గతంలో సూచనప్రాయ అనుమతి పొందిన డిఫిరాజిరాక్స్ ట్యాబ్లెట్లకు తుది అనుమతి పొందినట్లు వెల్లడించడంతో అలెంబిక్ ఫార్మాస్యూటికల్స్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోపక్క సస్యరక్షణ ఉత్పత్తుల విక్రయానికి ఎఫ్‌ఎంసీజీ దిగ్గజంతో జత కట్టినట్లు వెల్లడించడంతో బేయర్ క్రాప్‌సైన్స్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..
అలెంబిక్ ఫార్మాస్యూటికల్స్
థలసేమియా సంబంధ చికిత్సకు వినియోగించగల ఏఎన్‌డీఏ(డిఫిరాజిరాక్స్ ట్యాబ్లెట్ల)కు యూఎస్‌ఎఫ్‌డీఏ తుది అనుమతి లభించినట్లు హెల్త్‌కేర్ కంపెనీ అలెంబిక్ ఫార్మా తాజాగా పేర్కొంది. నోవర్తిస్ తయారీ జడెను ట్యాబ్లెట్లకు జనరిక్ వెర్షన్ అయిన ఈ ట్యాబ్లెట్లను 180 ఎంజీ డోసేజీలో విక్రయించేందుకు వీలు చిక్కనున్నట్లు తెలియజేసింది. కంపెనీ ఇప్పటికే 90 ఎంజీ, 360 ఎంజీ డోసేజీలలో విక్రయించేందుకు అనుమతి పొందింది. 180 ఎంజీ ట్యాబ్లెట్లకు 5.3 కోట్ల డాలర్ల(రూ. 400 కోట్లు) మార్కెట్ ఉన్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో అలెంబిక్ ఫార్మా షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 4 శాతం జంప్‌చేసి రూ. 926 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 944 వరకూ ఎగసింది. తద్వారా 52 వారాల గరిష్టాన్ని తాకింది.
బేయర్ క్రాప్‌సైన్స్
సస్యరక్షణ ఉత్పత్తుల విక్రయానికి ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీతో జత కట్టినట్లు ఆగ్రో కెమికల్స్ దిగ్గజం బేయర్ క్రాప్‌సైన్స్ తాజాగా పేర్కొంది. దీనిలో భాగంగా ఐటీసీకి చెందిన ఈచౌపల్ ద్వారా పంటల పరిరక్షణకు సంబంధించిన ఉత్పత్తులను దేశవ్యాప్తంగా మరింత మంది రైతులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలియజేసింది. ఇందుకు వీలుగా ఇప్పటికే మైసూరులో పరిశీలనాత్మక ప్రాజెక్టును చేపట్టినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో బేయర్ క్రాప్‌సైన్స్ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 4 శాతం జంప్‌చేసి రూ. 5708 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 5718 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టంకావడం గమనార్హం!
Comments
Please login to add a commentAdd a comment