Aleppo city
-
కళ్లముందే చికెన్ క్రేట్లు తగులబడుతుంటే...
సిరియా: అంతర్యుద్ధంతో రగిలిపోతున్న సిరియాలో ఓ పక్క లక్షలాది మంది శరణార్థులు ఆకలితో అలమటిస్తుంటే మరోపక్క అమెరికా లేబుళ్లతో వచ్చిన వందలాది చికెన్ క్రేట్లను ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు తగులబెట్టారు. అలెప్పో నగరం సమీపంలో చోటు చేసుకున్న ఈ ఘటనను వీడియోలుతీసి మరీ ఉగ్రవాదులు శుక్రవారం విడుదల చేశారు. ముస్లిం లా ప్రకారం హలాల్ చేసిన చికెన్ క్రేట్లను ఆకలితో అలమటిస్తున్న తమను పట్టించుకోకుండా తమ కళ్ల ముందే తగులబెట్టారని అక్కడికి సమీపంలోని శిబిరాల్లో తలదాచుకున్న శరణార్థులు తెలియజేశారు. అధికారిక అంచనాల ప్రకారం ఆరున్నర లక్షల మంది శరణార్థులు సిరియా శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఆకలితో అలమటిస్తున్న వారిని ఆదుకునేందుకు ఐక్యరాజ్య సమితి సహా పలు అంతర్జాతీయ సామాజిక సంస్థలు తమకు అందుబాటులోవున్న వనరుల ప్రకారం ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్నాయి. అయితే అమెరికా లేబుళ్లుగల ఏ పదార్థాన్ని ఉగ్రవాదులు తమ దేశంలోకి అనుమతించడం లేదు. రోడ్డు మార్గాన వచ్చిన ఆహార పదార్థాలను కూడా వారు వదిలిపెట్టడం లేదు. వాటిని రవాణా వాహనాల నుంచి గోతుల్లోకి దొర్లించి అగ్నికి ఆహుతి చేస్తున్నారు. అలెప్పో రాష్ట్రంలోని అల్ హెస్బా చెక్‌పోస్టు వద్ద రవాణా వాహనాల నుంచి చికెన్ బాక్సులను అన్లోడ్ చేసి వాటిని గుంతల్లో పడేస్తున్న వీడియో దృశ్యాలను కూడా అలెప్పోలోని ఐఎస్ఐఎస్ ప్రచార విభాగం విడుదల చేసింది. -
సిరియాలో హింసాత్మక ఘటనల్లో 17 మంది మృతి
సిరియాలోని అలెప్పో నగరంలో తిరుగుబాటుదారులు రక్తపాతాన్ని సృష్టించారు. దాంతో 17 మంది మరణించారు. మృతుల్లో జడ్జి, మిలటరీ ఉన్నతాధికారి ఉన్నారని స్థానిక మీడియా గురువారం వెల్లడించింది. అలెప్పో నగరంలోని మెరిడియన్, అల్ఫర్కన్ ప్రాంతాల్లోని జనవాసాలపై తిరుగుబాటుదారులు రాకెట్ లాంచర్లతో దాడులు చేశారని తెలిపింది. అందుకు సంబంధించిన వీడియో ఫూటేజ్‌లను స్థానిక టీవీలలో ప్రసారం చేసింది. ఆ దాడుల్లో మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారు నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపింది.