ ట్యాబ్లెట్లకు తుది అనుమతి పొందినట్లు వెల్లడించడంతో అలెంబిక్ ఫార్మాస్యూటికల్స్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోపక్క సస్యరక్షణ ఉత్పత్తుల విక్రయానికి ఎఫ్ఎంసీజీ దిగ్గజంతో జత కట్టినట్లు వెల్లడించడంతో బేయర్ క్రాప్‌సైన్స్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. అలెంబిక్ ఫార్మాస్యూటికల్స్ థలసేమియా సంబంధ చికిత్సకు వినియోగించగల ఏఎన్‌డీఏ(డిఫిరాజిరాక్స్ ట్యాబ్లెట్ల)కు యూఎస్ఎఫ్డీఏ తుది అనుమతి లభించినట్లు హెల్త్‌కేర్ కంపెనీ అలెంబిక్ ఫార్మా తాజాగా పేర్కొంది. నోవర్తిస్ తయారీ జడెను ట్యాబ్లెట్లకు జనరిక్ వెర్షన్ అయిన ఈ ట్యాబ్లెట్లను 180 ఎంజీ డోసేజీలో విక్రయించేందుకు వీలు చిక్కనున్నట్లు తెలియజేసింది. కంపెనీ ఇప్పటికే 90 ఎంజీ, 360 ఎంజీ డోసేజీలలో విక్రయించేందుకు అనుమతి పొందింది. 180 ఎంజీ ట్యాబ్లెట్లకు 5.3 కోట్ల డాలర్ల(రూ. 400 కోట్లు) మార్కెట్ ఉన్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో అలెంబిక్ ఫార్మా షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 4 శాతం జంప్‌చేసి రూ. 926 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 944 వరకూ ఎగసింది. తద్వారా 52 వారాల గరిష్టాన్ని తాకింది. బేయర్ క్రాప్‌సైన్స్ సస్యరక్షణ ఉత్పత్తుల విక్రయానికి ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీతో జత కట్టినట్లు ఆగ్రో కెమికల్స్ దిగ్గజం బేయర్ క్రాప్‌సైన్స్ తాజాగా పేర్కొంది. దీనిలో భాగంగా ఐటీసీకి చెందిన ఈచౌపల్ ద్వారా పంటల పరిరక్షణకు సంబంధించిన ఉత్పత్తులను దేశవ్యాప్తంగా మరింత మంది రైతులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలియజేసింది. ఇందుకు వీలుగా ఇప్పటికే మైసూరులో పరిశీలనాత్మక ప్రాజెక్టును చేపట్టినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో బేయర్ క్రాప్‌సైన్స్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 4 శాతం జంప్‌చేసి రూ. 5708 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 5718 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టంకావడం గమనార్హం! -
అలెంబిక్ ఫార్మా... షేర్‌కు రూ. 4 డివిడెండ్
న్యూఢిల్లీ: అలెంబిక్ ఫార్మా కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.94 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో 93 కోట్ల నికర లాభం వచ్చిందని అలెంబిక్ ఫార్మా తెలిపింది. ఆదాయం రూ.741 కోట్ల నుంచి రూ.853 కోట్లకు ఎగసిందని అలెంబిక్ ఫార్మా ఎమ్డీ ప్రణవ్ అమిన్ తెలిపారు. రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.4 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.403 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.413 కోట్లకు పెరిగిందని ప్రణవ్ తెలిపారు. ఆదాయం రూ.3,135 కోట్ల నుంచి రూ.3,131 కోట్లకు తగ్గిందని పేర్కొన్నారు. వివిధ సమస్యలున్నప్పటికీ, అమెరికా జనరిక్ వ్యాపారం 45 శాతం వృద్ధి చెందిందని వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఎన్ఎస్ఈలో అలెంబిక్ ఫార్మా షేర్0.2 శాతం లాభంతో రూ.482 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ.468 వద్ద ఏడాది కనిష్ట స్థాయిని తాకింది. -
నాట్కో, అలెంబిక్లకు లైన్ క్లియర్
పేటెంట్ ఔషధాలను ఎగుమతి చేయొచ్చు: ఢిల్లీ హైకోర్టు తీర్పు న్యూఢిల్లీ: ప్రముఖ ఔషధ కంపెనీలు నాట్కో, అలెంబిక్ కంపెనీలకు ఢిల్లీ హైకోర్టు ఊరట కల్పించింది. జర్మన్ ఔషధ కంపెనీ బేయర్స్కు చెందిన రెండు పేటెంట్ ఔషధాలను ఈ సంస్థలు తయారు చేసి క్లినికల్ పరీక్షల కోసం, విదేశీ నియంత్రణ సంస్థల ఆమోదం కోసం ఎగుమతి చేసేందుకు కోర్టు అనుమతిస్తూ హైకోర్టు బుధ వారం తీర్పు జారీ చేసింది. దేశీయ జనరిక్ ఔషధ తయారీ దారులు పేటెంట్ రక్షణలో ఉన్న ఔషధాలను నియంత్రణ సంస్థల ఆమోదం కోసం, క్లినికల్ పరీక్షల కోసం వాటిని తయారు చేసి, విక్రయించి, ఎగుమతి చేసే ప్రాథమిక హక్కును కలిగి ఉన్నాయని కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఇందుకు పేటెంట్స్ చట్టంలోని సెక్షన్ 107ఏ వీలు కల్పిస్తోందని కోర్టు ఉదహరించింది. ఈ ప్రాథమిక హక్కుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(జి) రక్షణ కూడా కల్పిస్తోందని... చట్టం చెబితే తప్ప ఔషధ విక్రయాలను అడ్డుకోలేరని జస్టిస్ రాజీవ్ సహాయ్ ఎండ్లా స్పష్టం చేశారు. కాగా, ఔషధాలకున్న పేటెంట్ హక్కులను పరిగణనలోకి తీసుకోవాలని, సెక్షన్ 107ఏలో పేర్కొన్న మేరకు మినహా ఇతర అవసరాలకు పేటెంట్ రక్షణలో ఉన్న వాటిని ఎగుమతి చేయరాదని నాట్కో, అలెంబిక్ కంపెనీలను కోర్టు ఆదేశించింది. పేటెంట్ ఉల్లంఘన కాదు... బేయర్స్ కేన్సర్ ఔషధమైన సోరాఫెనిబ్ను నెక్సావర్ పేరుతో మార్కెట్ చేస్తోంది. దీనికి పేటెంట్ రక్షణ ఉంది. దీనికి జనరిక్ వెర్షన్ అయిన సోర్ఫెనట్ను నాట్కో ఎగుమతి చేసింది. అలాగే, బేయర్స్కు చెందిన రక్తాన్ని పలుచన చేసే రివరోక్సాబాన్ జనరిక్ రూపాన్ని అలెంబిక్ కంపెనీ ఎగుమతి చేసింది. దీంతో నాట్కో, అలెంబిక్ పేటెంట్ ఉల్లంఘనకు పాల్పడ్డాయని ఆరోపిస్తూ బేయర్స్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను కోర్టు కొట్టివేస్తూ 107 సెక్షన్ఏలో పేర్కొన్న అవసరాలకు పేటెంట్ ఔషధాలను ఎగుమతి చేయడం ఉల్లంఘనకు పాల్పడినట్టు కాదని, దీన్ని అడ్డకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా, పేటెంట్ ఔషధాన్ని నియంత్రణ సంస్థల అవసరాల కోసమంటూ ఎగుమతి చేసేం దుకు ఒక్కసారి అనుమతిస్తే, ఆ అవసరాలకే వాటిని వినియోగించేలా కోర్టు హామీ ఇవ్వలేదని బేయర్స్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీన్ని కూడా కోర్టు తిరస్కరించింది.