మా ప్రభుత్వమే ఉంది...జాగ్రత్త
టీ డీపీ నేత అనుచరుడి హల్చల్
కైకలూరు : చెట్టుపేరు చెప్పి కాయలమ్ముకుంటున్న చందంగా....అధికార పార్టీ నాయకుల పేరు చెప్పుకుని అనుచరగణం అక్రమాలకు తెరదీస్తున్నారు. పైనున్నది మా ప్రభుత్వమేనని, మాట వినకపోతే మీ పని అయిపోతుందంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. కైకలూరు ముస్లిలకు చెందిన ఓ సొసైటీ చెరువు వివాదంలో టీడీపీకి చెందిన ఓ నాయకుని ప్రధాన అనుచరుడు జోక్యం చేసుకుంటున్నాడు.
1976లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఆటపాక సమీపంలోని కోమటిలంక గ్రామంలో 70 ఎకరాలను ఫక్రూద్ధిన్ అలీ అహ్మద్ సొసైటీకి కేటాయించారు. మొత్తం 89 మంది సభ్యులున్నారు. అప్పట్లో అందరూ కలసి చేపల చెరువును తవ్వుకున్నారు. కొల్లేరు ఆపరేషన్ సమయంలో ఈ చెరువును ధ్వంసం చేశారు. సొసైటీ చెరువులను తిరిగి పంపిణీ చేసే అవకాశం ఉందని తెలియడంతో ఎప్పటికప్పుడు ఆడిట్ చేయిస్తూ రెన్యూవల్ చేసుకున్నారు. సొసైటీ ప్రారంభంలోని సభ్యులు మరణిస్తే వారి భార్యలు, వారసులను సభ్యులుగా చేర్చుకున్నారు.
వీరిలో ఎక్కువ మంది వితంతువులున్నారు. ఇదిలా ఉంటే టీడీపీ నాయకుని అనుచరుడు మరో 20 మందిని సొసైటీలో సభ్యులుగా చేర్చాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నాడు. దీనిపై సభ్యులు ప్రశ్నిస్తే మంత్రి, ఎంపీల పేర్లు చెప్పి బెదిరిస్తున్నాడు. దీంతో శనివారం సొసైటీ అధ్యక్షుడు మహ్మద్ సర్ధార్ సభ్యులతో కలసికైకలూరు చిన్నమసీదులో సమావేశం నిర్వహించారు.
టీడీపీ నాయకుల పేర్లు చెప్పి బెదిరిస్తున్న వ్యక్తినిసభ్యులందరూ ఎదుర్కోవాలని తీర్మానం చేశారు. సొసైటీ చెరువు తవ్వకం సమయంలో జైలు శిక్ష సైతం అనుభవించిన వారున్నారన్నారని, అటువంటి వారి కుటుంబ వారసులు సభ్యులుగా ఉండగా మరోకరిని సభ్యులుగా చేర్చడం సబబు కాదని నిర్ణయించారు. దీనిపై త్వరలో కార్యచరణ రూపొందించి ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు.