నాట్కో, అలెంబిక్‌లకు లైన్ క్లియర్
పేటెంట్ ఔషధాలను ఎగుమతి చేయొచ్చు: ఢిల్లీ హైకోర్టు తీర్పు
న్యూఢిల్లీ: ప్రముఖ ఔషధ కంపెనీలు నాట్కో, అలెంబిక్ కంపెనీలకు ఢిల్లీ హైకోర్టు ఊరట కల్పించింది. జర్మన్ ఔషధ కంపెనీ బేయర్స్‌కు చెందిన రెండు పేటెంట్ ఔషధాలను ఈ సంస్థలు తయారు చేసి క్లినికల్ పరీక్షల కోసం, విదేశీ నియంత్రణ సంస్థల ఆమోదం కోసం ఎగుమతి చేసేందుకు కోర్టు అనుమతిస్తూ హైకోర్టు బుధ వారం తీర్పు జారీ చేసింది. దేశీయ జనరిక్ ఔషధ తయారీ దారులు పేటెంట్ రక్షణలో ఉన్న ఔషధాలను నియంత్రణ సంస్థల ఆమోదం కోసం, క్లినికల్ పరీక్షల కోసం వాటిని తయారు చేసి, విక్రయించి, ఎగుమతి చేసే ప్రాథమిక హక్కును కలిగి ఉన్నాయని కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
ఇందుకు పేటెంట్స్ చట్టంలోని సెక్షన్ 107ఏ వీలు కల్పిస్తోందని కోర్టు ఉదహరించింది. ఈ ప్రాథమిక హక్కుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(జి) రక్షణ కూడా కల్పిస్తోందని... చట్టం చెబితే తప్ప ఔషధ విక్రయాలను అడ్డుకోలేరని జస్టిస్ రాజీవ్ సహాయ్ ఎండ్లా స్పష్టం చేశారు. కాగా, ఔషధాలకున్న పేటెంట్ హక్కులను పరిగణనలోకి తీసుకోవాలని, సెక్షన్ 107ఏలో పేర్కొన్న మేరకు మినహా ఇతర అవసరాలకు పేటెంట్ రక్షణలో ఉన్న వాటిని ఎగుమతి చేయరాదని నాట్కో, అలెంబిక్ కంపెనీలను కోర్టు ఆదేశించింది.
పేటెంట్ ఉల్లంఘన కాదు...
బేయర్స్ కేన్సర్ ఔషధమైన సోరాఫెనిబ్‌ను నెక్సావర్ పేరుతో మార్కెట్ చేస్తోంది. దీనికి పేటెంట్ రక్షణ ఉంది. దీనికి జనరిక్ వెర్షన్ అయిన సోర్‌ఫెనట్‌ను నాట్కో ఎగుమతి చేసింది. అలాగే, బేయర్స్‌కు చెందిన రక్తాన్ని పలుచన చేసే రివరోక్సాబాన్ జనరిక్ రూపాన్ని అలెంబిక్ కంపెనీ ఎగుమతి చేసింది. దీంతో నాట్కో, అలెంబిక్ పేటెంట్ ఉల్లంఘనకు పాల్పడ్డాయని ఆరోపిస్తూ బేయర్స్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిటిషన్‌ను కోర్టు కొట్టివేస్తూ 107 సెక్షన్‌ఏలో పేర్కొన్న అవసరాలకు పేటెంట్ ఔషధాలను ఎగుమతి చేయడం ఉల్లంఘనకు పాల్పడినట్టు కాదని, దీన్ని అడ్డకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా, పేటెంట్ ఔషధాన్ని నియంత్రణ సంస్థల అవసరాల కోసమంటూ ఎగుమతి చేసేం దుకు ఒక్కసారి అనుమతిస్తే, ఆ అవసరాలకే వాటిని వినియోగించేలా కోర్టు హామీ ఇవ్వలేదని బేయర్స్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీన్ని కూడా కోర్టు తిరస్కరించింది.