అత్యాచారం కేసులో ఇద్దరి అరెస్ట్
ఇన్స్పెక్టర్పై క్రిమినల్ కేసు
పరారీలో పోలీస్ అధికారి
ప్రత్యేక బృందాలతో గాలింపు
బాధితురాలి ఇంటి వద్ద గట్టి భద్రత
బెంగళూరు : పీజీ విద్యార్థినిపై అత్యాచారం చేసిన కేసులో మరో ఇద్దరిని బెంగళూరు నగర పోలీసులు అరెస్ట్ చేశారు. పులకేశీనగరలో గత శుక్రవారం అర్ధరాత్రి పీజీ విద్యార్థిని(22)పై ఐదుగురు అత్యాచారం చేసిన వైనం విదితమే. వీరిలో ప్రధాన నిందితుడిని రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు అలీ అలియాస్ షేక్ ఆలీ, వాసీం ఖాన్‌ను గురువారం అరెస్ట్ చేశారు.
అజ్ఞాతంలో ఉన్న మరో ఇద్దరి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. కాగా, ఇదే కేసుకు సంబంధించి పులకేశీనగర పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ రఫీక్‌ను ఇప్పటికే ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. సామూహిక అత్యాచారం జరిగిన విషయం తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలపై రఫీక్‌పై ఐపీసీ 166(ఎ) కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న సీఐ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతని కోసం డీసీపీ సతీష్‌కుమార్ నేతృత్వంలో పోలీసులు గాలిస్తున్నారు.
ఇదే సమయంలో బాధితురాలి ఇంటి వద్ద పోలీసులు భద్రతను పెంచారు. కేసు ఉపసంహరించుకోవాలంటూ తనకు, తన కుటుంబసభ్యులకు ఫోన్ బెదిరింపులు వస్తున్నాయంటూ బుధవారం నగర పోలీస్ కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్‌ను ఆమె కలిపి ఫిర్యాదు చేయడంతో భద్రతను పెంచారు. కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయన్నా విషయంపై ఆరా తీస్తున్నారు.