నిర్మాత ఇంటిపై మాఫియా కాల్పులు!!
బాలీవుడ్ నిర్మాత, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ యజమాని అలీ మొరానీ ఇంటిపై ముంబై మాఫియాకు చెందిన ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. శనివారం రాత్రి జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారం రోజుల క్రితమే మొరానీకి అండర్ వరల్డ్ డాన్ రవి పూజారి నుంచి డబ్బులు పంపాలని బెదిరిస్తూ ఫోన్ కాల్స్ వచ్చాయి. అయితే ఆయన వాటిని అంతగా పట్టించుకోలేదు.
దాంతో రవి పూజారి గ్యాంగుకు చెందిన ఇద్దరు షూటర్లు జుహు ప్రాంతంలోని మొరానీ ఇంట్లోకి ప్రవేశించి, ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. అదృష్టవశాత్తు ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. ఎవరినీ చంపాలని గానీ, గాయపరచాలని గానీ ఆ గ్యాంగ్ సభ్యులు రాలేదని, కేవలం బెదిరించాలన్నదే వాళ్ల లక్ష్యంగా ఉందని పోలీసులు భావిస్తున్నారు. ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రముఖ నిర్మాతలు కరీం మొరానీ, మహ్మద్ మొరానీల సోదరుడే అలీ మొరానీ. వీళ్లు సినీయుగ్ ఎంటర్టైన్మెంట్ అనే నిర్మాణ సంస్థను నడిపిస్తున్నారు.